- చేపల మార్కెట్లో గుంపులు గుంపులు
- కరోనా రూల్స్ గాలికొదిలేసిన్రు
- రేట్లను పెంచేసిన వ్యాపారులు
- కిలో చికెన్ రూ. 200, మటన్ రూ. 850
- ఆన్ లైన్ మీట్ కూ మస్తు డిమాండ్
- లిక్కర్ షాపుల వద్ద కూడా క్యూ
హైదరాబాద్, వెలుగు: ఐతారం వచ్చిందంటే చాలు చాలా మంది ఇండ్లల్లో నాన్ వెజ్ కామన్. చికెన్, మటన్, చేపలు.. వండుకొని తినాల్సిందే! అయితే, లాక్డౌన్ వల్ల పొద్దున 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే సడలింపులు ఇవ్వడంతో ఈ ఆదివారం జనం ఆ నాలుగు గంటలు నాన్‌వెజ్ షాపుల ముందు బారులు తీరారు. చేపల మార్కెట్లలో ఎగపడ్డారు. మాంసం కొనేందుకు సోషల్ డిస్టెన్స్, మాస్కులు వంటి కరోనా రూల్స్‌ను గాలికి వదిలేశారు. షాపులు తెరిచి ఉంచే టైం తక్కువ కావడంతో వ్యాపారులు తక్కువ సంఖ్యలో మేకలు, కోళ్లను తీసుకొచ్చారు. డిమాండ్ ఎక్కువ ఉండటంతో మటన్, చికెట్ రేట్లను పెంచేశారు. ఉదయం ఆరు గంటల నుంచి ఏ చికెన్ షాపు దగ్గర చూసినా, ఏ మటన్ షాపు దగ్గర చూసినా క్యూ లైన్లే కనిపించాయి. గంటకు పైగా క్యూలో నిలబడితే తప్ప మాంసం దొరకలేదు. చాలా చోట్ల ఉదయం 9 గంటల తర్వాత వచ్చినవాళ్లు మటన్, చికెన్ దొరకక నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. క్యూ లైన్లను చూసి కొందరు.. మాంసం కొని కరోనా తెచ్చుకున్నట్లవుతుందని వెళ్లిపోయారు. ప్రధాన ఫిష్ మార్కెట్లలో అయితే ఎటు చూసినా జనమే కనిపించారు.
నో రూల్స్
ఉదయం 6 గంటల నుంచే జనాలు మటన్, చికెన్ దుకాణాలకు క్యూ కట్టారు. ఎక్కడ దుకాణాలు మూసేస్తారోనని ఆగమాగం చేశారు. కరోనా కట్టడికి లాక్డౌన్ అమలవుతుంటే.. అదేమీ జనానికి పట్టలేదు. సోషల్ డిస్టెన్స్ పాటించలేదు. కొందరైతే మాస్కులు కూడా పెట్టుకోలేదు. హైదరాబాద్‌లోని జియాగూడ, మోండా మార్కెట్, అమీర్ పేట్, బేగంపేట్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, సనత్ నగర్, అంబర్‌పేట్, చిలకలగూడ, కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్ తదితర ప్రాంతాలతోపాటు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. కొన్ని చోట్ల తమకంటే వెనుక వచ్చినవాళ్లకు ఎట్ల ఇస్తారంటూ జనాలు లొల్లులు పెట్టుకున్నారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్– -రాంనగర్ చేపల మార్కెట్ జనంతో కిక్కిరిసిపోయింది. రాష్ట్రంలోని వైన్స్ వద్దాకూడా ఆదివారం జనం బారులు దీరారు.
రేట్లు పెంచేసిన్రు
కరోనాతో ఇప్పటికే నిత్యావసర సరుకులు, ఇతర వస్తువుల ధరలు పెరిగాయి. మాంసం వ్యాపారులు కూడా రేట్లు పెంచేశారు. పైగా డిమాండ్ ఎక్కువగా ఉంటంతో ఇదే మోఖా అనుకున్నారు. ఎక్కువలో ఎక్కువ కిలో మటన్ ధర రూ. 740 ఉండగా.. ఆదివారం మాత్రం రూ. 850 వరకు అమ్మారు. ఇటీవల భారీగా తగ్గిన చికెన్ రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. గత వారం, రెండు వారాల కింద కిలో చికెన్ రూ. 140 దాకా ఉంది. ఇప్పుడు ఏకంగా రూ. 200 దాటింది. కోడి గుడ్ల రేట్లనూ పెంచేశారు.
ఆన్‌లైన్ మీట్‌కు మస్తు డిమాండ్
ఆన్‌లైన్‌లో చికెన్, మటన్, చేపలు బుక్ చేసుకునేందుకు కూడా జనం ఇంట్రస్ట్ చూపుతున్నారు. ఫ్రెష్ టు హోం, లీషియస్, మీటిగో డాట్ కామ్, ఎవ్రీడే మీట్, ఓన్లీ మీట్. ఇన్ తదితర యాప్‌లు మీట్‌ను డెలివరీ చేస్తున్నాయి. ఆదివారం అనేక మంది ఆన్‌లైన్‌లో ఆర్డర్స్ పెట్టుకున్నారు. దీంతో ఆన్‌లైన్ మీట్‌కు మంచి డిమాండ్ పెరిగింది. రేట్లు కూడా సాధారణంగానే ఉన్నాయి. కొన్ని యాప్‌లలో ఆఫర్స్ కూడా పెట్టారు.
అదును చూసి రేట్లు పెంచిన్రు
కరోనాతో తిండికి కూడా కష్టమైపోతున్నది. మొన్నటి దాకా తక్కువ ధరలు ఉండగా, ఇప్పుడు అదును చూసి మళ్లీ పెంచేసిన్రు. పోయిన వారం కిలో చికెన్ రూ. 150 మాత్రమే ఉంది. ఇప్పుడు రూ. 200. అయినా కొనకతప్పలేదు.
- శ్రీనివాస్, కొత్తపేట, హైదరాబాద్
