నిజామాబాద్ పంచాయతీ ఎన్నికల్లో 76.71 శాతం పోలింగ్

నిజామాబాద్ పంచాయతీ ఎన్నికల్లో 76.71 శాతం పోలింగ్
  • కామారెడ్డి జిల్లాలో  86.08 శాతం పోలింగ్​

నిజామాబాద్​,  వెలుగు: నిజామాబాద్​ డివిజన్​లో ఆదివారం జరిగిన మలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 76.71 శాతం ఓటింగ్​ నమోదైంది. మొత్తం 2,38,838 ఓటర్లలో పురుషులు 1,10,927, మహిళలు 1,27,906 ఇతరులు ఐదుగురు ఉండగా 1,83,219 మంది ఓటింగ్​లో పాల్గొన్నారు. వారిలో మహిళలు 1,06,737, పురుషులు 76,479 ఇతరులు ముగ్గురు ఉన్నారు. పురుషుల ఓటింగ్​   68.95 శాతం ఉండగా మహిళలు 83.45 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు.  

డివిజన్​లోని ధర్పల్లి, డిచ్​పల్లి, ఇందల్వాయి, జక్రాన్​పల్లి, మాక్లూర్​, మొపాల్​, నిజామాబాద్​ రూరల్​, సిరికొండ మండలాల్లోని 1,476 పోలింగ్​ సెంటర్లకు ఓటర్లు ఉదయం నుంచే  పోటెత్తారు. డివిజన్​లో మొత్తం 196 గ్రామ పంచాయతీలకు 38 సర్పంచ్​ స్థానాలు ఏకగ్రీవం కాగా మిగితా 158 గ్రామాల్లో  ఎన్నికలు జరిగాయి. మొత్తం1,760 వార్డుల్లో యునానిమస్​ వార్డులు మినహాయించి 1,081 వార్డులకు పోలింగ్​ నిర్వహించారు. సర్పంచ్​ స్థానాలకు 568, వార్డుల నుంచి 2,634 మంది తలపడ్డారు.   మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్​ సెంటర్స్​లోకి వచ్చిన వారిని మాత్రమే ఓటింగ్​కు అనుమతించారు. తరువాత గేట్లు క్లోజ్​ చేశారు. గంట భోజన విరామం తరువాత కౌంటింగ్​ చేపట్టిన అధికారులు.. మొదట వార్డు  మెంబర్ల రిజల్ట్​ తరువాత సర్పంచ్​   రిజల్టు ప్రకటించారు. 

వార్డు సభ్యులుగా గెలిచిన వారిని బయటకు వెళ్లనీయకుండా   ఒక రూమ్ కేటాయించి, సర్పంచ్​ రిజల్టు వచ్చాక అందరినీ హాజరుపర్చి చివర్లో ఉప సర్పంచ్​ ఎన్నిక నిర్వహించారు. ఈ ప్రక్రియ అంతా సజావుగా సాగేలా 1,120 పోలీస్​లతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సెన్సిటివ్​గా గుర్తించిన 59 పోలింగ్​ సెంటర్స్​లో పోలింగ్​, కౌంటింగ్​ను వెబ్​ కాస్టింగ్​ ద్వారా సీపీ సాయిచైతన్య పరిశీలించారు.   

కామారెడ్డి జిల్లాలో  86.08 శాతం పోలింగ్​

కామారెడ్డి :   కామారెడ్డి జిల్లా  ఎల్లారెడ్డి డివిజన్లోని లింగంపేట, గాంధారి, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్​లలోని పిట్లం, నిజాంసాగర్​, మహామ్మద్​నగర్​ మండలాల్లో  ఆదివారం పంచాయతీ ఎన్నికలు జరిగాయి.  పోలింగ్​, కౌంటింగ్​ పక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచే  ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్​ కేంద్రాలకు చేరుకున్నారు.  

రెండో విడతలో ఎన్నికలు జరిగిన 7 మండలాల్లో  మొత్తం  197 పంచాయతీలకు  44 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.  మిగతా 153 పంచాయతీల్లో  ఎన్నికలు జరిగితే  సర్పంచ్​ అభ్యర్థులుగా  506 మంది పోటీ చేశారు.   వార్డు స్థానాలు మొత్తం 1,654 లో  776 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.  5 స్థానాలకు నామినేషన్లు రాలేదు.  

873 వార్డుల్లో  2,655 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు  ఆయా చోట్ల ఎన్నికలు తీవ్ర ఉత్కంటను లేపాయి.  ఎన్నికలు  జరిగిన పంచాయతీల్లో మొత్తం ఓటర్లు  1,64,301 మందిలో పురుషులు 78,476 మంది, మహిళలు 85,822 మంది, ఇతరలు 3 ఉన్నారు. ఇందులో   పురుషులు  67,768 మంది, మహిళలు  73,656 మంది, మొత్తం 1,41,424మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  

86.08 శాతం పోలింగ్​ నమోదైంది. ఈ విడతలో మహిళల కంటే పురుషులే ఎక్కువ మంది తమ ఓటు వేశారు.  మహిళల ఓటింగ్​ శాతం   85.82  శాతం నమోదు కాగా పురుషులు 86.36 శాతం నమోదైంది.  అత్యధిక పోలింగ్​ ఎల్లారెడ్డి మండలంలో 89.72 శాతం, అతి తక్కువగా  83.64 శాతం నమోదైంది. యువత, వృద్ధులు ఆయా గ్రామాల్లో ఉత్సహాంగా వచ్చి ఓట్లు వేశారు. జుక్కల్​ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పిట్లం మండల కేంద్రంలో   ఓటు వేశారు.  

 లింగంపేట మండలం నల్లమడుగులో  మాజీ ఎమ్మెల్యే జాజాల సురేంధర్​   ఓటు హక్కు వినియోగించుకున్నారు. కౌంటింగ్ పక్రియ  మధ్యాహ్నాం 2 గంటల తర్వాత ప్రారంభమైంది.  తక్కువ ఓట్లు ఉన్న గ్రామాల్లో 2 గంటల్లోనే పూర్తి స్థాయి ఫలితాలు రాగా ఎక్కువ ఓట్లు, మేజర్​ పంచాయతీల్లో రాత్రి వరకు ఓట్ల లెక్కింపు జరిగింది.

పర్యవేక్షించిన కలెక్టర్​, ఎస్పీ

 ఎన్నికల సరళిని  కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​, ఎస్పీ రాజేశ్​చంద్ర  పర్యవేక్షించారు.  గాంధారి, లింగంపేట,  పిట్లం, ఎల్లారెడ్డి, మహామ్మద్​నగర్​ మండలాల్లో  వీరు పర్యటించారు.  ఓటర్లతో మాట్లాడి సౌకర్యాల గురించి  తెలుసుకున్నారు. అనంతరం  కలెక్టర్​ మాట్లాడుతూ...  పోలింగ్​ ప్రశాంతంగా జరిగిందని,  యువతతో పాటు, వృద్ధులు కూడా ఉత్సాహంగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు.  అడిషనల్ కలెక్టర్లు విక్టర్​, ​ మదన్ మోహన్​, సబ్​ కలెక్టర్​ కిరణ్మయి, ఆర్డీవో పార్థసారధిరెడ్డి తదితరులు ఉన్నారు.

పోలింగ్​ ఆరంభంలో చలి ఎఫెక్ట్

అన్ని సెంటర్స్​లో ఉదయం 7 గంటలకు ​ పోలింగ్​ షురూకాగా ప్రతి రెండు గంటలకోసారి ఆఫీసర్లు పోలింగ్​ శాతాన్ని ప్రకటించారు. చలి తీవ్రతతో  ఉదయం 9 గంటల వరకు 20.49 శాతమే ఓటింగ్​ జరిగింది. తరువాత  ఓటింగ్​  శాతం పెరిగింది. 11 గంటలకు 49.13 శాతం మధ్యాహ్నం ఒంటి గంటకు 76.71 శాతానికి చేరుకుంది. కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి,  అబ్జర్వర్​ శ్యాంప్రసాద్​లాల్​, సీపీ సాయిచైతన్య పోలింగ్​తో  కౌంటింగ్​ను పరిశీలించారు.