- పామునూరు వద్ద ప్రారంభించిన సౌత్ సెక్టార్ ఐజీ విక్రమ్
వెంకటాపురం, వెలుగు : మావోయిస్టులకు కంచుకోటగా మారిన కర్రె గుట్టలను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. వాజేడు మండలం మురుమూరు గ్రామం నుంచి సుమారు 15 కిలోమీటర్ల గుట్టలు, లోయలను చదును చేస్తూ కర్రెగుట్టల్లోని పామునూర్ గ్రామం వద్దకు రహదారి నిర్మించారు. గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్‌ను మంగళవారం సౌత్ సెక్టార్ ఐజీ విక్రమ్ ప్రారంభించారు. సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ (ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్) మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. కర్రెగుట్టలో బేస్‌క్యాంప్‌ను ఏర్పాటు చేయడం దేశ చరిత్రలోనే చారిత్రాత్మక ఘట్టం అన్నారు.
తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని కర్రెగుట్టలపై ఏర్పాటు చేసిన మొదటి బేస్ క్యాంపు ఇదేనని చెప్పారు. బేస్ క్యాంప్ ఏర్పాటుతో ఇక్కడ 1000 మంది భద్రతా సిబ్బంది ఉండబోతున్నారన్నారు. పామునూరు బేస్ క్యాంప్ నుంచి కర్రె గుట్టలు మొత్తాన్ని కవర్ చేస్తూ జల్లి, డోలి, తడపల గ్రామాలకు రహదారి నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హైదరాబాద్ రేంజ్ డీఐజీ అనిల్ మింజ్, 39వ బెటాలియన్ కమాండెంట్ ప్రశాంత్ కుమార్ శ్రీవాస్తవ, ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పాల్గొన్నారు.
