తగ్గిన క్రూడాయిల్ దిగుమతులు.. గత నెలలో 8.7 శాతం డౌన్

తగ్గిన క్రూడాయిల్ దిగుమతులు.. గత నెలలో 8.7 శాతం డౌన్

న్యూఢిల్లీ: ఈ ఏడాది జులైలో ఇండియా క్రూడాయిల్ దిగుమతులు జూన్‌‌తో పోలిస్తే  8.7 శాతం తగ్గాయి.  18.56 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరాయి.  ఇది ఫిబ్రవరి 2024 తర్వాత కనిష్ట స్థాయి. పెట్రోలియం ప్లానింగ్ అండ్ ఎనాలిసిస్ సెల్ ప్రకారం, కిందటేడాది జులైతో పోలిస్తే ఈ ఏడాది జులైలో క్రూడాయిల్ దిగుమతులు 4.3శాతం తగ్గి 19.40 మిలియన్ టన్నుల నుంచి దిగొచ్చాయి.  పెట్రోలియం ప్రొడక్ట్‌‌ల  దిగుమతులు ఏడాది లెక్కన 12.8శాతం తగ్గి 4.31 మిలియన్ టన్నులకు,  ఇదే టైమ్‌‌ వీటి ఎగుమతులు 2.1 శాతం పడి 5.02 మిలియన్ టన్నులకు చేరాయి.

ఇక దేశీయ ఇంధన వినియోగం కూడా జులైలో 4.3శాతం తగ్గి 19.43 మిలియన్ టన్నులకు తగ్గింది.  రష్యా నుంచి డిస్కౌంట్ ధరకు సెప్టెంబర్, అక్టోబర్ డెలివరీలను ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం  కొనుగోలు చేయగా, నయారా ఎనర్జీ  డార్క్ ఫ్లీట్ ద్వారా ఆయిల్ దిగుమతి కొనసాగిస్తోంది. యూబీఎస్‌‌ ఎనలిస్ట్  జియోవన్నీ స్టానోవో  మాట్లాడుతూ, “రష్యా ఆయిల్ కొనుగోలుపై అమెరికా టారిఫ్ బెదిరింపు, భారత దిగుమతులపై ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది” అని అన్నారు. కాగా, అమెరికా భారత్‌‌పై 50శాతం టారిఫ్‌‌ విధించనున్న నేపథ్యంలో,  ఇరు దేశాల మధ్య సంబంధాలను “ఓపెన్ మైండ్”తో  తిరిగి పరిశీలిస్తామని ప్రభుత్వం  తెలిపింది.