100 డాలర్లు దాటిన క్రూడ్.. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయా? కేంద్రం కీలక నిర్ణయం

100 డాలర్లు దాటిన క్రూడ్.. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయా? కేంద్రం కీలక నిర్ణయం

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితులు భారత వాహనదారులకు కొత్త కష్టాలను తెచ్చిపెట్టబోతున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఊహించని రీతిలో పెరిగిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 115 డాలర్ల మార్కును దాటడం, 2022 తర్వాత క్రూడ్ ధరలు ఇంత భారీ స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. ఈ పరిణామం భారత ఆర్థిక వ్యవస్థపై.. ముఖ్యంగా సామాన్యుడి జేబుపై పెద్ద భారం చూపించనుంది. 

కేంద్ర ప్రభుత్వం పెరిగిన క్రూడ్ ధరల భారాన్ని వెంటనే ప్రజలపై వేయడానికి మొగ్గు చూపడం లేదని ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. ప్రభుత్వ రంగ కంపెనీలైన.. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి సంస్థలే ఈ అదనపు భారాన్ని భరించాలని మోడీ సర్కార్ కోరుతోంది. అంటే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రస్తుతానికి స్థిరంగా ఉంచే అవకాశం ఉంది. అయితే ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

యుద్ధం కారణంగా మరికొన్ని రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ముడిచమురు ధరలు బ్యారెల్ 100 డాలర్ల పైన నిలకడగా కొనసాగితే.. చమురు సంస్థలు ఎక్కువ కాలం నష్టాలను భరించలేవు. ఒకవేళ ఇరాన్ యుద్ధం మరింత ముదిరి, హార్ముజ్ జలసంధి గుండా చమురు సరఫరాకు ఆటంకం కలిగితే.. భారత్‌కు దిగుమతి ఖర్చులు తడిసి మోపెడవుతాయి. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం ధరల పెంపును ఆపడం అసాధ్యమే. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే అది కేవలం రవాణా ఖర్చులకే పరిమితం కాకుండా.. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు అంటే ద్రవ్యోల్బణం పెరగటానికి దారితీస్తుంది.

కాబట్టి.. వాహనదారులు రానున్న రోజుల్లో ధరల పెరుగుదలకు మానసిక సిద్ధంగా ఉండటం మంచిదని అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ముంబైలో పెట్రోల్ రూ.103.49, డీజిల్ రూ.90.01 వద్ద స్థిరంగా ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ పరిణామాలు గమనిస్తుంటే ఈ పరిస్థితి ఎప్పుడైనా మారవచ్చు. అనవసరపు ప్రయాణాలను తగ్గించుకోవడం, ఇంధన పొదుపు పాటించడం వంటి జాగ్రత్తలు సామాన్యులకు కొంత భారాన్ని తగ్గించటంలో తోడ్పడతాయి. గ్లోబల్ మార్కెట్‌లో ముడిచమురు సెగలు తగ్గే వరకు భారతీయ వాహనదారులకు ఈ టెన్షన్ తప్పేలా లేదు మరి.