
హైదరాబాద్, వెలుగు:క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా రాచకొండ పోలీసులకు చిక్కింది. పశ్చిమ బెంగాల్ అడ్డాగా సాగుతున్న ఈ ఆన్‌లైన్ చీటింగ్‌లో గురువారం రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి, హైదరాబాద్ తరలించారు. నిందితుల బ్యాంక్ అకౌంట్స్‌లోని రూ.50 లక్షలు ఫ్రీజ్ చేశారు. 6 సిమ్, 6 ఏటీఎం కార్డులు, చెక్ బుక్స్, 5 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఈ మేరకు సీపీ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌కి చెందిన చోటాభాయ్ అలియాస్ దీపు మండల్(28) ఆన్‌లైన్ క్రిప్టో ట్రేడింగ్ పేరుతో మోసాలకు ప్లాన్ చేశాడు. కోచ్‌బేహర్‌లోని బ్యాంక్ ఎంప్లాయ్ నూర్ అలమ్ హక్(23)తో కలిసి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసేందుకు ప్లాన్ వేశాడు. ఎక్రమ్ హుస్సేన్(23), మహ్మద్ ఇజరుల్(24)తో కలిసి స్థానిక కోకా బస్తీకి చెందిన గ్రామస్తుల పేరుపై 64 బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశారు.
రూ.86 లక్షలు కొట్టేశారు
తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో క్రిప్టో కరెన్సీలో అధిక లాభాలు వస్తాయంటూ నిందితులు సోషల్ మీడియాలో పోస్టులుపెట్టేవారు. దీంతో సెప్టెంబర్‌లో ఘట్‌కేసర్ నారపల్లికి చెందిన బానోతు కిరణ్‌కుమార్‌కు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్స్‌లో పెద్ద మొత్తంలో సంపాదించొచ్చని నమ్మబలికారు. తాము క్రియేట్ చేసిన గ్రూపులో కిరణ్‌ను యాడ్ చేశారు. గ్రూప్ మెంబర్‌లా చాట్ చేస్తూ అధిక లాభాలు వస్తున్నాయని నమ్మించారు. కిరణ్ పేరిట క్రిప్టో అకౌంట్ క్రియేట్ చేశారు. తర్వాత కిరణ్ మొదట రూ.50 వేలు డిపాజిట్ చేశాడు. ఈ డబ్బుకు రూ.10 వేలు ప్రాఫిట్ వచ్చినట్లు బ్యాలెన్స్ చూపించారు. వర్చువల్ అకౌంట్స్‌తో లాభాలు చూపుతూ రూ.86 లక్షలు నుంచి వసూలు చేశారు. తన అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేద్దామనుకున్న కిరణ్‌కు చిక్కు ఎదురైంది. డబ్బు డ్రా కాకపోవడంతో రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాంక్ అకౌంట్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ అకౌంట్లన్నీ పశ్చిమ బెంగాల్ నుంచి ఆపరేట్ అవుతున్నట్లు గుర్తించారు. దీంతో అక్కడి వెళ్లి విచారించి ఇస్లాంపూర్‌లో మహ్మద్ ఇజరుల్‌ను, సిలిగిరిలోని నురలమ్ హక్, ఎక్రమ్ హుస్సేన్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ స్థానిక కోర్టులో ప్రొడ్యూస్ చేసి గురువారం హైదరాబాద్ తరలించారు. ప్రధాన నిందితుడు చోటాభాయ్ కోసం వెతుకుతున్నారు.