
హైదరాబాద్, వెలుగు: రీజనల్ రింగ్‌రోడ్డు కోసం సెప్టెంబర్ రెండో వారంలోగా భూసేకరణ పూర్తి చేయాలని అధికారులను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ట్రిపుల్ ఆర్ భూ సేకరణను అత్యంత ప్రాధాన్య అంశంగా చూడాలన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు పనుల పురోగతిపై మంగళవారం సెక్రటేరియెట్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయపరమైన నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని, జిల్లాస్థాయిలో కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు చేసి భూముల మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. కోర్టు కేసులుంటే త్వరితగతిన పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.
మూడేండ్లలో రీజనల్ రింగ్‌రోడ్డు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదన్నారు. సమీక్షలో టీఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ప్రభుత్వ సలహాదారులు శ్రీనివాస్ రాజు, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, అటవీ శాఖ అడిషనల్ సెక్రటరీ ప్రశాంతి, ఆర్అండ్బీ స్పెషల్సెక్రటరీ హరిచందన, సంయుక్త కార్యదర్శి హరీశ్, కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.