కోడ్‌‌‌‌ పక్కాగా అమలు చేస్తం: సీఎస్ శాంతి కుమారి

కోడ్‌‌‌‌ పక్కాగా అమలు చేస్తం:  సీఎస్ శాంతి కుమారి

హైదరాబాద్, వెలుగు: లోక్‌‌‌‌సభ ఎన్నికల నేపథ్యంలో కోడ్‌‌‌‌ను సమర్థవంతంగా అమలు చేసేందుకు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ శాంతి కుమారి సూచించారు. ఎన్నికల కోడ్ అమలుపై గురువారం సెక్రటేరియెట్‌‌‌‌లో నిర్వహించిన సమావేశంలో సీఎస్‌‌‌‌ మాట్లాడారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే పనిచేశారో అదే స్ఫూర్తితో లోక్‌‌‌‌సభ ఎన్నికల నిర్వహణలోనూ పని చేయాలని అధికారులను కోరారు. రాష్ట్రానికి  పక్కనే ఉన్న   మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌‌‌‌గఢ్ సరిహద్దుల్లో ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల నిర్వహణ, కోడ్‌‌‌‌ అమలుపై అన్ని ప్రధాన శాఖల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌‌‌‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. 

పోలీస్ శాఖ ద్వారా 444 చెక్ పోస్టులు, 9 అంతర్రాష్ట్ర చెక్-పోస్ట్‌‌‌‌లు ఏర్పాటు చేశామని  తెలిపారు. ఇప్పటివరకు పోలీస్ శాఖ రూ.10 కోట్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు లైసెన్స్ లేని ఆయుధాలు, పేలుడు పదార్థాలు, జిలెటిన్ స్టిక్స్, బంగారం కూడా సీజ్‌‌‌‌ చేసిందన్నారు. రవాణా శాఖ ద్వారా 15 చెక్ పోస్టులు, 52 ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ బృందాలను ఏర్పాటు చేశామని, ఇవి 24 గంటలూ పనిచేస్తాయని తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖ ద్వారా 16 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు 31 స్ట్రాటజిక్ పాయింట్లపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. 

గోదాములపై గట్టి నిఘా..

ఓటర్లకు పంచేందుకు తీసుకొచ్చిన వస్తువులను దాచిపెట్టే అవకాశమున్న గోదాములపై ప్రత్యేక నిఘా ఉంచామని సీఎస్‌‌‌‌ తెలిపారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 21 అంతరాష్ట్ర చెక్ పోస్టులు, 6 మొబైల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. అక్రమ మద్యం తయారీకి అవకాశం ఉన్న 8 జిల్లాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. ఇప్పటివరకు రూ.50 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. అటవీ శాఖ ద్వారా 65 చెక్ పోస్టులు ఏర్పాటు కాగా, ఇందులో 18 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో డీజీపీ రవి గుప్తా, స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ, పీసీసీఎఫ్ డోబ్రియల్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, అడిషనల్ డీజీ ఎస్‌‌‌‌కే జైన్, రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాస్‌‌‌‌ రాజు, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి, ఎక్సైజ్‌‌‌‌ శాఖ కమిషనర్ శ్రీధర్, సమాచార పార సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు.