
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని సీఎస్ సోమేష్ కుమార్ చెప్పారు. ఇప్పటికే 61,300 మంది రైతుల నుంచి 3,679 కొనుగోలు కేంద్రాల ద్వారా 4 .61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7 కోట్ల 80 లక్షల గన్నీ బ్యాగులు ఉన్నట్లు చెప్పారు. మరో 8 కోట్ల గన్నీ బ్యాగుల కొనుగోలు టెండర్ల ప్రక్రియ నేటితో పూర్తి అవుతుందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ధాన్యం రాకుండా 17 జిల్లాల సరిహద్దుల్లో 51 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. ధాన్యం సేకరణకు నిధుల సమస్యే లేదన్నారు. వడ్లు కొనగానే రైతులకు చెల్లింపులు చేయడానికి రూ.5వేల కోట్లను ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిందన్నారు. వరంగల్, గద్వాల్, వనపర్తి, భూపాలపల్లి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వరి కోతలు ఆలస్యమయ్యాయని, వరి కోతలు ప్రారంభం కాగానే ఆయా జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు సీఎస్.
రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లు ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. చాలా గ్రామాల్లో కొనుగోలు సెంటర్లు ప్రారంభించినట్లు హడావుడి చేశారు. అధికారికంగా కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేసినా వడ్లు కొనుడు మాత్రం ఇంకా షురూ చేయలేదు. దీంతో కొనుగోలు సెంటర్లకు వడ్లు తీసుకొచ్చిన రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయి నష్టపోయామని రైతులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. కొన్ని కొనుగోలు సెంటర్లలో అయితే ఇప్పటివరకు బస్తా వడ్లు కూడా కొనలేదు. పరదాలు, టర్పాలిన్ కవర్లు కప్పి వర్షం నుంచి వడ్లను కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లు కళ్ల ముందే నీళ్లపాలు అవుతున్నాయంటున్నారు. రెండ్రోజుల కింద పడ్డ వర్షంతో వడ్లు నీళ్లల్లో కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం..