బీడు భూముల్లో సిరుల పంట.. హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

బీడు భూముల్లో సిరుల పంట.. హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
  • బీడుభూముల అభివృద్ధి పథకంతో లబ్ధి
  • అక్కపల్లి గూడెంలో సాగులోకి వస్తున్న పేదల పొలాలు 

జనగామ, వెలుగు :  ఏండ్లుగా రాళ్లలతో నిండి ఉన్న బీడు భూముల్లో ఇప్పుడు సిరుల పంటలు పండుతున్నాయి. ఎంఎన్ఆర్​ ఈజీఎస్​ బీడు భూముల అభివృద్ధి పథకంలో ఎక్కువ మంది కూలీలకు ఒకేచోట ఉపాధి పనితోపాటు బీడు భూములు డెవలప్​ అవున్నాయి. జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​ మండలం అక్కపల్లిగూడెంలో 500లకు పైగా భూముల్లో వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలు సాగవుతున్నాయి. సుమారు 30 ఎకరాల వరకు బీడు భూములున్నాయి. 

వ్యవసాయం ఆధారంగా ఉన్న ఈగ్రామ రైతులకు మేలు చేయాలని సంకల్పించిన గ్రామ కార్యదర్శి భారత అవినాశ్​ ఈజీఎస్​పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. గ్రామంలోని సన్నకారు రైతులను తొమ్మిది మందిని గుర్తించి వారికి సంబంధించిన 12 ఎకరాల బీడు భూములను సాగులోకి తెచ్చాడు. ప్రస్తుతం ఆ భూముల్లో పత్తి పంట సాగు చేస్తున్నారు. 

అంతా ఉపాధి హామీలోనే.. 

బీడు భూముల అభివృద్ధి పథకం కింద ఖర్చంతా ప్రభుత్వమే భరించగా, భూములను వృద్ధిలోకి తీసుకువచ్చారు. గూడెంలోని 12 ఎకరాల బీడును సాగుకు యోగ్యంగా మార్చేందుకు రూ.10 లక్షలకు పైగా కూలీలకు ఖర్చు చేసినట్లు కార్యదర్శి అవినాశ్​ తెలిపారు. 

గ్రామానికి చెందిన పెండ్లి రాజు, పెండ్లి మల్లయ్య, పెండ్లి కుమారస్వామికి చెందిన ఒక్కొక్క ఎకరం చొప్పున, గొట్టం కరుణాకర్, కడుదుల రమ, అనుముల అశోక్, కొంకటి స్వరూప, కూస కొంరయ్య, మేడిద మల్లయ్యకు చెందిన భూములు ఒక్కొక్కరివి ఎకరన్నర చొప్పున 30 మంది కూలీలు రెండు నెలల పాలు పని చేసి బీడు భూములను సాగులోకి తెచ్చారు. కొంత మేర జేసీబీ వంటి యంత్రాలు అవసరమైన చోట సదరు ఖర్చులను రైతులు భరించారు. రాళ్లను దూర ప్రాంతాల్లో వేసేందుకు ఆర్థిక భారం కావడంతో చదును చేసిన భూమిలోని పెద్ద గొయ్యిలను తవ్వి వాటిలో వేశారు. 

చెప్పలేనంత ఆనందంగా ఉంది..

మా తాత ముత్తాతల కాలం నుంచి గుట్టను ఆనుకుని బీడు పడి ఉన్న భూమి సాగులోకి వస్తుందనుకోలే. నాకున్న ఎకరం బీడును ఈజీఎస్​ కింద డెవలప్​ చేసి సాగులోకి తెచ్చిన్రు. చెప్పలేనంత ఆనందంగా ఉంది. ప్రస్తుతం పత్తి పంట వేసిన. ఎర్ర చెల్క కావడంతో పంట మంచిగ వస్తదన్ననమ్మకం ఉంది. - పెండ్లి రాజు, అక్కపల్లిగూడెం రైతు

పత్తి పంట వేసిన.. 

ఏండ్ల నుంచి రాళ్లతో నిండి ఉన్న ఎకరన్నర భూమిని సాగులోకి తెచ్చిన్రు. ఇందులో పత్తి పంట వేసిన. ఏపుగా ఎదుగుతోంది. జవ గల్ల భూమి కావడంతో పంట మంచిగ ఉన్నది. ఈ భూమి సాగులోకి వస్తదని ఊహించలేదు.  - మేడిద మల్లయ్య, అక్కపల్లి గూడెం రైతు

బావుల్లో పూడికతీతకు అనుమతివ్వాలి 

అక్కపల్లి గూడెంలో బీడుభూముల అభివృద్ధి పథకం ద్వారా ఇప్పటికే 12 ఎకరాలను సాగులోకి తెచ్చినం. మరో 18 ఎకరాల వరకు సాగులోకి తెచ్చేందుకు కార్యాచరణ చేస్తున్నం. సాగులోకి వచ్చిన భూముల చుట్టూ కొబ్బరి చెట్లను నాటించి అదనపు ఆదాయం వచ్చేలా చూస్తున్నం. ఈ ఊరిలో పూడికతీతలో శిక్షణ పొందిన వ్యక్తులున్నరు. 

ఈజీఎస్​లో భూముల అభివృద్ధికి అవకాశం ఇచ్చినట్లుగా బావుల్లో పూడికతీతకు సర్కారు చొరవ చూపాలి. వ్యవసాయ ఆధారిత గ్రామం కావడంతో పూడికలు తీస్తే నీళ్లు పెరిగి, పంటలు సమృద్ధిగా పండుతయ్. ఈజీఎస్​లో అవకాశం ఇచ్చి అక్కపల్లి గూడెంను పైలెట్​ప్రాజెక్టుగా ఎంపిక చేయాలి. - భారత అవినాశ్, గ్రామ కార్యదర్శి, అక్కపల్లిగూడెం