పెరిగిన ఖర్చు .. తగ్గిన పసుపు సాగు

పెరిగిన ఖర్చు .. తగ్గిన పసుపు సాగు
  • ఉమ్మడి వరంగల్‌‌లో ఐదేండ్లలో 90 శాతం తగ్గుదల
  • పెట్టుబడి, కూలీల ఖర్చు పెరగడం, రేటు లేకపోవడంతో ఆసక్తి చూపని రైతులు
  • వాతావరణం అనుకూలించక తగ్గుతున్న దిగుబడి
  • మిర్చి, పత్తి సాగుకు మొగ్గు చూపుతున్న అన్నదాతలు

హనుమకొండ, వెలుగు : ఉమ్మడి వరంగల్‌‌ జిల్లాలో పసుపు సాగు ఏటికేడు పడిపోతోంది. ఏడు నుంచి తొమ్మిది నెలల పాటు సాగయ్యే పంట కోసం ఎంత కష్టపడినా మార్కెట్‌‌లో సరైన ధర దక్కకపోవడంతో పాటు విత్తుకునే టైంలో వర్షాలు పడి దిగుబడిపై ఎఫెక్ట్‌‌పై పడుతోంది. దీంతో రైతులు పసుపు సాగును తగ్గిస్తున్నారు. కొంతకాలంగా మిర్చి, పత్తికి రికార్డు ధరలు నమోదు అవుతుండడంతో వాటిని సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా పసుపు సాగు 90 శాతం వరకు తగ్గిపోగా అంతే మొత్తంలో మిర్చి, పత్తి, మక్కజొన్న విస్తీర్ణం పెరుగుతోంది.

పెరిగిన పెట్టుబడి.. తగ్గిన దిగుబడి

ఉమ్మడి వరంగల్‌‌ జిల్లా నేలలు పసుపు, మిరప, పత్తికి అనుకూలంగా ఉంటాయి. గతంలో పసుపు పంటకు డిమాండ్‌‌ ఉండడంతో రైతులు పెద్ద ఎత్తున సాగు చేసేవారు. కానీ ఏటికేడు పెట్టుబడి పెరగడం, ఆశించినంత దిగుబడి, ఆదాయం రాకపోవడంతో గడిచిన ఐదేండ్లలో పసుపు విస్తీర్ణం బారీగా తగ్గిపోయింది. పసుపు విత్తడం నుంచి మొదలుకొని పురుగు మందులు, దున్నడం, కలుపు తీయడం, ఉడకబెట్టడం, ఆరబెట్టడం ఇలా అన్నీ కలిపి ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. సాధారణంగా ఎకరానికి 16 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉన్నా వాతావరణ పరిస్థితులు, వేరు, దుంపకుళ్లు, ఆకుమచ్చ పురుగు వంటి తెగుళ్ల కారణంగా దిగుబడి 8 నుంచి 10  క్వింటాళ్లలోపే ఉంటోంది. దీనికి తోడు క్వింటాల్‌‌కు రూ. 4 వేల నుంచి  5 వేల మధ్యే రైటు పలుకుతుండడంతో రైతులకు గిట్టుబాటు కావడం లేదు. దీంతో పసుపు విస్తీర్ణం తగ్గుతోంది. 

ఐదేండ్లలో 90 శాతం డౌన్‌‌

ఉమ్మడి వరంగల్‌‌ జిల్లాలోని కేసముద్రం, మరిపెడ, మహబూబాబాద్, నర్సంపేట, పరకాల, తదితర ప్రాంతాల్లో ప్రతి ఏటా సుమారు 60 వేల ఎకరాల్లో పసుపు సాగయ్యేది. కానీ గత ఐదేండ్లతో పోలిస్తే ప్రస్తుతం 90 శాతం విస్తీర్ణం తగ్గిపోయింది. వరంగల్ జిల్లాలో 2019లో సుమారు 12,300 ఎకరాల్లో పసుపు సాగు జరుగగా గతేడాది 2,669 ఎకరాలకే పరిమితం అయింది. ఇక ఈ సారి 2,500లోపే ఉంటుందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ఇక హనుమకొండ జిల్లాలో 2019లో 5,538 ఎకరాల్లో పసుపు సాగు జరుగగా, నిరుడు 655 ఎకరాల్లోనే సాగైంది. ఈ సీజన్‌‌లో ఇప్పటివరకే పసుపు కొమ్ము విత్తుకోవాల్సి ఉన్నా వాతావరణం అనుకూలించకపోవడంతో రైతులు దాని జోలికి పోవడం లేదు. దీంతో ఈ సారి పసుపు సాగు ఇంకా తగ్గే అవకాశం ఉందని ఆఫీసర్లు అంటున్నారు. 

మిర్చి, పత్తివైపు రైతుల చూపు

సాధారణంగా పసుపును మే చివరి వారం నుంచి జూన్‌‌ మధ్య వరకు వేస్తుంటారు. జూన్‌‌ దాటితే దిగుబడి తగ్గే ప్రమాదం ఉంటుంది. కానీ ఈ సారి వర్షాభావ పరిస్థితుల వల్ల ఇప్పటివరకు పసుపు సాగుకు అనుకూలమైన పరిస్థితులు కనిపించడం లేదు. ఫలితంగా ఈ సారి పసుపు సాగు మరింత తగ్గుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో రైతులు మార్కెట్‌‌లో డిమాండ్‌‌ ఉన్న మిర్చి, పత్తి వైపు చూస్తున్నారు. గడిచిన మూడేండ్ల నుంచి మిర్చికి మంచి డిమాండ్‌‌ ఉండడం సింగిల్‌‌ పట్టీ, యూఎస్‌‌ 341 వంటి కొన్ని రకాలు రూ.80 వేల వరకు పలకడంతో మిరప తోటలు సాగు చేసేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు. దీంతో పాటు పత్తి, మక్కజొన్న వైపు రైతులు ఆసక్తి చూపుతున్నారు.

పసుపు ఖర్చు ఎక్కువని పత్తి వేసినం 

మాకు ఉన్న ఎకరంన్నర భూమిలో ఇది వరకు పసుపు సాగు చేసే వాళ్లం. కానీ పంటకు సరైన ధర లేకపోవడం, పెట్టుబడి, కూలీల ఖర్చే ఎక్కువ అవుతుండడంతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పత్తికి గిట్టుబాటు మంచిగ ఉండడంతో నాలుగైదు ఏండ్ల నుంచి పత్తి సాగు చేస్తున్నాం.

జక్కుల ఓదెలు, మడిపెల్లి

ఈ ఏడాది మరింత తగ్గొచ్చు 

పసుపు పంటకు సరైన రేటు లేకపోవడంతో సాగు తగ్గుతోంది. వాతావరణ పరిస్థితులు కూడా పసుపు దిగుబడిపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. జులై తర్వాత వేస్తే దిగుబడి తగ్గిపోతుంది. పసుపు సాగు గతంతో పోలిస్తే ఈ సారి మరింత తగ్గే అవకాశం ఉంది.

ఆర్‌‌.ఉమారెడ్డి, ఏడీ, వరంగల్