
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం పూర్తవుతున్న తరుణంలో, విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి, ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఒక నూతన విద్యా విధానం అత్యంత ఆవశ్యకం. వేగంగా మారుతున్న ప్రపంచంలో కేవలం మార్కులకు ప్రాధాన్యత ఇచ్చే పాత పద్ధతులు సరిపోవు. విద్యార్థులను భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం చేయాలంటే, వారికి వినూత్నమైన ఆలోచనలు, విమర్శనాత్మక దృక్పథం, ఆచరణాత్మక నైపుణ్యాలను అందించడం తప్పనిసరి.తెలంగాణ విద్యావ్యవస్థలో విద్యార్థులను కేవలం సమాచారాన్ని స్వీకరించేవారిగా కాకుండా, జ్ఞానాన్ని సృష్టించేవారిగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు జరగాలి.
ప్రాజెక్టులు, బృంద కార్యకలాపాలు, చర్చల ద్వారా విద్యార్థులను సృజనాత్మకంగా ఆలోచించడానికి నిరంతరం ప్రోత్సహించాలి. అంతేకాకుండా, విద్యార్థులకు వివిధ అంశాలపై విమర్శనాత్మకంగా ఆలోచించి, సొంత అభిప్రాయాలను రూపొందించుకోవడానికి ఇక్కడ ప్రోత్సాహం లభించాలి. ఈ బలమైన పునాదిపైనే నూతన ప్రాథమిక విద్యావిధానం రూపుదిద్దుకోవాలి.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ఏ ప్రకారం, ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య ప్రాథమిక హక్కు. విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 12(1)(C), ప్రైవేట్ అన్ఎయిడెడ్ నాన్-మైనారిటీ పాఠశాలలు ప్రవేశ స్థాయిలో 25% సీట్లను వెనుకబడిన, ఆర్థికంగా బలహీన వర్గాల పిల్లలకు రిజర్వ్ చేయాలని నిర్దేశిస్తోంది.
అయితే, ఇది ప్రభుత్వ పాఠశాలలకు ప్రత్యామ్నాయం కాదని, ఒక కిలోమీటరు పరిధిలో ప్రభుత్వ లేదా స్థానిక పాఠశాలలు లేని నిర్దిష్ట ప్రాంతాల్లో మాత్రమే అమలు చేయాలనే స్పష్టత ఇవ్వడం కొంత ఆందోళనకరం. అభ్యసన ఫలితాలను మెరుగుపరచడం, బోధనా నాణ్యతను పెంచడం, అందరికీ సమాన అవకాశాలను కల్పించడం వంటి లక్ష్యాలను నూతన ప్రాథమిక విద్యావిధానం నిర్దేశించుకోవాలి.
గత ఐదేళ్ల తెలంగాణ విద్యారంగాన్ని పరిశీలిస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం 66.54% ఉన్న రాష్ట్ర అక్షరాస్యత రేటు, 2024 నాటికి గణనీయంగా మెరుగుపడి 72.8%కి చేరిందని గణాంకాలు సూచిస్తున్నాయి. అయితే, పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య (హైదరాబాద్ 83.25% కాగా నారాయణపేట 49.93%), అలాగే స్త్రీ, పురుషుల అక్షరాస్యత రేట్ల మధ్య అసమానతలు ఇంకా ప్రస్ఫుటంగా ఉన్నాయి.
అక్షరాస్యత, నమోదు రేట్లు, డ్రాపౌట్ సమస్యలు ఇంకా తీవ్ర సవాళ్లుగా నిలుస్తున్నాయి. మౌలిక సదుపాయాల కొరత, అర్హత కలిగిన ఉపాధ్యాయుల కొరత, గ్రామీణ-, పట్టణ వ్యత్యాసాలు వంటి కీలక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనే లక్ష్యంతో నూతన ప్రాథమిక విద్యావిధానం రూపుదిద్దుకోవాలి.
ఉద్యోగ, ఉపాధులు పెరగనున్నాయి
రాష్ట్ర భవిష్యత్ ఆర్థిక ప్రగతికి చోదకశక్తిగా నిలుస్తున్న తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో నిపుణులైన మానవ వనరుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. రాష్ట్రం 2030 నాటికి సుమారు 16 లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించే దిశగా పయనిస్తోంది, ఇందులో లైఫ్ సైన్సెస్, ఐటీ, పునరుత్పాదకశక్తి, ఎలక్ట్రిక్ మొబిలిటీ, రక్షణ వంటి అధిక వృద్ధి రంగాలలో 5 లక్షల ఉద్యోగాలు ఉండటం విశేషం.
అంతేకాకుండా, ఆహార ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, ప్లాస్టిక్స్, ఎఫ్ఎమ్ సీజీ, గ్రీన్ టెక్నాలజీ, రవాణా వంటి అనేక ఇతర రంగాలలో కూడా అద్భుతమైన వృద్ధి అవకాశాలు ఉన్నాయి. ఈ పెరుగుతున్న డిమాండ్‌ను
తీర్చాలంటే ప్రస్తుత విద్యావ్యవస్థలో నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను సమగ్రంగా చేర్చడం తప్పనిసరి. కేవలం పుస్తక జ్ఞానంతో సరిపెట్టకుండా, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దే నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను పాఠ్యాంశాల్లో చేర్చడం, తద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడటం అత్యంత కీలకమైన అంశం.
జిజ్ఞాసను పెంచాలి
వినూత్నమైన అభ్యసన పద్ధతులలో అనుభవపూర్వక అభ్యసనం ప్రధానమైనది. పాఠ్యపుస్తకాలలోని విషయాలను నిజ జీవితానికి అనుసంధానం చేయడం ద్వారా విద్యార్థులు ఆచరణాత్మక జ్ఞానాన్ని పొందుతారు. ఉదాహరణకు, సైన్స్ తరగతుల్లో విద్యార్థులను స్థానిక పరిశ్రమలు లేదా ప్రయోగశాలలకు తీసుకెళ్లడం, సామాజిక శాస్త్రాలలో స్థానిక సంస్థల పనితీరును పరిశీలించడం వంటివి చేయవచ్చు. ఇది వారికి విషయాలను లోతుగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. అలాగే, ప్రశ్న- ఆధారిత అభ్యసనం కూడా కీలకపాత్ర పోషిస్తుంది. విద్యార్థులు సొంతంగా ప్రశ్నలు అడగడం, వాటికి సమాధానాలను అన్వేషించడం ద్వారా నేర్చుకోవడం అనేది వారిలో పరిశోధనా నైపుణ్యాలను, జిజ్ఞాసను పెంచుతుంది.
ఆధునిక ప్రాథమిక విద్యావిధానంలో సాంకేతికతతో కూడిన విద్య అనివార్యం. ఇంటరాక్టివ్ బోర్డులు, ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లు, వర్చువల్ రియాలిటీ వంటి సాంకేతికతను తరగతి గదుల్లో సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా, కృత్రిమ మేధస్సు (ఏఐ), మెషిన్ లెర్నింగ్(ఎంఎల్) పద్ధతులను ప్రాథమిక విద్యావిధానంలో చేర్చడం ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చు.
విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయడం, బలహీనతలను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, బోధనా పద్ధతులను మెరుగుపరచడంలో ఏఐ/ఎంఎల్ కీలకపాత్ర పోషిస్తాయి. మారుమూల ప్రాంతాల విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్యను అందించడానికి సాంకేతికత ఒక వారధిగా నిలుస్తుంది. ఇంకా, సమస్య-ఆధారిత అభ్యసనం ద్వారా విద్యార్థులకు నిజ జీవిత సమస్యలను ఇచ్చి, వాటికి పరిష్కారాలను కనుగొనమని కోరాలి. ఇది వారిలో సమస్య- పరిష్కార నైపుణ్యాలను, సహకార ఆలోచనను అభివృద్ధి చేస్తుంది.
రేపటి కోసం
తెలంగాణకు అవసరమైన నూతన విద్యా విధానం కేవలం అకడమిక్ విజయాలకు మాత్రమే పరిమితం కాకూడదు. ఇది విద్యార్థులను సృజనాత్మకంగా, విమర్శనాత్మకంగా ఆలోచించేలా ప్రోత్సహించాలి. ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ, మౌలిక సదుపాయాల కల్పన, పరిశోధనలకు ప్రోత్సాహం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సమగ్ర, విద్యార్థి కేంద్రీకృత విధానం ద్వారానే తెలంగాణ విద్యారంగంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించగలదు. రేపటి తరం పారిశ్రామికులను, బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్ది, దేశానికే ఆదర్శంగా నిలపగలదు.
- డా.కట్కూరి,సైబర్ సెక్యూరిటీ & న్యాయ నిపుణుడు–