ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయిన కరెంట్​బిల్లుల బకాయిలు

ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయిన కరెంట్​బిల్లుల బకాయిలు
  • ఒక్క ఎస్పీడీసీల్​పరిధిలోనే దాదాపు రూ.2 వేల కోట్లు

  • ఎమ్మెల్యేల క్యాంప్​ ఆఫీసుల నుంచి కలెక్టర్, ఎస్పీ బిల్డింగులు, ఉన్నతాధికారుల నివాసాలది ఇదే పరిస్థితి

  • ఆ భారం వివిధ పన్నుల రూపాల్లో సామాన్యులపైనే ?

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కార్​ఆఫీసుల కరెంట్​బిల్లుల బకాయిలు కోట్ల రూపాయలలో పేరుకుపోయాయి. ఎమ్మెల్యేల క్యాంప్​ ఆఫీసుల నుంచి కలెక్టర్, ఎస్పీ బిల్డింగులు, జిల్లా పరిషత్​లతో పాటు ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల కరెంట్​బిల్లులు పెండింగ్​లో పడ్డాయి. సామాన్యులు వందల్లో వచ్చిన బిల్లు కట్టకపోతేనే కరెంటు కట్ చేసే విద్యుత్ అధికారులు పెద్దోళ్లు, ఉన్నతాధికారులు లక్షల రూపాయల బిల్లులు కట్టకున్నా సప్పుడు చేయడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలకే కాకుండా, అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లకు వాడుకుంటున్న కరెంటుకు కూడా నెలనెలా బిల్లులే కట్టడం మానేశారు. ఒక్క దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) పరిధిలోనే ఏకంగా 14,142  మంది వినియోగదారులు రూ.50 వేలకు పైగా కరెంటు బిల్లు బకాయి ఉన్నారు. ఇలా దాదాపు రూ.2 వేల కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. ఇందులో 70 శాతం సర్కార్​ కు చెందినవే ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. మరికొన్ని గ్రామ పంచాయతీలు, ప్రైవేట్​ కంపెనీలు, వ్యక్తులకు సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇలా ఎస్పీడీసీఎల్ పరిధిలోనే కాకుండా ఎన్పీడీసీఎల్​ లో కూడా వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. ప్రైవేట్, సర్కార్​వి అన్నీ కలిపితే రూ.12 వేల కోట్లు ఉన్నట్లు ఈఆర్సీ ఇటీవల ప్రకటించింది. 

నల్గొండ జెడ్పీ బకాయి రూ.74 లక్షలు

నల్గొండ జిల్లా పరిషత్​ కార్యాలయం కరెంట్​ బిల్లు బకాయి రూ.74.30 లక్షలుగా ఉంది. వనపర్తి జిల్లా పరిషత్  కార్యాలయం బకాయి రూ. 47.77 లక్షలుంది. మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ సహా మంత్రులంతా ఎన్నికల ప్రచారంలో ఊదర గొట్టారు. ఈ నియోజకవర్గం ఉన్న నల్గొండ జిల్లా పరిషత్ కార్యాలయానికే నెలనెలా కరెంటు బిల్లు కట్టకపోవడంతో బకాయి రూ. 74 లక్షలు దాటింది. 
లిస్ట్​లో ఎమ్మెల్యేల క్యాంప్​ ఆఫీసులు కరెంట్ బిల్లులు ఎగ్గొడుతున్న లిస్ట్ లో ఎమ్మెల్యేల క్యాంప్​ ఆఫీసులు కూడా ఉన్నాయి.  నాగర్​ కర్నూల్​ ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​ రూ.8.89 లక్షల బకాయి ఉండగా.. ఎమ్మెల్యే రెసిడెన్స్​ కమ్​ క్యాంప్​ ఆఫీస్​ బకాయి రూ.7.39 లక్షలు ఉంది. అలాగే, సంగారెడ్డి ఎమ్మెల్యే  క్యాంప్​ ఆఫీస్​, చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీసుల​ బిల్లులు కూడా పేరుకుపోయాయి. కొందరు ఉన్నతాధికారులు నివాసముంటున్న ప్రభుత్వ క్వార్టర్లకు సైతం కరెంటు బిల్లులు కట్టడం లేదు.

 వసూలు చేయకుండా దాచేస్తున్నారు..

రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో  కరెంటు బిల్లు బకాయి రూ.50 వేలకు మించినవారి కనెక్షన్ సంఖ్య, వారి  పేరు వివరాలన్నీ డిస్కంల వెబ్ సైట్​లో  ప్రజల ముందు పెట్టాలి. కానీ, డిస్కంలు ఇలా పెట్టకుండా బిల్లుల ఎగవేతదారుల పేర్లను దాచేస్తున్నాయి. కలెక్టర్ బంగ్లాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల నివాసాల పేర్లు సైట్​లో పెడితే పరువు పోతుందని, దీంతో ఎవరి పేరూ పెట్టొద్దని డిస్కంలను అడ్డుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కొన్ని చోట్ల కనెక్షన్​ కట్​ చేయడానికి వెళ్తున్న విద్యుత్​ సిబ్బందికి ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి ఫోన్​లు పోతున్నట్లు తెలిసింది. తమ ప్రభుత్వమే కదా పైసలు చెల్లించాల్సింది.. ఇస్తంలే కట్ చేస్తే ఉద్యోగం ఉండదంటూ బెదిరిస్తున్నట్లు కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి సపోర్ట్ లేకపోవడంతో తాము ఎలా ముందుకు వెళ్తామని వారు ప్రశ్నిస్తున్నారు.  

ఆ భారం సామాన్యులపైనే !

ప్రభుత్వ శాఖల్లోనే గుట్టలుగా పేరుకుపోయిన బకాయిలను వసూల్ చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ భారాన్ని ప్రజలపై రుద్దీ ఆ పన్నులు.. ఈ ట్యాక్సులంటూ సామాన్యుడి నడ్డివిరుస్తున్నారని మండిపడుతున్నారు. ఏడాదికోసారి రకరకాల చార్జీల పేరుతో బిల్లుల మోత మోగిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో కనెక్టెడ్ లోడ్ పెరిగిందంటూ డెవలప్​మెంట్ చార్జీల పేరిట అదనపు వసూళ్లు చేసిన కరెంట్ సంస్థలు..  ఆగస్టులో గతంలో కంటే ఎక్కువ యూనిట్లు వాడుతున్నారనే సాకుతో అడ్వాన్స్ కన్జంప్షన్ డిమాండ్ (ఏసీడీ) పేరుతో అడ్డగోలుగా డిపాజిట్లు గుంజాయి.  రాష్ట్ర సర్కార్​ ప్రభుత్వ కార్యాలయాలకు నిర్వహణ కింద నిధులు రిలీజ్​ చేయకపోవడంతోనే ఈ సమస్య వస్తుందని తెలిసింది. ఇకనైనా ప్రభుత్వ శాఖల్లో పేరుకు పోయిన కోట్లాది రూపాయల బకాయిల వసూలులో విద్యుత్ శాఖ అధికారులు కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.