సర్వీస్​ చార్జీలు కడ్తలేరని  ట్రాన్స్​ఫార్మర్లకు కరెంట్ కట్

సర్వీస్​ చార్జీలు కడ్తలేరని  ట్రాన్స్​ఫార్మర్లకు కరెంట్ కట్
  • వ్యవసాయానికి ఉచిత విద్యుత్​ ఇస్తున్న రాష్ట్ర సర్కారు 
  • అయినా సర్వీస్​చార్జీలు కట్టాల్సిందే అంటున్న ఆఫీసర్లు
  • అవగాహన లేక కట్టని రైతులు  ఏండ్లుగా బిల్లుల పెండింగ్
  • గద్వాల జిల్లాలోనే  50 ట్రాన్స్ ఫార్మర్లు బంద్
  • పలు జిల్లాల్లో వందల ఎకరాల్లో ఎండుతున్న పంటలు

గద్వాల, వెలుగు: రైతులు వ్యవసాయ కనెక్షన్లకు సర్వీస్​ చార్జీలు కట్టడం లేదని ట్రాన్స్​కో ఆఫీసర్లు కనెక్షన్లు కట్​ చేస్తున్నారు. గతంలో పొలాల్లో తిరుగుతూ స్టార్టర్లు పీక్కెళ్లగా ఇప్పుడు ఏకంగా ట్రాన్స్​ఫార్మర్లకు కరెంట్​బంద్​ పెడుతున్నారు. డొమెస్టిక్​ కనెక్షన్లు కూడా కట్​ చేసి రైతుల ఇండ్లలో చీకట్లు నింపుతున్నారు. ఒక్క జోగులాంబ గద్వాల జిల్లాలోనే నాలుగు మండలాల్లో 50 ట్రాన్స్​ఫార్మర్లకు కరెంట్​ కట్ ​చేయడంతో సుమారు 400 ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, వర్గల్, ములుగు, మర్కూక్ మండలాల పరిధిలోనూ మూడు రోజులుగా  ట్రాన్స్​ఫార్మర్లకు కరెంట్​కట్ ​చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో స్టార్టర్లు ఎత్తుకెళ్తున్నారు. ఫ్రీ కరెంట్​ కావడం వల్లే తాము ఎలాంటి బిల్లులు కట్టట్లేదని, కరెంటోళ్లేమో ఇలా ట్రాన్స్ ఫార్మర్లు బంద్​పెడ్తూ తమ పొలాలు ఎండపెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ట్రాన్స్​ఫార్మర్లు బంద్ చేసి.. స్టార్టర్లు పీకేసి.. 
వ్యవసాయానికి ఫ్రీ కరెంట్​ ఇస్తున్నామని రాష్ట్ర సర్కారు చెబుతున్నా ట్రాన్స్​కో మాత్రం సర్వీస్ చార్జీల కింద నెలకు రూ.30 చొప్పున ఏడాదికి రూ.360 వసూలు చేస్తోంది.  కొంతమంది రైతులు మాత్రం తమకు సర్కారు ఫ్రీ కరెంట్​ఇస్తుండగా, మళ్లీ ఈ సర్వీస్​ చార్జీలు తామెందుకు కట్టాలని ప్రశ్నిస్తున్నారు. సర్వీస్​ చార్జీల గురించి తెలిసిన కొంతమంది చెల్లిస్తుండగా, అసలు సర్వీస్​ చార్జీల సంగతి తెలియని వారు  కట్టకపోవడంతో ఏండ్లుగా బకాయిలు పేరుకుపోయాయి. వీటి వసూళ్ల కోసం తిరుగుతున్న ట్రాన్స్​కో సిబ్బంది అన్ని జిల్లాల్లో వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి స్టార్టర్లు పట్టుకెళ్తున్నారు. సర్వీస్ ​చార్జీలు మొత్తం కట్టాకే తిరిగి ఇచ్చేస్తున్నారు. ట్రాన్స్​ఫార్మర్​ కాలిపోయినప్పుడు, ఏదైనా సమస్య ​వచ్చినప్పుడు దాని పరిధిలోని రైతులందరూ సర్వీస్ చార్జీలు  కడితేనే రిపేర్ చేస్తున్నారు. కాగా, సహనం కోల్పోతున్న రైతులు ఇటీవల స్టార్టర్లు ఎత్తుకెళ్లేందుకు వస్తున్న స్టాఫ్​పై  తిరగబడుతున్నారు. దీంతో ట్రాన్స్ కో ఆఫీసర్లు కొత్త ఐడియా ఆలోచించారు. బకాయిలు ఎక్కువగా ఉన్నచోట్ల మూడురోజులుగా ట్రాన్స్​ఫార్మర్లకు కరెంట్​ కట్ ​చేస్తున్నారు. ఫలితంగా ఆయా ట్రాన్స్​ఫార్మర్ల​ కింద సర్వీస్​ చార్జీలు కట్టని, కట్టిన రైతుల పొలాలు కూడా ఎండిపోతున్నాయి.  

ఇంటి కరెంట్​ బిల్లులో కలుపుతున్నరు 
జోగులాంబ గద్వాల జిల్లాలోని ట్రాన్స్​కో సిబ్బంది నాలుగు రోజులుగా రైతులు సర్వీస్ చార్జీలు కట్టడం లేదని ట్రాన్స్​ఫార్మర్లకు కరెంట్​కట్​చేస్తున్నారు. ఇప్పటికే  ధరూర్, కేటి దొడ్డి, గద్వాల, గట్టు మండలాల్లోని 30 గ్రామాల పరిధిలో 50 ట్రాన్స్ ఫార్మర్లకు కరెంట్ ​బంద్ ​పెట్టారు. అసలే ఎండాకాలం కావడంతో బావులు, బోర్ల కింద  వేసిన వరి,  ఆరుతడి పంటలు ఎండిపోతున్నాయి. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, వర్గల్, ములుగు, మర్కూక్ ​మండలాల పరిధిలో పదుల సంఖ్యలో ట్రాన్స్​ఫార్మర్లకు నాలుగు రోజులుగా కరెంట్​కట్​ చేశారు. ఎన్నిరకాలుగా హెచ్చరించినా సర్వీస్​ చార్జీలు కట్టకపోవడం వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో ట్రాన్స్​ఫార్మర్లకు కరెంట్​ కట్​ చేస్తున్నామని ట్రాన్స్​కో ఆఫీసర్లు చెబుతున్నారు. చాలా జిల్లాల్లో వ్యవసాయ కనెక్షన్లపై సర్వీస్​ చార్జీలను ఇంటి కరెంటు బిల్లులో చేర్చి చెల్లించాలని రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. గద్వాల, నల్గొండ లాంటి జిల్లాల్లో కొద్దిరోజులుగా సర్వీస్​ చార్జీల నెపంతో రైతుల ఇండ్లకు కరెంట్​కట్​చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని హత్నూర, సికింద్లాపూర్, బోర్పట్ల, కాసాల, నాగులదేవులపల్లి, ఎల్లమ్మగూడెం గ్రామాల్లో స్టార్టర్లు ఎత్తుకెళ్తున్నారు. రోజంతా కరెంట్​ నిలిపేస్తుండడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. కాగా, ఒక్కో రైతు దాదాపు రూ.2వేల నుంచి రూ.8వేల వరకు బాకీ పడ్డారని కరెంటోళ్లు చెబుతున్నారు. ముం దస్తు నోటీసులు ఇవ్వకుండా ఇలాంటి చర్యలకు పాల్పడడం కరెక్ట్​ కాదని రైతులు వాదిస్తున్నారు. పంట మధ్యలో వేలకు వేలు తెచ్చి కట్టమంటే తాము ఎక్కడి నుంచి తెస్తామని, పంట పండి చేతికి డబ్బు వచ్చాక కట్టే అవకాశం కల్పించాలని కొందరు కోరుతున్నారు. 

ఇయర్​ ఎండింగ్​ అవుతోందని ఒత్తిడి తెస్తున్నం 
సర్వీస్​ చార్జీలు కట్టాలని రైతులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. వారిలో భయం ఉండాలనే కరెంట్ కనెక్షన్లు తొలగిస్తున్నాం. రైతుల్లో అవగాహన పెరగాలి. ఇయర్ ఎండింగ్ కావడంతో రైతులపై కొంత ఒత్తిడి తెస్తున్నాం. వారు కూడా ముందుకు వచ్చి బిల్లులు కడుతున్నారు.   
– మోహన్, డీఈ, జోగులాంబ గద్వాల జిల్లా

ఇండ్ల కరెంట్​ కనెక్షన్ తొలగిస్తున్నరు
వ్యవసాయ కనెక్షన్​సర్వీస్ చార్జీలు కట్టడం లేదంటూ ట్రాన్స్​ఫార్మర్లు బంద్​పెడ్తున్నరు. దీంతో పొలాలు ఎండిపోతున్నయి. వాటిని కాపాడుకునేందుకు మేము తండ్లాడుతుంటే  ఇప్పుడు మా ఇండ్లకు  కరెంట్​ కట్​ చేస్తున్నరు. వేల కొద్దీ బకాయిలు ఇప్పటికిప్పుడు కట్టుమంటే ఎట్ల? రైతులకు పంట పండితేనే పది పైసలు చేతికస్తయి. పంట పండినంక కట్టే చాన్స్​ఇయ్యాలె.
– యుగంధర్​రెడ్డి, రైతు, బీరెల్లి

పంటలు ఎండిపోతే ఎట్లా? 
సర్కారేమో ఫ్రీ కరెంట్​ అంటది. ఆఫీసర్లేమో సర్వీస్​చార్జీలు అంటరు. ట్రాన్స్​ఫార్మర్లకు కరెంట్ కట్ చేసి రైతుల పంటలను ఎండవెడ్తున్నరు. ఎండిపోయిన పంటలకు ఎవరు బాధ్యత వహిస్తరు. కరెంట్ ఆఫీసర్లే పరిహారం ఇయ్యాలె. అందరూ వచ్చి రైతుల మీదనే రుబాబు చూపిస్తున్నరు. 
– రవీంద్ర నాయుడు, రైతు, ధరూర్