పంటలు ఎండుతుండడంతో రోడ్డెక్కుతున్న రైతులు

పంటలు ఎండుతుండడంతో రోడ్డెక్కుతున్న రైతులు

నాగర్​కర్నూల్​/నెట్​వర్క్​, వెలుగు: రాష్ట్రంలో వ్యవసాయానికి కరెంట్​ కోతలు తీవ్రమయ్యాయి. ​‘సేద్యానికి 24 గంటల నాణ్యమైన కరెంట్’ అనే సర్కారు స్లోగన్​ కీలక సమయంలో తుస్సుమన్నది. రిజర్వాయర్లు ఖాళీ అయ్యి, బోర్లలో నీళ్లు తగ్గి, ఎండలు మండుతున్న వేళ కేవలం పగటి పూట ఇస్తున్న 9 గంటల కరెంట్​తో వరి పొలాలు ఎండుతున్నాయి.  సాయంత్రం ఆరు గంటలకో,  తెల్లవారుజామున 3,4 గంటలకో మోటర్​ ఆన్​చేసి చివరి మడి దాకా తడులు ఇవ్వాలనుకుంటే కరెంట్​ ఉండట్లేదు. పగటి పూట ఎండల కారణంగా ప్రతిసారీ మొదటి మడి నుంచి కిందికి దిగట్లేదు. దీంతో మరో రెండు తడులు పెడితే చేతికి అందివచ్చే పంటలు కండ్ల ముందే ఎండిపోతుండగా, రైతన్నలు కన్నీరుమున్నీరవుతున్నారు. 

 12 గంటలకు పైగా కోతలు.. 

రాష్ట్రంలో రోజురోజుకు కరెంట్​ వినియోగం పెరుగుతోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ స్థాయి డిమాండ్ రావడం ఇదే మొదటిసారి అని ఆఫీసర్లు చెబుతున్నారు. గతేడాది  మార్చి 31న 13,688 మెగా వాట్స్ అత్యధిక డిమాండ్ కాగా, ఈసారి అదే రోజు 13,742 మెగా వాట్స్ డిమాండ్ నమోదైంది. దీనిని తట్టుకునేందుకు సర్కారు ఆదేశాలతో విద్యుత్​ పంపిణీ సంస్థలు అగ్రికల్చర్​ సెక్టార్​కు కోతలు పెడ్తున్నాయి. చాలా జిల్లాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5వరకే కరెంట్​ ఇస్తున్నాయి. ఆ తర్వాత కరెంట్​ ఉండట్లేదు. ఈ యాసంగిలో రైతులు 54,41,985 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా, అత్యధికంగా 35,84,187 ఎకరాల్లో వరి(65%పైగా) వేశారు. ప్రస్తుతం దాదాపు అన్ని చోట్ల వరి పొలాల్లో వడ్లు గట్టి పడుతున్న దశలో, కోతకు వచ్చే దశలో ఉన్నాయి. రెండు, మూడు తడులు గట్టిగా పెడితే బయటపడుతాయి. అయితే రెండువారాలుగా ఉదయం 9 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి.  కాలువ నీళ్లు కూడా రాకపోవడంతో బోర్లు, బావులే దిక్కవుతున్నాయి. చాలా చోట్ల ఇందులో నీళ్లు అడుగంటాయి. ఊరిన నీళ్లను ఊరినట్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి. సహజంగా ఎండలు ముదిరాక రైతులు వరి పొలాలకు చీకటి పడ్డాకో, తెల్లవారు జామున 3, 4 గంటలకో మోటర్ ​ఆన్ ​చేసి తెల్లారేదాకా నీళ్లను పారిస్తారు. ఆ టైంలో మాత్రమే కింది మడులకు నీళ్లు దిగుతాయి. ఎండ పూట పెడితే వేడి కారణంగా కిందికి దిగే పరిస్థితి ఉండదు. దీంతో పంట పొలాలు ఎండుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  చాలాచోట్ల మిర్చి, శనగ, కంది లాంటి ప్రత్యామ్నాయ పంటలు కూడా ఎండిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. 

 మూగజీవాలను మేపుతున్న రైతులు.. 

వ్యవసాయానికి 12 గంటలకు పైగా కరెంట్​కోతలు విధించడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఇటీవల మెదక్ జిల్లా చేగుంట, రామాయంపేట మండలం డి. ధర్మారం, నిజాంపేట్ మండలం నార్లాపూర్ లో రైతులు సబ్ స్టేషన్లను ముట్టడించారు. శివ్వంపేట మండలం ఉసిరిక పల్లి వద్ద వివిధ గ్రామాల రైతులు రాస్తారోకో చేశారు. కరీంనగర్​ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ రైతులు హుస్నాబాద్ – కరీంనగర్ రోడ్డుపై ధర్నా చేశారు. ఉమ్మడి మహబూబ్​నగర్​, నిజామాబాద్​, వరంగల్.. ఇలా అన్ని జిల్లాల్లోనూ రైతులు రోడ్డెక్కుతున్నా సర్కారు పట్టించుకోవడం లేదు. దీంతో పొలాలు ఎండిపోతుండగా, చాలా మంది రైతులు మూగజీవాలను మేపుతున్నారు. సర్కారుకు తీరువల్ల చేతికి అందివచ్చే దశలో పంటలను కోల్పోయి పెట్టుబడులకు మునుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎప్పుడు వస్తదోతెలుస్తలేదు.. 

అప్పు సప్పు చేసి బోర్లు వేసి మోటర్లు పెట్టినం. కానీ కరెంట్ ఎప్పుడొస్తదో తెలుస్తలేదు. పగలు ట్రిప్​ అయితంది. రాత్రి కరెంట్​ ఉంటలేదు. పొలాలు ఎండుతున్నాయి. ఒక్క రోజు తడి తప్పితే మళ్లీ పార్తలేవు. చేసిన కష్టమంతా దండుగ అయితంది. 
– రామస్వామి, రైతు, కల్వకుర్తి, నాగర్​కర్నూల్​ జిల్లా

ఐదెకరాల వరి ఎండిపోతాంది..

24గంటల కరెంటు ఇస్తున్నరని ఐదెకరాల్లో వరి వేసిన. కానీ నాలుగైదు రోజుల సంది 8 గంటల నుంచి 11 గంటలు మాత్రమే కరెంట్​ ఇస్తున్నరు. నీరందక పంట ఎండిపోతున్నది. పొట్ట దశలో వరి ఎండి పోవడంతో పంట కోసం  చేసిన అప్పులు తీరే పరిస్థితి లేదు. ఆఫీసర్లు 24 గంటల కరెంటు ఇయ్యాలె.
– మోత్కూరి శ్రీనివాస్,​ రైతు, మీనాజీపేట, మహాముత్తారం మండలం, జయశంకర్​ జిల్లా

15 రోజులైనా కరెంట్ సక్కగ ఇయ్యుర్రి 

నేను మూడున్నర ఎకరాల్లో వరి, మరో మూడున్నర ఎకరాల్లో మొక్కజొన్న వేసిన. 15 రోజులైతే పంట కోతలు పూర్తయితయి. ఈ పదిహేను రోజులైన కరెంట్ సక్కగా ఇస్తే మా పంటలు చేతికి వస్తయి. నీళ్లు కడుదామని పొలానికి పోతే ఒక రోజు ముందు..మరో రోజు గంట లేటు వస్తోంది. పగలు ఇచ్చే కరెంట్​లో మూడు నాలుగు సార్లు ట్రిప్ ​చేస్తూ అరగంట నుంచి గంట వరకు కోత పెడుతున్నరు. అడిగితే పై నుంచి కట్ చేయమన్నారని, మెయింటనెన్స్​ అని దాటవేస్తున్నరు.   
- గంగాడి తిరుపతిరెడ్డి, గుమ్లాపూర్, చొప్పదండి మండలం, కరీంనగర్ జిల్లా