ఫామ్‌ హౌస్‌ డ్రగ్స్ కేసులో ముగిసిన కస్టడీ

ఫామ్‌ హౌస్‌ డ్రగ్స్ కేసులో ముగిసిన కస్టడీ
  •     రోహిత్ రెడ్డి సహా ముగ్గురు నిందితులను విచారించిన సిట్‌
  •     కోర్టు ఆదేశాలతో జైలుకు తరలింపు

హైదరాబాద్‌, వెలుగు: ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి సహా ముగ్గురు నిందితుల మూడు రోజుల సిట్ కస్టడీ ముగిసింది. దీంతో రోహిత్‌రెడ్డి ఆయన సోదరుడు రితేశ్​రెడ్డి, ఢిల్లీకి చెందిన రియల్టర్‌‌ నమిత్‌ శర్మను అధికారులు గురువారం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. సిట్ అదుపులో ఉన్న డాక్టర్ బాలాజీకి నోటీసులు ఇచ్చి వదిలేశారు. 

కాగా, రోహిత్ రెడ్డి సహా ముగ్గురు నిందితులు ఇప్పటికే జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నందున కోర్టు ఆదేశాల మేరకు వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరో 5 రోజులపాటు కస్టడీ పొడిగించాలని కోరుతూ సిట్‌ అధికారులు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని రోహిత్‌ రెడ్డి తరఫు న్యాయవాదులకు కోర్టు సూచించింది.  

సేకరించిన ఆధారాలతో దర్యాప్తు ముమ్మరం

కస్టడీలో ఫామ్​హౌస్​కు డ్రగ్స్​లింకులపైనే సిట్​అధికారులు విచారణ కొనసాగించారు. సేకరించిన ఆధారాలతో కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. రోహిత్‌ రెడ్డికి డ్రగ్స్ సప్లై చేసిన రాకేశ్​శర్మ, అభిషేక్ సింగ్‌, మరో ఇద్దరు పెడ్లర్ల కోసం గాలిస్తున్నారు.