తగ్గుతున్న డీటీహెచ్​ కనెక్షన్లు

తగ్గుతున్న డీటీహెచ్​ కనెక్షన్లు
  •     తరచూ సమస్యలు రావడమే కారణం
  •     బ్రాడ్ ​బ్యాండ్​కు పెరుగుతున్న ఆదరణ 

హైదరాబాద్​, వెలుగు :  డైరెక్ట్- టు -హోమ్ (డీటీహెచ్) సేవలకు కస్టమర్లు దూరమవుతున్నారు. బదులుగా బ్రాడ్​బ్యాండ్​ కనెక్షన్లను తీసుకుంటున్నారు. వాతావరణం బాగాలేనప్పుడు డీటీహెచ్​ సేవలు ఆగిపోవడం, యాడ్స్​ రావడం, కోరుకున్న ప్రోగ్రామ్​ను ఎప్పుడుపడితే అప్పుడు చూడలేకపోవడం ఇందుకు కారణాలు.  బదులుగా వినోదం కోసం  ఫైబర్ నెట్​ కనెక్టివిటీ వైపు మొగ్గుచూపుతున్నారు. డీటీహెచ్ సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్లు గణనీయంగా తగ్గుతున్నాయని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్​) తాజా డేటా వెల్లడించింది. 

గత మూడు నెలల కాలంలో 13.20 లక్షల మంది కస్టమర్లు తమ డీటీహెచ్ ప్రొవైడర్లతో సంబంధాలను తెంచుకున్నారు. వాతావరణ పరిస్థితులు, సాంకేతిక లోపాల వల్ల సర్వీస్ అంతరాయాలకు గురయ్యే ప్రమాదం ఉండటం  డీటీహెచ్ సేవలకు ప్రధాన సమస్యగా మారింది. మరోవైపు వైఫై సేవలకు, ఇతర వినోద అవసరాలకు ఫైబర్ కనెక్షన్లు బలమైన, నమ్మదగిన ప్రత్యామ్నాయాన్ని అందిస్తున్నాయి. వీటి వల్ల నచ్చిన ప్రోగ్రామ్​ను ఎప్పుడైనా చూసే వీలుంటుంది. 

వాతావరణం వంటి సమస్యలు ఉండవు. ఓటీటీ చూడటానికి బ్రాడ్​బ్యాండ్​ కనెక్షన్​ తప్పనిసరి.  ఫైబర్ కనెక్షన్‌‌‌‌‌‌‌‌ల ద్వారా లైవ్ స్పోర్ట్స్, తాజా సినిమాలు, వెబ్ సిరీస్ లు, ప్రముఖ టీవీ షోలతో సహా అనేక రకాల కంటెంట్‌‌‌‌‌‌‌‌ను చూడవచ్చు. వీటి ధరలు కూడా అందుబాటులో ఉండటంతో డిమాండ్​ పెరుగుతోంది. అందుకే 2.23 కోట్ల మంది వినియోగదారులు ఇప్పటికే ఫైబర్ కనెక్షన్లకు మారారని లెక్కలు చెబుతున్నాయి.