
- వాడకందారుల్లో నెలకొన్న అయోమయం
- రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్ గైడ్ లైన్స్ రాలేదంటున్న సివిల్ సప్లై శాఖ
హైదరాబాద్,వెలుగు : అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రూ. 500కే వంటి గ్యాస్ సిలిండర్ స్కీమ్‌పై కస్టమర్లలో అయోమయం నెలకొంది. దీంతో వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరి నిల్చుంటున్న పరిస్థితి సిటీలో ఉంది. అయితే.. ఈ నెలాఖరులోగా గ్యాస్ డీలర్ల వద్ద ఈ– కేవైసీ చేయించాలనే ప్రచారంలో నిజం లేదని రాష్ట్ర సివిల్సప్లై అధికారులు స్పష్టం చేస్తున్నారు.
రూ. 500 లకు గ్యాస్ స్కీమ్ పై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని పేర్కొంటున్నారు. కొద్దిరోజులుగాసిటీలోని గ్యాస్ ఏజెన్సీల వద్ద కస్టమర్లు ఈ– కేవైసీ నమోదుకు క్యూ కడుతున్నారు. అయితే.. ఉజ్వల్ స్కీమ్ లో భాగంగా లబ్ధిదారుల వివరాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు డీలర్ల వద్ద ఈ– కేవైసీ నమోదు చేసుకోవచ్చని రాష్ట్ర సివిల్ సప్లై శాఖ ఎన్ఫోర్స్మెంట్డిప్యూటీ తహసీల్దార్రఘునందన్తెలిపారు.
గ్యాస్ వాడకం దారులు ఆందోళన చెంద వద్దని, ఇంకా సమయం ఉందని, ఏజెన్సీల వద్ద గంటల తరబడి బారులు తీరి నిల్చోవద్దని ఆయన సూచించారు. ఎవరైనా ఈ–కేవైసీ నమోదుకు డబ్బులు డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. కేంద్రం పేదల కోసం ప్రవేశ పెట్టిన ఉజ్వల స్కీమ్ లో భాగంగానే ఈ–కేవైసీ తీసుకుంటున్నట్టు స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 500 సిలిండర్ స్కీమ్ ఇంకా ప్రారంభించలేదని, దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
ఇంటి వద్దనే ఈ– కేవైసీ అప్ డేట్
గ్యాస్ కస్టమర్ల ఇళ్ల వద్దకే ఏజెన్సీలు వెళ్లి ఈ– కేవైసీ నమోదు చేయాలని ఆయిల్‌కంపెనీలు ఆదేశాలు జారీ చేశాయి. గ్యాస్సిలిండర్డెలివరీ సమయంలోనే సిబ్బందితో ఈ – కేవైసీ తీసుకోవాలని ఆయిల్‌కంపెనీలు కూడా గైడ్ లైన్స్ ఇచ్చినట్టు రాష్ట్ర సివిల్ సప్లై శాఖ అధికారులు తెలిపారు. గ్రేటర్‌సిటీలో ప్రస్తుతం దాదాపు 8.5లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. భారత్, ఇండేన్ , హెచ్ పీ గ్యాస్సంస్థలకు చెందిన120 మంది డీలర్లు సేవలు అందిస్తున్నారు.
ఆయిల్ కంపెనీలు ఆదేశించినట్టుగానే డీలర్లు కస్టమర్ల ఇంటి వద్దకే వెళ్లి ఈ– కేవైసీలు తీసుకుంటారని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ ఎల్పీజీ డిస్ర్టిబ్యూటర్స్అసోసియేషన్అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఈ –కేవైసీ నమోదుకు ఏజెన్సీల వద్ద బారులు తీరుతూ.. ఆందోళన సృష్టించవద్దని ఆయన ఒక ప్రకటనలో కోరారు.
కస్టమర్లు తమ ఆధార్‌కార్డులు, ఇతర పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. కేవైసీ నమోదులో ఏదైనా సాంకేతిక సమస్య వస్తే .. సంబంధిత డీలర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో డీలర్లు కూడా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దీంతో ప్రతి రోజూ గ్యాస్ ఏజెన్సీల ఆఫీసుల వద్ద కస్టమర్లు బారులు తీరి నిల్చుంటున్న పరిస్థితి ఉంది.