ఢిల్లీ ఫ్యాక్టరీలో పేలుడు.. బవానా పారిశ్రామికవాడలోని సెక్టార్–2లో ప్రమాదం

ఢిల్లీ ఫ్యాక్టరీలో పేలుడు.. బవానా పారిశ్రామికవాడలోని సెక్టార్–2లో ప్రమాదం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఓ భవనం కుప్పకూలింది. శనివారం  తెల్లవారుజామున బవానా పారిశ్రామికవాడలోని సెక్టార్–2లో ఉన్న ప్లాస్టిక్ బాటిళ్ల తయారీ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సర్వీసెస్ అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిప్రమాదంతో సంభవించిన పేలుడు ధాటికి బిల్డింగ్ కుప్పకూలిపోయిందని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయని చెప్పారు. 

బిల్డింగ్ అంతా దట్టమైన పొగ అలుముకుందని వివరించారు. అయితే, ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదని పేర్కొన్నారు. భారీ పేలుడు సంభవించడంతో సమీప ప్రాంత ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారని, ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారని వివరించారు. శిథిలాలు చెల్లాచెదురుగా ఉండటంతో రెస్క్యూ చర్యలు చేపట్టడం కష్టతరంగా మారిందని వెల్లడించారు. పేలుడుకు కారణమేంటో తెలసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.