
హైదరాబాద్, వెలుగు: ములుగు వంటి ప్రాంతాల్లో సింగిల్ రోడ్లు కూడా రావడం లేదని, అభివృద్ధికి అటవీ చట్టాలు అడ్డుగా ఉన్నాయని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో పంచాయతీ, ఆర్ అండ్ బీ రోడ్లు, మౌలిక వసతుల కల్పనపై అటవీ శాఖ అనుమతులలో జాప్యం, సమస్యల పరిష్కారం కోసం మంత్రి కొండా సురేఖతో కలిసి సీతక్క ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
సీతక్క మాట్లాడుతూ హైదరాబాద్ వంటి నగరాల్లో స్కైవేలు, హైవేలు, ఆరు వరుసల రోడ్లు వస్తున్నాయన్నారు. రహదారి సదుపాయం లేకపోతే తమ ప్రాంతాలు ఎలా అభివృద్ధి సాధిస్తాయని ప్రశ్నించారు. రోడ్డు సౌకర్యం లేక గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. అడవి, ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధి జరగనీయకపోతే అంతరాలు పెరుగుతాయన్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అటవీ శాఖ సహకరించాలని కోరారు. ‘‘వన్యప్రాణులకు ప్రమాదం అని రహదారులు వేయనీయకపోతే ఎలా? వన్యప్రాణులకు ప్రత్యేక బ్రిడ్జిలు వేయడం ద్వారా వాటిని కాపాడుకోవచ్చు. ఇతర రాష్ట్రాల్లో ఏ రకంగా అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారో ఇక్కడ కూడా అవే నిబంధనలను అమలు చేయాలి.
ప్రజల సౌకర్యార్థం అటవీచట్టాల్లో కొన్ని సడలింపులు ఉన్నాయి. వాటిని వర్తింపజేసి ములుగు, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం వంటి ప్రాంతాల్లో రోడ్ల సదుపాయం కల్పించాలి. మేడారం జాతర కోసం ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలి” అని సీతక్క పేర్కొన్నారు.
అటవీ ప్రాంతాల అభివృద్ధికి సహకరిద్దాం: సురేఖ
అటవీ ప్రాంతాల అభివృద్ధికి ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అధికారులు సహకరించాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. అటవీ సంరక్షణ, గిరిజనుల అభివృద్ధి రెండూ ముఖ్యమేనని పేర్కొన్నారు. నిబంధనలను పాటిస్తూ అటవీ ప్రాంత ప్రజలను ఇబ్బంది పెట్టకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. స్టేజ్-1లో గురించి రెండు, మూడు రోజుల్లో నివేదిక అందజేయాలని ఆదేశించారు.
రహదారుల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని అటవీ చట్టాలు చెబుతున్నాయని, 1980 కన్నా ముందు ఉన్న రహదారులు పాడైతే మరమ్మతులు చేపట్టవచ్చని, అవసరమైన చోట కొత్త రహదారులు నిర్మించవచ్చని చెప్పారు. అటవీ శాఖ నిబంధనలు అడ్డుగా ఉంటే చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి పర్మిషన్ తెప్పించాలని సూచించారు.