
- ఆగస్టు నాటికి సరఫరా చేయాల్సింది 8.30 లక్షల టన్నులు కాగా, మూడు లక్షల టన్నుల లోటు
- రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం క్యూలైన్లు
- పార్లమెంట్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
- తాజాగా కేంద్రం తీరుపై సీఎం రేవంత్ ఫైర్
- కిషన్ రెడ్డి, బండి సంజయ్మోదీ భజన చేస్తున్నరు
- పార్లమెంట్‌లో బీఆర్ఎస్ ఎంపీలు పత్తా లేరని మండిపాటు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో యూరియా కొరతపై లొల్లి ముదురుతున్నది. ఈ విషయంలో కేంద్రం తీరుపై రాష్ట్ర ప్రభుత్వం గుర్రుగా ఉన్నది. ఆగస్టు నాటికి సరఫరా చేయాల్సిన 8.30 లక్షల టన్నుల యూరియాలో ఇప్పటివరకూ 5.30 లక్షల టన్నులే వచ్చింది. సుమారు 3 లక్షల టన్నుల లోటు ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రానికి అవసరమైన యూరియా సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, అధికారులు ఎప్పటికప్పుడు కేంద్రానికి లేఖలు రాస్తున్నా.. ఢిల్లీ వెళ్లి విజ్ఞప్తి చేస్తున్నా.. పెద్దగా ఫలితం లేకుండా పోయింది. ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వేదికగా ఆందోళన చేపట్టినా కేంద్రం నుంచి స్పందన రాలేదు. దీంతో ఈ ఇష్యూపై సీఎం రేవంత్‌రెడ్డి ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
వానాకాలం సీజన్‌లో రైతులకు అవసరమైన యూరి యా సరఫరా చేయడంలో కేంద్రం నిర్లక్ష్యం, వివక్ష ప్రద ర్శిస్తున్నదని సీఎం ఆరోపించారు. ఇలాంటి సమ యంలో రాష్ట్ర రైతాంగానికి అండగా నిలవాల్సిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్.. మోదీ భజనలో బిజీగా ఉన్నారని ఫైర్ అయ్యారు.
యూరియా సరఫరాలో లోటు
ఈ వానాకాలం సీజన్ కోసం రాష్ట్రానికి కేంద్రం 9.80 లక్షల టన్నుల యూరియా కేటాయించగా, ఆగస్టు నాటి కి 8.30 లక్షల టన్నులు సరఫరా చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కేవలం 5.32 లక్షల టన్నుల యూరియా మాత్రమే సరఫరా చేయడంతో 2.98 లక్షల టన్నుల లోటు ఏర్పడింది. వాస్తవానికి.. రాష్ట్రంలో సాగయ్యే పం టలకు 12 లక్షల టన్నుల యూరియా అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కానీ, కేటాయింపుల్లోనే కేంద్రం 2.20 లక్షల టన్నులు కోతపెట్టింది. పోనీ, కేటాయించిన మొత్తమైనా నెలనెలా సరఫరా చేస్తుందా? అంటే అదీ లేదు. ఏప్రిల్‌లో 1.70 లక్షల టన్నుల కేటాయింపుకుగానూ 1.21 లక్షల టన్నులు మాత్రమే సరఫ రా చేసి, 49 వేల టన్నుల కోత విధించింది. మే నెలలో 1.60 లక్షల టన్నుల కేటాయింపుకు 88 వేల టన్నులు, జూన్‌లో 1.70 లక్షల టన్నులకు 98 వేల టన్నులు, జులైలో 1.60 లక్షల టన్నులకు 1.43 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేసింది. ఆగస్టు 19 నాటికి 1.70 లక్షల టన్నుల కేటాయింపుకుగానూ 82 వేల టన్నులు మాత్రమే సరఫరా జరిగింది. మొత్తమ్మీద ఈ నెలవరకు ఇవ్వాల్సిన 8.30 లక్షల టన్నుల కోటాలో సుమారు 3 లక్షల టన్నుల లోటు ఉండడంతో సమస్యలొస్తున్నాయి. దీంతో పొలాల్లో ఉండాల్సిన రైతులు యూరియా కోసం సొసైటీలు, షాపుల ముందు బారులు తీరుతున్నారు.
సీఎం, రాష్ట్ర మంత్రుల విజ్ఞప్తులు వృథా
యూరియా కోటాను పూర్తిగా సరఫరా చేయాలని గత నెలలో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాను సీఎం రేవంత్ కలిసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కూడా పలుమార్లు లేఖలు రాసి, కేంద్ర మంత్రిని కలిశారు. కాంగ్రెస్ ఎంపీలు కూడా నడ్డాకు వినతిపత్రం అందించారు. ఇటీవల పార్లమెంట్ వద్ద కాంగ్రెస్ ఎంపీలు ప్రియాంకగాంధీతో కలిసి ఆందోళన చేపట్టారు. అయినా, కేంద్రం నుంచి సరైన స్పందనరాక రైతులను నిరాశకు గురిచేస్తున్నది.
కేంద్ర మంత్రులపై సీఎం ఆగ్రహం
యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతుంటే అండగా నిలవాల్సిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తమకేమీ పట్టనట్టు కేంద్రాన్ని పొగిడే పనిలో ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఎక్స్ వేదికగా మంగళవారం సీఎం రేవంత్ స్పందించారు. “రాష్ట్ర రైతాంగం కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో పత్తా లేరు. గల్లీలో లొల్లి చేయడానికి ఉత్సాహం చూపే వారు.. ఢిల్లీలో మోదీని ప్రశ్నించడానికి ఎందుకు భయపడుతున్నారు?” అని ప్రశ్నించారు. రాష్ట్ర రైతాంగానికి అవసరం మేరకు యూరియా సరఫరా చేయకుండా మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం వివక్ష పూరిత వైఖరి ప్రదర్శిస్తున్నదని, రాష్ట్రానికి కేటాయించిన యూరియా సరఫరా చేయాలని తాము లెటర్ల రూపంలో, విజ్ఞప్తుల రూపంలో పదే పదే కోరినా కేంద్రం స్పందించకపోవడం దారుణం అని విమర్శించారు. పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని ఎండగట్టేందుకు తెలంగాణ ఎంపీలతో గొంతు కలిపిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంకాగాంధీకి రాష్ట్ర రైతుల పక్షాన సీఎం ధన్యవాదాలు తెలిపారు.