- ఇకపై బెట్టింగ్ నిర్వహించే యాప్స్‌పై నిషేధం
- అలాంటి వాటికి సెలబ్రెటీలు ప్రచారం చేస్తే చర్యలు
- బిల్లును నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం
న్యూడిల్లీ: అక్రమాలకు పాల్పడుతున్న బెట్టింగ్ యాప్స్‌ను, ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్స్‌ను నియంత్రించడానికి కేంద్రం ప్రభుత్వం రెడీ అయింది. ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. ప్రతిపాదిత చట్టం ప్రకారం.. ఆన్లైన్లో డబ్బులు పెట్టి ఆటలు ఆడితే భారీగా జరిమానాలు వేస్తారు. ప్లాట్‌ఫారంపై నిషేధం కూడా విధిస్తారు. బెట్టింగ్‌కు సంబంధించిన గేమింగ్ యాప్‌లకు సెలబ్రిటీలు ప్రచారం చేయకూడదు. ఉల్లంఘించేవారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఈ బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వినోదం ఆధారిత ఆన్‌లైన్ ఆటలకు, డబ్బు, పందెంతో వాటికి మధ్య స్పష్టమైన గీత గీయాలని ఇది లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే, సాధారణ ఆన్‌లైన్ గేమ్‌లకు పరిమితులు ఉండవు. బెట్టింగ్‌కు సంబంధించిన గేమింగ్ యాప్‌లను సిన్ గూడ్స్ జీఎస్టీ వర్గం కిందకు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. వీటికి 40 శాతం వరకు పన్ను విధించాలని భావిస్తోంది. ప్రస్తుతం, ఆన్‌లైన్ గేమింగ్‌పై 28శాతం జీఎస్టీ, గెలుచుకున్న మొత్తంపై 30 శాతం పన్ను విధిస్తున్నారు. ఈ బిల్లు ఐటీ చట్టం 2000, మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) వంటి చట్టాలను ఉపయోగించి ఆన్‌లైన్ అక్రమ బెట్టింగ్‌లను అడ్డుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అక్రమ, నాన్–రిజిస్టర్డ్ సైట్లను బ్లాక్ చేయడానికి కూడా ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్ రంగంపై నిఘా పెంచింది. 2023 అక్టోబర్ నుంచి ఆన్‌లైన్ గేమింగ్‌పై 28 శాతం జీఎస్టీ వసూలు చేస్తోంది. పన్ను పరిధిని ఆఫ్‌షోర్ ప్లాట్‌ఫామ్స్‌కు కూడా విస్తరించారు. నాన్–రిజిస్టర్డ్, అక్రమ సైట్ల నిరోధించే అధికారాన్ని అధికారులకు ఇచ్చారు. భారతదేశ ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ 2029 నాటికి 9.1 బిలియన్డాలర్లకు చేరుకుంటుందని అంచనా. అయితే చాలా మంది బెట్టింగ్ యాప్స్‌కు బానిసలవుతున్నారు. అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. దీంతో వీటి యాడ్స్‌ను నిషేధించారు. పన్నులను పెంచారు.
