తాటి, ఈత చెట్లు నరికితే నాన్ బెయిలబుల్ కేసు

తాటి, ఈత చెట్లు నరికితే నాన్ బెయిలబుల్ కేసు
  • తప్పనిసరి అయితే చెట్లను వేరేచోటికి తరలించాలె
  • అధికారులకు ఎక్సైజ్‌‌‌‌శాఖ మంత్రి శ్రీనివాస్‌‌‌‌ గౌడ్‌‌‌‌ ఆదేశం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో తాటి, ఈత చెట్లను అక్రమంగా నరికేవారిపై సెక్షన్ 27, ఆబ్కారీ చట్టం1968 ప్రకారం నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ఎక్సైజ్‌‌‌‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌‌‌‌ గౌడ్ అధికారులను ఆదేశించారు. రియల్ ఎస్టేట్ సంస్థలు లేఅవుట్ల పేరుతో తాటి, ఈత చెట్లను ఇష్టారాజ్యంగా నరికి వేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర మోకు దెబ్బ రాష్ట్ర కార్మిక కమిటీ మంగళవారం ఇచ్చిన వినతి పత్రంపై మంత్రి స్పందించారు. దీనిపై ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. తర్వాత ఆయన మాట్లాడుతూ.. అక్రమంగా చెట్లను నరికివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆ చెట్లను నరికివేయడానికి అనుమతులు ఇవ్వొద్దని ఆదేశించారు. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే ఆయా చెట్లను వేరే ప్రదేశానికి తరలించడానికి అనుమతులు ఇవ్వాలని చెప్పారు. దీనిపై రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లకు తక్షణం ఆదేశాలు జారీచేయాలన్నారు. మంత్రిని కలిసినవారిలో మాజీ ఎమ్మెల్యే కె. సత్యనారాయణ గౌడ్, మోకు దెబ్బ కార్మిక కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమరవేణి నర్సాగౌడ్, ఉపాధ్యక్షుడు రవిగారి ప్రసాద్ గౌడ్, ఎం. విజయ్ కుమార్ గౌడ్, గుండా వెంకటాద్రి గౌడ్ తదితరులు ఉన్నారు.