IND vs PAK: ఆమాత్రం భయం ఉండాలి: పోలీసు వ్యాన్‌లో దాక్కున్న పాకిస్తానీ అభిమాని

IND vs PAK: ఆమాత్రం భయం ఉండాలి: పోలీసు వ్యాన్‌లో దాక్కున్న పాకిస్తానీ అభిమాని

భారత్ vs పాకిస్తాన్.. జీవితంలో ఒక్కసారైనా ఈ ఇరు జట్లు తలపడితే ప్రత్యక్షంగా చూడాలనుకునే అభిమానులు కోకొల్లలు. అయితే అందరికీ ఆ అవకాశం లభించదు. టికెట్లు దొరక్కపోవడం ఒకటైతే, ఒక నగరం నుంచి మరొక నగరానికి వెళ్లడానికి ఇష్టపడని వారు మరికొందరు. కానీ, వీరాభిమానులకు అలాంటివి అడ్డంకులే కాదు.. ఎక్కడ మ్యాచ్ జరిగినా.. అక్కడ ప్రత్యక్షమవుతుంటారు. 

ఇదిలావుంటే, పాకిస్తానీ వీరాభిమాని మహమ్మద్ బషీర్ బొజాయ్ అలియాస్ 'చికాగో చాచా' వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్తాన్ జట్టు ఆడే మ్యాచ్‌ల కోసం ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందే భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇండియా- పాక్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ చేరుకున్న ఆయనకు చుక్కెదురు అయ్యింది. పాక్ అభిమానులు ఎక్కువ సంఖ్యలో లేకపోవడం, భారత అభిమానులు పోటెత్తడంతో చికాగో చాచా భయపడిపోయారు.

లక్ష మంది భారత అభిమానులు స్టేడియంలోకి వెళ్తుంటే.. ఆయన మాత్రం భయంతో పోలీసు వ్యాన్‌లో కూర్చుండిపోయారు. ఆయనను పోలీసులే అక్కడ కూర్చోమన్నారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఒక ప్రముఖ పాకిస్తానీ అభిమాని పోలీసు వ్యాన్‌లో కూర్చుండిపోవడం పట్ల నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది.

బాబర్ - రిజ్వాన్ జోరు

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్ బ్యాటర్లు ధాటిగా ఆడుతున్నారు. 24 ఓవర్లు ముగిసేసరికి 2వికెట్ల నష్టానికి 144 పరుగులు చేశారు. బాబర్ ఆజాం(45)న మహమ్మద్ రిజ్వాన్(42) పరుగులతో క్రీజులో ఉన్నారు.