గోదావరిలో 3,396 టీఎంసీల నీళ్లున్నయ్​: సీడబ్ల్యూసీ

గోదావరిలో 3,396 టీఎంసీల నీళ్లున్నయ్​: సీడబ్ల్యూసీ
  • అందులో ఉమ్మడి ఏపీ కోటా 
  • 1,486 టీఎంసీలు 

హైదరాబాద్, వెలుగు: గోదావరి నదిలో 3,396 టీఎంసీల నీటి లభ్యత ఉందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. నదిలో 75 శాతం డిపెండబులిటీ వద్ద నికర జలాల లభ్యత ఉందని అధ్యయనం చేసి తేల్చింది. 1941–42 వాటర్​ఇయర్ ​నుంచి 1979–80 వరకు నదిలో ప్రవాహం ఆధారంగా నికర జలాల లభ్యతను లెక్కించామని తెలిపింది. ఈ మేరకు గోదావరి రివర్ ​మేనేజ్​మెంట్ ​బోర్డు (జీఆర్​ఎంబీ)కు లేఖ రాసింది. జీఆర్ఎంబీ 14వ సమావేశంలో గోదావరిలో నికర జలాల లభ్యతను లెక్కించాలని కోరుతూ తీర్మానం చేశారు. బోర్డు మీటింగ్​లో తీసుకున్న నిర్ణయం మేరకు స్టడీ చేసి వివరాలు ఇవ్వాలని సీడబ్ల్యూసీకి ఈ ఏడాది జనవరి 19న లేఖ రాశారు. మార్చి 9న సీడబ్ల్యూసీలోని హైడ్రాలజీ డైరెక్టరేట్​ఎక్స్​పర్ట్​లు జీఆర్ఎంబీ చైర్మన్, మెంబర్లతో సమావేశమయ్యారు. 

ఈ సమావేశంలో గోదావరిలో నీటి లభ్యతకు సంబంధించిన శాస్త్రీయ నివేదికలు స్టడీ చేశారు. అనంతరం హైడ్రాలజీ ఎక్స్​పర్ట్​లు సమగ్రంగా అధ్యయనం చేసి నదిలో నీటి లభ్యతను తేల్చారు. కాగా, మొత్తం 3,396 టీఎంసీల నికర జలాల్లో ఉమ్మడి ఏపీకి 1,486 టీఎంసీలు కోటా ఉందని లెక్కగట్టారు. గోదావరిలో 12 సబ్ ​బేసిన్లు ఉండగా అందులో 8 సబ్​ బేసిన్లు తెలంగాణలో ఉన్నాయని తేల్చారు. సాగు నీటికి వినియోగించే నీటిలో పది శాతం నీళ్లు తిరిగి నదిలోనే కలుస్తున్నాయి. సీడబ్ల్యూసీ స్టడీలో ఈ రీ జనరేటెడ్​నీటిని లెక్కలోకి తీసుకోలేదు. కేవలం 75 శాతం డిపెండబులిటీ దగ్గర లభ్యమయ్యే నికర జలాలు మాత్రమే లెక్కలోకి తీసుకున్నారు. వాటిని పరిగణనలోకి తీసుకుంటే ఉమ్మడి ఏపీకి 1,500 టీఎంసీలకు పైగా నీటి లభ్యత ఉండేదని ఇంజనీర్లు చెప్తున్నారు. ఇప్పుడు గోదావరిలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీనే నివేదిక ఇవ్వడంతో రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియ కొలిక్కి వచ్చే అవకాశముంది.