హైదరాబాద్​లో సీడబ్ల్యూసీ.. సెప్టెంబర్ 16, 17 తేదీల్లో సోనియా అధ్యక్షతన సమావేశాలు

హైదరాబాద్​లో సీడబ్ల్యూసీ..  సెప్టెంబర్  16, 17 తేదీల్లో సోనియా అధ్యక్షతన సమావేశాలు
  • తొలిరోజు సీడబ్ల్యూసీ మెంబర్స్​తో భేటీ
  • రెండో రోజు పీసీసీ చీఫ్​లు, సీఎల్పీ లీడర్లతో సమావేశం
  • 17న సాయంత్రం పరేడ్​ గ్రౌండ్స్​లో 
  • ‘తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవం’ పేరిట భారీ సభ
  • 5 గ్యారెంటీలను ప్రకటించనున్న సోనియాగాంధీ

హైదరాబాద్​/న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలకు తొలిసారి హైదరాబాద్​ వేదిక కానుంది. ఈ నెల 16, 17న రెండు రోజుల పాటు ఈ మీటింగ్స్​ జరుగనున్నాయి. 200 మందికిపైగా కాంగ్రెస్​ జాతీయ స్థాయి నేతలు, అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్​లు, సీఎల్పీ నేతలు, పార్లమెంట్​ నియోజకవర్గాల ఆఫీస్​ బేరర్లు హాజరుకానున్నారు. కాంగ్రెస్​ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. 

తొలిరోజు సీడబ్ల్యూసీ మెంబర్లు, శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితుల ఎగ్జిక్యూటివ్​ మెంబర్స్​తో మీటింగ్​ ఉంటుంది. రెండో రోజు అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్​లు, సీఎల్పీ నేతలు, పార్లమెంటరీ పార్టీ ఆఫీస్​ బేరర్లతో సమావేశం ఉంటుంది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్​ సెక్రటరీ (ఆర్గనైజేషన్​) కేసీ వేణుగోపాల్​ సోమవారం ఢిల్లీలో ఈ ప్రకటన చేశారు. ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు హైదరాబాద్​లో సీడబ్ల్యూసీ సమావేశాలను నిర్వహించనున్నట్టు చెప్పారు.  

భారీ బహిరంగ సభ

సీడబ్ల్యూసీ సమావేశాల్లో భాగంగానే  సెప్టెంబర్​ 17’ వేడుకలను ఏఐసీసీ, పీసీసీ నేతలు ఘనంగా నిర్వహించనున్నారు. ఆ రోజు సాయంత్రం ‘తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవం’ పేరిట పరేడ్​ గ్రౌండ్స్​లో  భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. సభా వేదిక వద్దకు ర్యాలీగా సీడబ్ల్యూసీ సభ్యులు, పార్టీ నేతలు తరలి వెళ్లనున్నారు. ర్యాలీని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జెండా ఊపి ప్రారంభిస్తారు. 

ఈ బహిరంగ సభలోనే సోనియాగాంధీ నేతృత్వంలో ‘5 గ్యారెంటీ’లను ప్రకటించనున్నారు. అభయహస్తం (ఎస్సీ, ఎస్టీలకు ఆర్థిక సాయం), సామాజిక పింఛన్లు, గృహ లక్ష్మి, రుణమాఫీ, ఉద్యోగాలకు సంబంధించిన గ్యారెంటీలను సభలో ప్రకటిస్తారని తెలిసింది. అయితే, ఇదే పూర్తి మేనిఫెస్టో కాదని, ఎన్నికల టైం వర కు మరిన్ని అంశాలతో పూర్తి స్థాయి మేనిఫెస్టోనూ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు చెప్తున్నారు. 

తాజ్​ కృష్ణ హోటల్​లో నిర్వహణ?

సీడబ్ల్యూసీ సమావేశాలు హైదరాబాద్​లో జరగనున్నప్పటికీ.. వేదిక మాత్రం ఇంకా ఖరారు కాలేదు. మూడు వేదికలను పరిశీలిస్తున్నట్టు పార్టీ నేతలు చెప్తున్నారు. శంషాబాద్​లోని నొవొటెల్​ హోటల్​లో చేపట్టాలని భావించినప్పటికీ  అది దూరమవుతుందన్న ఉద్దేశంతో సిటీలోని స్టార్​ హోటల్​లోనే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. తాజ్​ కృష్ణ హోటల్​ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అతిథులకు తాజ్​ డెక్కన్​, తాజ్​ బంజారా హోటల్స్​లో  బస కల్పించేందుకు యోచిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 

బుధ వారం కేసీ వేణుగోపాల్​ హైదరాబాద్​కు వస్తున్నారని, ఆ రోజే వేదికను ఖరారు చేస్తారని పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి చెప్పారు. సమావేశాల తేదీలు కన్ఫర్మ్​ కాగానే.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మాణిక్​ రావు ఠాక్రేతో రేవంత్​రెడ్డి భేటీ అయ్యారు.  బహిరంగ సభను నిర్వ హించే పరేడ్​  గ్రౌండ్​ను ఏఐసీసీ సెక్రటరీలతో కలిసి  రేవంత్, ఠాక్రే పరిశీలించారు. సభ నిర్వహణకు అనుమ తి కోసం మూడు రోజుల కిందటే పోలీసులకు అప్లై చేసినట్టు నేతలు చెప్తున్నారు. కాగా, సీడబ్ల్యూసీ సమావేశాల నేపథ్యంలో మంగళవారం పీసీసీ చీఫ్​ నేతృత్వంలో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. పార్టీ నేతలంతా హాజరు కావాలని పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ సూచించారు.

2006లో ప్లీనరి.. ఇప్పుడు సమావేశాలు

ఉమ్మడి ఏపీ సహా ఇప్పటివరకు సీడబ్ల్యూసీ సమావేశాల ను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించలేదు. అయితే, రెండుసార్లు మాత్రం ఉమ్మడి ఏపీలో సీడబ్ల్యూసీ ప్లీనరీని నిర్వహించారు. తొలిసారిగా 1992లో తిరుపతిలో ప్లీనరీని జరిపారు.  ఆ తర్వాత 2006లో హైదరాబాద్​ వేదికగా సీడబ్ల్యూసీ ప్లీనరీ సమావేశాలు జరిగాయి. అయితే, 1994 ఉమ్మడి ఏపీ ఎన్నికల నేపథ్యంలో సీడబ్ల్యూసీ ప్లీనరీకి వేదికగా ఆనాడు తిరుపతిని ఏఐసీసీ ఎంచుకుంది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం పీక్​ స్టేజ్​కు చేరుకున్న తరుణంలోనే 2006 జనవరిలో హైదరాబాద్​ వేదికగా ‘గత పునాదులు, భవిష్యత్​ నిర్మాణం, కొత్త బాధ్యతలు’ పేరిట సీడబ్ల్యూసీ ప్లీనరీని నిర్వహించారు.

 నాడు తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కామన్​ మినిమమ్​ ప్రోగ్రామ్​లో కాంగ్రెస్​ పార్టీ ఎజెండాగా పెట్టుకుంది. ఆ సమయంలో కాంగ్రెస్​తో టీఆర్​ఎస్​ పొత్తు కూడా పెట్టుకుంది. అయితే, 12 వేల మందితో నిర్వహించిన ఆ ప్లీనరీలో మాత్రం తెలంగాణ ఏర్పాటు గురించి చర్చించలేదన్న విమర్శలున్నాయి. కేవలం పార్టీ పొత్తుల గురించి డిస్కస్​ చేశారన్న అపవాదు ఉంది. అయితే, ఈసారి సీడబ్ల్యూసీ సమావేశాలనే హైదరాబాద్​ వేదికగా నిర్వ హించనుండటం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నది. రాష్ట్రంలో ఎన్నికలున్న నేపథ్యంలోనే కాంగ్రెస్​ హైకమాండ్​ హైదరాబాద్​పై స్పెషల్​ ఫోకస్​ పెట్టిందని పార్టీ నేతలు చెప్తున్నారు. 

నిజాంల పాలన నుంచి హైదరాబాద్​ రాష్ట్రానికి స్వాతంత్ర్యం కల్పించింది, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్సేనన్న సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే సమావేశాలు ఎంతగానో ఉపయోగపడుతాయని లీడర్లు అంటున్నారు. జాతీయ స్థాయి నిర్ణయాలన్నీ హైదరాబాద్​ వేదికగా తీసుకుంటామని చెప్తున్నారు. దేశంలో ‘ఇండియా’ కూటమి గెలిచేలా, అధికారంలోకి వచ్చేలా వ్యూహాలన్నీ ఈ​ వేదికగానే జరుగుతాయని అంటున్నారు. తెలంగాణకు కాంగ్రెస్​ ప్రాధాన్యం ఇస్తుందని చెప్పేలా ఈ సమావేశాలుంటాయంటుని పేర్కొంటున్నారు.  

కీలక నిర్ణయాలు ఉంటయ్​: రేవంత్​

దేశ రాజకీయాలను ప్రభావితం చేసే కీలక నిర్ణయాలను సీడబ్ల్యూసీ సమావేశంలో తీసుకుంటామని పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన సీఎల్పీలో మీడియాతో చిట్​చాట్​ చేశారు. ఏఐసీసీ జనరల్​ సెక్రటరీ కేసీ వేణుగోపాల్​ బుధవారం హైదరాబాద్​కు వస్తున్నారని, ఆయన వచ్చాకే సమావేశాలు జరిగే వేదికను నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. సమావేశాలకు తాజ్​ కృష్ణను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. బహిరంగ సభను పరేడ్​ గ్రౌండ్​లో నిర్వహించాలన్న ఆలోచన ఉందని పేర్కొన్నారు. 

సమావేశాల్లో భాగంగా ఐదు రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంట్​ ఎన్నికలు, పొత్తులు, వ్యూహాలు, పార్టీని బలోపేతం చేసే అంశాలపై నిర్ణయాలు ఉంటాయని వివరించారు. సీడబ్ల్యూసీ సమావేశాలకు వస్తున్న సోనియాగాంధీ.. బోయిన్​పల్లిలోని రాజీవ్​గాంధీ ఐడియాలజీ సెంటర్​ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని ఆయన అన్నారు. ‘సెప్టెంబర్​ 17’ను తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవం పేరిట నిర్వహిస్తామని తెలిపారు. మల్లికార్జున ఖర్గే తెలంగాణకు చెందిన వ్యక్తేనని, రజాకార్ల ఊచకోతలో ఆయన ఫ్యామిలీ మొత్తం బలైపోయిందని అన్నారు. అందుకే ఆయన తెలంగాణలో సమావేశాలు పెట్టాలని నిర్ణయించారని రేవంత్​ తెలిపారు. 

సమావేశాల తెల్లారి నుంచే జనంలోకి

సీడబ్ల్యూసీ సమావేశాలు పూర్తయిన తెల్లారే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్​​ పార్టీ మొదలు పెట్టనుంది.  అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్​లు, సీఎల్పీ నేతలు తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో పర్యటించేలా ఏఐసీసీ నేతలు ప్లాన్​ చేశారు. కాంగ్రెస్​ 5 గ్యారెంటీలను జనాల్లోకి తీసుకెళ్లనున్నారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వ వైఫల్యాలపై నియోజకవర్గాల వారీగా చార్జిషీట్లను విడుదల చేసి ఇంటింటికీ పంచనున్నారు. దీంతో పాటు ఆయా నేతలంతా స్థానికులతో కలిసి కమ్యూనిటీ లంచ్​ ప్రోగ్రామ్​నూ నిర్వహించేలా పార్టీ ఏర్పాట్లు చేస్తున్నది.