‘పోలవరం’ ముంపుపై జాయింట్ ​సర్వే ఎందుకు చేయట్లే?

‘పోలవరం’ ముంపుపై జాయింట్ ​సర్వే ఎందుకు చేయట్లే?

పీపీఏ, ఏపీని ప్రశ్నించిన సీడబ్ల్యూసీ

హైదరాబాద్, వెలుగు : పోలవరం ప్రాజెక్టుతో తలెత్తే ముంపుపై ఎందుకు జాయింట్​ సర్వే చేయడం లేదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), ఏపీ ప్రభుత్వాన్ని సెంట్రల్  వాటర్  కమిషన్ (సీడబ్ల్యూసీ) ప్రశ్నించింది. టైం బాండ్​తో జాయింట్​సర్వే చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. పోలవరం స్పిల్ వే డిశ్చార్జి కెపాసిటీ పెంపుతో పాటు ఇతర టెక్నికల్ ​అంశాలపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ తెలంగాణ, ఒడిశా, చత్తీస్​గఢ్​ అంతకుముందు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సుప్రీం ఆదేశాలతో సోమవారం ఢిల్లీలో సీడబ్ల్యూసీ చైర్మన్​ కుష్విందర్​ ఓరా అధ్యక్షత సమావేశం నిర్వహించారు.

తెలంగాణ తరపున ఈఎన్సీ (ఓఅండ్ఎం) నాగేందర్​రావు, సీఈ (కొత్తగూడెం) శ్రీనివాస్​రెడ్డి సహా ఇంజనీర్లు హాజరై వాదనలు వివరించారు. ముంపుపై జాయింట్​ సర్వే చేయాలని గతంలోనే సీడబ్ల్యూసీ ఆదేశాలు ఇచ్చినా ఏపీ అసంబద్ధ వాదనలతో ముందుకు రావడం లేదని వారు పేర్కొన్నారు. పోలవరంలో పూర్తి స్థాయి నీరు నిల్వచేసినపుడు తమ రాష్ట్రంలో తలెత్తే ముంపును గుర్తించాలని కోరారు. అంతేకాకుండా ఎగువన వాగులు, ఉప నదులు గోదావరిలో కలవకుండా నీళ్లు వెనక్కి తంతాయని వివరించారు.

2022 జులైలో వచ్చిన వరదలను ప్రామాణికంగా తీసుకొని నిల్వ ఉండిపోయే నీటిపై స్టడీ చేయించాలన్నారు. ‘‘మణుగూరు హెవీ వాటర్​ప్లాంట్, భద్రాచలం ఆలయం, విస్టా కాంప్లెక్స్​ రక్షణకు చర్యలు చేపట్టాలి. భద్రాచలంలోని 8 అవుట్​ఫాల్​ రెగ్యులేటర్ల వద్ద లెవల్స్ ను​ధ్రువీకరించాలి. ఎన్జీటీ ఉత్తర్వుల మేరకు పోలవరంలో పూర్తి స్థాయి నీళ్లు నిల్వ ఉన్నప్పుడు కిన్నెరసాని, ముర్రేడువాగుతో పాటు ఇంకో ఏడు వాగుల ప్రవాహంపైనా సర్వే చేయించాలి. నదిలోని పూడికను పరిగణనలోకి తీసుకొని నది క్రాస్ సెక్షన్లను కొత్తగా తీసుకొని సర్వే చేయించాలి. జాయింట్​సర్వే అనంతరం పూణేలోని సీడబ్ల్యూపీఆర్ఎస్, ఇతర నిపుణులతో మోడల్​స్టడీ కూడా చేయించాలి. జాయింట్​సర్వే చేసి ముంపు ప్రభావ ప్రాంతాన్ని గుర్తించే వరకు పోలవరం  నిర్వహించకుండా ఆదేశాలివ్వాలి” అని నాగేందర్  రావు, శ్రీనివాస్  రెడ్డి విజ్ఞప్తి చేశారు.

10న మరోసారి సమావేశం కావాలని నిర్ణయం

ఈ నెల ​10న జాయింట్​ సర్వేపై ఏపీ, తెలంగాణ ఇంజినీర్లతో మరోసారి సమావేశం కావాలని, నిర్దేశిత టైం పీరియడ్​ పెట్టుకొని జాయింట్​ సర్వే పూర్తి చేయాలని పీపీఏను సీడబ్ల్యూసీ చైర్మన్​ కుష్విందర్  ఆదేశించారు. కాగా, పోలవరం ముంపుపై గతంలో గోపాలకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని ఒడిశా, చత్తీస్​గఢ్​ ఇంజినీర్లు తేల్చిచెప్పారు. ముంపుపై కొత్తగా మళ్లీ సర్వే చేయించడంతో పాటు ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపట్టాలని వారు కోరారు. ఈ సమావేశంలో ఏపీ, ఒడిశా ఈఎన్సీలు నారాయణ రెడ్డి, అశుతోష్​దాస్, చత్తీస్​గఢ్​ సీఈ నగరియా, పోలవరం సీఈ సుధాకర్​బాబు, తెలంగాణ నుంచి సీఎం ఓఎస్డీ శ్రీధర్​రావు దేశ్​పాండే, ఇంటర్​స్టేట్​ డిప్యూటీ డైరెక్టర్ (గోదావరి) ​సుబ్రమణ్య ప్రసాద్​ తదితరులు పాల్గొన్నారు.