
- గోదావరి ట్రిబ్యునల్ అవార్డు,
- పరీవాహక రాష్ట్రాల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకున్నారా?
- వరద జలాల లభ్యతపై మరోసారి సర్వే చేయించండి
- రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల వివరాలూ సమర్పించాలని ఆదేశం
- పీబీ లింక్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఏపీకి లేఖ
- వ్యాప్కోస్‌తో ఏపీ సర్వే.. 7న సీడబ్ల్యూసీకి రిపోర్టు?
హైదరాబాద్, వెలుగు: ఏపీ చేపట్టిన పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై సెంట్రల్వాటర్కమిషన్(సీడబ్ల్యూసీ) అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ముఖ్యంగా వరద జలాల లెక్కలపై అనుమానాలు వ్యక్తం చేసింది. ఏపీ సమర్పించిన ప్రాజెక్ట్ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్(పీఎఫ్ఆర్)ను పరిశీలించిన సీడబ్ల్యూసీ.. 8 అంశాలపై సందేహాలను నివృత్తి చేయాలని కోరింది.
ఈ మేరకు ఏపీ సర్కార్‌కు ఇటీవల లేఖ రాసింది. గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ట్రిబ్యునల్(జీడబ్ల్యూడీటీ) అవార్డు ప్రకారం కోబేసిన్ రాష్ట్రాలైన తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, చత్తీస్‌గఢ్ తమకు కేటాయించిన నీటిని వాడుకున్నాక ఎంతమేర నీటి లభ్యత ఉంటుందో పీఎఫ్‌ఆర్‌లో తెలపలేదని లేఖలో పేర్కొంది. వరద జలాలనే తరలిస్తున్నామని చెబుతున్నా.. 200 టీఎంసీలు తరలించాలంటే 129 రోజులు పడుతుందని, అన్ని రోజులు అంతమేర వరద ఉంటుందా? అని ప్రశ్నించింది. వరద జలాలపై మరోసారి సర్వే చేయించాలని ఆదేశించింది.
అంశాల వారీగా సీడబ్ల్యూసీ అభ్యంతరాలివీ..
రాష్ట్రంలో ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టులు, నిర్మిస్తున్న ప్రాజెక్టులు, భవిష్యత్తులో నిర్మించాల్సిన ప్రాజెక్టుల వివరాలను సమర్పించండి. ఆయా ప్రాజెక్టుల నీటి నిల్వ, వినియోగం, ఎంత డిపెండబిలిటీ ఆధారంగా నిర్మించారో వివరాలను ఇవ్వండి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, ప్రతిపాదనల దశలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన లొకేషన్లపై ఇండెక్స్ మ్యాప్ ఇవ్వాలి. ప్రాజెక్టు డిటెయిల్డ్రి పోర్టు (డీపీఆర్) తయారీకి 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా ఉండే నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకోవాలని 2010లో ప్లానింగ్‌కమిషన్ సిఫార్సులు చేసింది.
ప్రస్తుతం చేపట్టిన పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీలు తరలించాలని భావిస్తున్నారు. కాబట్టి 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా అన్ని నీళ్లున్నాయా? లేదా? మరోసారి లెక్కించాలి. ఇప్పటికే కట్టిన, కడుతున్న ప్రాజెక్టుల కేటాయింపులు కాకుండా పీబీ లింక్‌కు వాడుకోవాలనుకుంటున్న నీళ్లున్నాయో? లేదో? లెక్కించాలి. అందుకు ఇతర రాష్ట్రాల నీటి కేటాయింపులనూ పరిగణనలోకి తీసుకోవాలి. ఈ ప్రాజెక్టుపై సమర్పించిన ఎక్సెల్షీట్లో సరైన ఫార్ములాలు, కాలిక్యులేషన్లు లేవు. ఫార్ములాలు, కంప్యూటేషన్‌తో ఎక్సెల్ షీట్‌ను అప్‌డేట్ చేయాలి.
వివిధ ప్రాజెక్టులవారీ అబ్‌స్ట్రాక్షన్ డేటా, వాటి ఆయకట్టు, రిజర్వాయర్ల నుంచి నీటి విడుదల రికార్డుల రిపోర్టును సమర్పించండి. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, ఒడిశా, చత్తీస్‌గఢ్ కోటా ప్రకారం ఎంత మేర నీళ్లను వాడుకుంటున్నాయో వివరాలను సమర్పించాలి. పోలవరం కుడి కాల్వకు సమాంతరంగా మరో కాల్వను నిర్మించి ప్రకాశం బ్యారేజీ (కృష్ణా నది)లోకి నీళ్లను మళ్లిస్తామని పీఎఫ్ఆర్‌లో పేర్కొన్నారు. రోజూ 18 వేల క్యూసెక్కుల వరద జలాలను తీసుకెళ్తామని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో వరద జలాలంటే ఏంటో? ఆ వరద జలాలను ఎలా లెక్కించారో? సరైన వివరణ ఇవ్వండి. గోదావరి ట్రిబ్యునల్ అవార్డును పరిగణనలోకి తీసుకునే వరద జలాలను లెక్కించారా? లేదా? క్లారిటీ ఇవ్వండి. రోజూ 18 వేల క్యూసెక్కుల చొప్పున 24 గంటలూ నీటిని తీసుకెళ్తే.. 200 టీఎంసీల వరద జలాలను తరలించాలంటే 129 రోజులు పడుతుంది. మరి గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం అన్ని రోజులు వరద జలాల లభ్యత ఉంటుందా? లేదా? తేల్చేందుకు పోలవరం ప్రాజెక్ట్వద్ద వరద జలాల విడుదలపై సిమ్యులేషన్స్టడీ చేయించండి.
వ్యాప్కోస్‌తో సర్వే చేయిస్తున్న ఏపీ!
సీడబ్ల్యూసీ లేఖతో ప్రాజెక్టు వరద జలాలపై మరోసారి సర్వే చేయించాలని ఏపీ సర్కార్ నిర్ణయించినట్టు తెలిసింది. వ్యాప్కోస్ సంస్థకు ఈ సర్వే బాధ్యతలను అప్పగించినట్టు తెలిసింది. ఇప్పటికే ఆ పనిని ఏపీ సర్కారు ప్రారంభించిందని సమాచారం. మరో మూడు నాలుగు రోజుల్లోనే ఆ లెక్కలను సీడబ్ల్యూసీకి అందజేయాలని నిర్ణయించినట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ నెల 7న ఇరిగేషన్సలహాదారును సీడబ్ల్యూసీకి పంపించి ప్రాజెక్టుపై లేవనెత్తిన అభ్యంతరాలను నివృత్తి చేయాలని, వీలైనంత త్వరగా సీడబ్ల్యూసీ అనుమతులు తెచ్చుకోవాలని ఏపీ భావిస్తున్నట్టు తెలిసింది.