న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు గత ఆర్థిక సంవత్సరంలో ఎక్కువగా ప్రభుత్వ, బ్యాంకింగ్, ఫైనాన్స్, ముఖ్యమైన ఇన్‌ఫ్రా వసతుల కంపెనీల కంప్యూటర్లపై, నెట్‌వర్క్‌లపై దాడులు చేశారని ప్రముఖ టెక్నాలజీ కంపెనీ సిస్కో తెలిపింది. కొన్ని దాడుల్లో ఇండియాలోని పలు కంపెనీలకు ఐదు మిలియన్ డాలర్ల (దాదాపు రూ.35 కోట్లు) చొప్పున నష్టం జరిగిందని వెల్లడించింది. 20.1శాతం దాడులు బ్యాంకింగ్ సెక్టర్ లక్ష్యంగా, 19.6 శాతం దాడులు ప్రభుత్వ నెట్‌వర్క్‌లు లక్ష్యంగా, 15.1 శాతం దాడులు మౌలిక వసతుల కంపెనీలు లక్ష్యంగా జరిగాయని కంపెనీ ఉన్నతాధికారి విశాఖ్ రామన్ చెప్పారు. ఎన్ని చర్యలు తీసుకున్నా, హ్యాకర్ల ముప్పు తొలగడం లేదన్నారు. రక్షణ, ఐటీ, టెలికం, హెల్త్‌కేర్ రంగాలపైనా కన్నేశారని చెప్పారు. రిటైల్, హాస్పిటాలిటీ, ఎంటర్‌టైన్‌మెంట్, ఈ–కామర్స్ రంగాల నెట్‌వర్కులపై దాడులకు పాయింట్ ఆఫ్ సేల్స్ అటాక్స్ వంటి టెక్నాలజీలను వాడుతున్నారని చెప్పారు. ప్రభుత్వ నెట్‌వర్క్‌లపై దాడులకు ర్యాన్సమ్‌వేర్‌లను ఉపయోగిస్తున్నారని రామన్ వివరించారు.
