
- రూ.2.12 లక్షలు పోగొట్టుకున్న యువకుడు
కోల్‌బెల్ట్, వెలుగు : గూగుల్‌లో రివ్యూలు ఇస్తే డబ్బులు వస్తాయని చెప్పడంతో నమ్మిన ఓ యువకుడు చివరకు రూ. 2 లక్షలకు పైగా పొగొట్టుకున్నాడు. ఇది సైబర్ నేరగాళ్ల పని అని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే... మందమర్రికి చెందిన ఓ యువకుడికి గూగుల్‌లో రివ్యూలో ఇస్తే డబ్బులు వస్తాయని ఇటీవల ఓ మెసేజ్ వచ్చింది.
నిజమేనని నమ్మిన యువకుడు ఓకే చెప్పగానే గుర్తు తెలియని వ్యక్తులు యువకుడి నంబర్‌ను ఓ టెలిగ్రామ్ గ్రూప్‌లో యాడ్ చేశారు. ముందుగా కొన్ని డబ్బులు ఇచ్చిన వ్యక్తులు తర్వాత ఎక్కువ మొత్తంలో సంపాదించేందుకు కొంత డబ్బు ఇన్వెస్ట్ చేయాలని సూచించారు.
దీంతో సదరు యువకుడు విడతల వారీగా రూ. 2.12 లక్షలను పెట్టుబడి పెట్టాడు. తర్వాత ఆ డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా వీలు కాలేదు. దీంతో సదరు వ్యక్తులకు కాల్ చేసినా ఫలితం లేకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నట్లు మందమర్రి ఎస్సై రాజశేఖర్ తెలిపారు.