ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ పేరిట ఫ్రాడ్‌‌‌‌ చేసిన ఇద్దరు అరెస్ట్

ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ పేరిట ఫ్రాడ్‌‌‌‌ చేసిన ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్‌‌‌‌,వెలుగు : పార్ట్‌‌‌‌ టైమ్ జాబ్‌‌‌‌, వర్క్‌‌‌‌ ఫ్రమ్‌‌‌‌ హోమ్‌‌‌‌ పేరిట ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ చేయించి మోసగిస్తున్న ఇద్దరిని  సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద  రూ.5లక్షలు నగదు, వివిధ బ్యాంకులకు చెందిన 98 అకౌంట్స్‌‌‌‌ గుర్తించడమే కాకుండా 121 డెబిట్‌‌‌‌కార్డులు,29 సిమ్‌‌‌‌ కార్డులు,11ఫోన్స్, 2ల్యాప్‌‌‌‌ టాప్స్‌‌‌‌,100కు పైగా చెక్‌‌‌‌ బుక్స్‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌‌‌‌ అడ్డాగా సాగుతున్న దందాలో గ్యాంగ్‌‌‌‌ వివరాలను శుక్రవారం మీడియాకు సైబర్ క్రైమ్ డీసీపీ కవిత తెలిపారు. 

రూ.500 బోనస్‌‌‌‌ చూపించి.. 

గుజరాత్‌‌‌‌ సూరత్‌‌‌‌కు చెందిన అబ్దుల్లా ఫరూక్‌‌‌‌ జూంజున్య(19)ముంబైకి చెందిన మహ్మద్‌‌‌‌ సోయబ్‌‌‌‌ బబ్లూఖాన్‌‌‌‌(27) పార్ట్‌‌‌‌టైమ్ జాబ్ పేరిట టెలీగ్రామ్‌‌‌‌, వాట్సాప్‌‌‌‌ల ద్వారా మెసేజ్‌‌‌‌లు పంపుతున్నారు. వర్క్‌‌‌‌ ఫ్రమ్ హోమ్‌‌‌‌ చేయాలంటూ లింక్స్‌‌‌‌ సర్క్యులేట్‌‌‌‌ చేస్తున్నారు. స్పందించిన వారికి యాప్‌‌‌‌లో టాస్క్‌‌‌‌లు ఇస్తున్నారు. ముందుగా రూ.500 బోనస్ ఇస్తున్నట్లు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ అకౌంట్‌‌‌‌ చూపిస్తున్నారు. ఇలా హైదరాబాద్‌‌‌‌కు చెందిన వ్యక్తి నుంచి రూ.2.38లక్షలు కొట్టేశారు. బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా..  బ్యాంక్ అకౌంట్స్‌‌‌‌ ఆధారంగా దర్యాప్తు చేసి  గుజరాత్‌‌‌‌కు చెందిన అకౌంట్స్ గా గుర్తించారు. సిటీ పరిధిలో 3 కేసుల్లో రూ.1.2కోట్లు దోచినట్టు ఆధారాలు సేకరించారు.

నకిలీ అకౌంట్స్‌‌‌‌తో రూ.4.5 కోట్లు దోచేశారు 

మహ్మద్ సోయబ్‌‌‌‌ బబ్లూ ఖాన్‌‌‌‌ షెల్‌‌‌‌ కంపెనీల పేర్లతో బ్యాంక్‌‌‌‌ అకౌంట్స్‌‌‌‌ ఓపెన్ చేశాడు. వాటిని సైబర్ క్రిమినల్స్ కు అందించేవాడు. ఇందుకు అబ్దుల్లా ఫరూక్‌‌‌‌ గుజరాత్‌‌‌‌లోని పేదల పేర్లతో బ్యాంక్‌‌‌‌ అకౌంట్స్‌‌‌‌ ఓపెన్ చేసేవాడు. ఇచ్చిన వారికి రూ.5 వేల నుంచి రూ.10వేలు ఇచ్చేవాడు. ఇలా వీరిద్దరు కలిసి 70కి పైగా ఫేక్ బ్యాంక్‌‌‌‌ అకౌంట్స్‌‌‌‌ సేకరించారు. ఇన్వెస్ట్‌‌‌‌మెంట్స్‌‌‌‌ ఫ్రాడ్స్‌‌‌‌ ద్వారా వసూలు చేసిన డబ్బును అకౌంట్స్‌‌‌‌లో డిపాజిట్ చేసేవారు. డిపాజిట్ అయిన డబ్బుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 42 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌‌‌‌ కమిషనరేట్ పరిధిలో 3 కేసుల్లో రూ.1.2కోట్లు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 1 కేసులో రూ.65లక్షలు,సైబరాబాద్‌‌‌‌లో రెండు కేసుల్లో రూ.10లక్షలు కొట్టేశారు. ఇలా నిందితుల అకౌంట్స్‌‌‌‌లో మొత్తం రూ.4.5కోట్లు డిపాజిట్‌‌‌‌అయ్యాయి.