ప్రజాపాలన దరఖాస్తు: ఫోన్ చేసి రూ.10 వేలు దోచేశారు

ప్రజాపాలన దరఖాస్తు: ఫోన్ చేసి రూ.10 వేలు దోచేశారు

ప్రభుత్వ సాయం కోసం దరఖాస్తు పెట్టుకున్న  ఓ మహిళకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ప్రభుత్వ సాయం పక్కనపెడితే... ఉన్న డబ్బులు పోగొట్టుకుంది. అసలేం జరిగిందంటే.. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీల అమలు కోసం దరఖాస్తుల స్వీకరణ  డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు గడువుతో ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టింది. 

పేద ప్రజలందరూ ప్రజాపాలనలో పథకాలను దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.. దీంతో ప్రజలు ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పథకాల కోసం మొత్తం కోటి 25 లక్షల దరఖాస్తులను వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే, ఇదే మంచి తరుణంగా భావించిన సైబర్ నేరగాళ్లు.. ప్రజలను ట్రాప్ చేసి డబ్బులు కోట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి  ఫోన్ చేసి ఓటీపీ అడిగి డబ్బులు కొట్టేస్తున్నారు. 

ఇలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలో చోటుచేసుకుంది. బర్థిపూర్ గ్రామానికి చెందిన లావణ్య అనే మహిళ.. ప్రజాపాలనలో అభయహస్తం పథకానికి దరఖాస్తు చేసుకోగా.. సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి ఓటీపీ అడిగి 10 వేల రూపాయలు దోచేశారు. తర్వాత అసలు సంగతి తెలిసి ఆ మహిళ షాకైంది. ప్రజాపాలన దరఖాస్తు చేసుకుంటే ఓటీపీ చెప్పమని 10 వేలు దోచేశారని ఆవేదన వ్యక్తం చేసింది.