మల్కాజిగిరి, వెలుగు: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, పార్ట్‌టైమ్ ఇన్‌కమ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ బీటెక్ విద్యార్థిని మోసం చేశారు. కుషాయిగూడకు చెందిన ఆర్.కామేశ్(21) ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. యూట్యూబ్‌లో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌కు సంబంధించిన వీడియోలు చూస్తుండగా ‘సూర్య ఎక్స్ ట్రేడ్స్’ అనే టెలిగ్రామ్ చానల్ లింక్ ద్వారా సైబర్ నేరగాళ్లు పరిచయం అయ్యారు.
తమ గ్రూపులో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలో భారీ లాభాలు వస్తాయని నమ్మబలికారు. ట్రేడింగ్ మెంబర్‌షిప్, డీమాట్ అకౌంట్ నిర్వహణ, సర్వీస్ ట్యాక్స్ పేర్లతో మొత్తం రూ.1.28 లక్షలు వసూలు చేశారు. లాభాలు రాకపోగా, ఖాతాలోని డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే మరిన్ని డబ్బులు పంపాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో మోసపోయానని గ్రహించిన విద్యార్థి పోలీసులను ఆశ్రయించాడు.
