- ఫిబ్రవరి 28 నాటికి దేశంలో 257 కేసుల్లో 36 వేల కోట్లు లూటీ
- సీబీఐ, ఐ4సీ, సైబర్ క్రైమ్ పోలీసుల కోఆర్డినేషన్‌తో సెర్చ్ ఆపరేషన్లు
“సైబర్ నేరాల ద్వారా కొల్లగొట్టిన సొమ్మును 111 షెల్ కంపెనీలు, 200కు పైగా మ్యూల్ అకౌంట్లతో అంతర్జాతీయ సైబర్ ముఠా గత ఏడాది రూ.వెయ్యి కోట్లు దోపిడీ చేసింది. తెలంగాణ, ఏపీ, కర్నాటక సహా 27 రాష్ట్రాల్లో నమోదైన కేసులు, బాధితులు, మ్యూల్ అకౌంట్ల ఆధారంగా సీబీఐ, ఈడీ దర్యాప్తు చేశాయి. చైనాకు చెందిన జూయి, హువాన్ లియు, వీజియన్ లియు, గ్వానువా వాంగ్ ఆపరేట్ చేస్తున్న111 డొల్ల కంపెనీలకు రూ.వెయ్యి కోట్లు మళ్లించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. నలుగురు చైనీయులు సహా మొత్తం 17 మందిని అరెస్టు చేశాయి. ఈ క్రమంలోనే మ్యూల్ అకౌంట్లు, క్రిప్టో కరెన్సీ వినియోగంపై దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నాయి’’
హైదరాబాద్, వెలుగు: ఆన్‌లైన్ అడ్డాగా సైబర్ నేరగాళ్లు ఏటా వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. కొట్టేసిన డబ్బును మ్యూల్ అకౌంట్లు, డిజిటల్ కరెన్సీ క్రిప్టో, బిట్ కాయిన్స్ ద్వారా దారి మళ్లిస్తున్నారు. ఇలా ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి రూ.36 వేల కోట్లు సైబర్ నేరగాళ్ల డిజిటల్ అకౌంట్లకు చేరినట్లు ఈడీ గుర్తించింది. మ్యూల్ అకౌంట్ల ద్వారా డబ్బును డిజిటల్ కరెన్సీగా మార్చడంతో పాటు విదేశాలకు దారి మళ్లించినట్టు ఆధారాలు సేకరించింది.
ఈ మేరకు దేశవ్యాప్తంగా నమోదైన 257 సైబర్ నేరాల్లో జరిగిన లావాదేవీల ఆధారంగా మనీ లాండరింగ్ కింద కేసులు దర్యాప్తు చేస్తున్నది. అంతర్రాష్ట్ర సైబర్ క్రైం నెట్‌వర్క్, అనుమానాస్పద లావాదేవీలను రియల్ -టైమ్‌లో గుర్తించకపోడంతోనే కోట్ల రూపాయలు దారి మళ్లిస్తున్నట్టు ఈడీ దర్యాప్తులో బయటపడింది.
- సైబర్ మోసాలతో రూ.వేల కోట్లు దోపిడీ
డిజిటల్ పేమెంట్స్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ అందుబాటులోకి వచ్చిన నుంచి సైబర్ నేరాలు పెరిగిపోయాయి. ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్‌లు సహా 18 రకాల సైబర్ మోసాలతో ఆన్‌లైన్ దోపిడీ చేస్తున్నారు. అలా సంపాదించిన సొమ్మును షెల్ కంపెనీలు, క్రిప్టో వాలెట్ల ద్వారా మళ్లిస్తున్నారు.
- బంగ్లాదేశ్, దుబాయ్ మీదుగా విదేశాలకు మనీ లాండరింగ్
క్రిప్టో , హవాలా రూపంలో బంగ్లాదేశ్, దుబాయ్ మీదుగా భారత కరెన్సీ దేశాలు దాటుతోంది. ఇందుకు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలలోని లోపాలు కారణమని ఈడీ దర్యాప్తులో తేలింది. బ్యాంకులు, డిజిటల్ కరెన్సీలో తనిఖీలు లేకపోవడం, షెల్ కంపెనీల ఆపరేషన్లు, ఇంటర్నేషనల్ నగదు లావాదేవీలపై పర్యవేక్షణ లోపంతో సైబర్ నేరగాళ్లకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని బయటపడింది. ఈ మేరకు సైబర్ నేరగాళ్ల ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఫోకస్ పెట్టింది. మ్యూల్ అకౌంట్లను గుర్తిస్తూ ఆపరేషన్లు చేస్తున్నది.
- మ్యూల్ అకౌంట్లు, డిజిటల్ కరెన్సీపై జాయింట్ ఆపరేషన్లు ఇలా
సైబర్ నేరాల్లో గుర్తించిన మ్యూల్ అకౌంట్లు, డిజిటల్ కరెన్సీ అకౌంట్ల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఇండియన్ సైబర్ క్రైం కోర్డినేషన్ సెంటర్ (ఐ4సీ), సీబీఐ, ఆర్బీఐ సహా అన్ని రాష్ట్రాల సైబర్ క్రైం బ్యూరోల సహకారంతో మ్యూల్, డిజిటల్ కరెన్సీలపై ఆపరేషన్లు నిర్వహిస్తున్నది. అంతర్రాష్ట్ర సైబర్ క్రైం నెట్‌వర్క్‌లను అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్రాల వారీగా మ్యూల్ అకౌంట్లు, సైబర్ నేరాల డేటాను సేకరిస్తున్నది.
అనుమానాస్పద లావాదేవీల రియల్ -టైం పర్యవేక్షణను బలోపేతం చేసే దిశగా సంబంధిత వ్యవస్థలను అప్రమత్తం చేస్తున్నది. దర్యాప్తు సంస్థల మధ్య సమన్వయం, డేటా విశ్లేషణ, ట్రాకింగ్, సైబర్ నేరాల బాధితులకు చెందిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అమలు, సైబర్ క్రైం మనీ మ్యాపింగ్‌ను పటిష్టంగా అమలు చేసే విధంగా ఈడీ చర్యలు చేపట్టింది.
