Kitchen Telangana: వెరైటీ ఫుడ్.. బ్రెడ్ స్నాక్స్.. సూపర్ టేస్ట్..పిల్లలు ఎగబడి తింటారు..!

Kitchen Telangana:  వెరైటీ ఫుడ్.. బ్రెడ్ స్నాక్స్.. సూపర్ టేస్ట్..పిల్లలు ఎగబడి తింటారు..!

సాయంత్రం అయ్యిందంటే చాలు  పిల్లలు అమ్మా .. ఆకలి అంటూ గోల చేస్తారు పిల్లలు. రోజూ ఒకే రకం స్నాక్స్ ఇస్తే మాత్రం అస్సలు ఊరుకోరు. పిల్లలున్న ప్రతి ఇంట్లో ఇదే సమస్య. అందుకే  పిల్లలకోసం వెరైటీ బ్రెడ్ స్నాక్స్  చేసి పెడితే కంప్లైంట్స్ లేకుండా ప్లేట్ ఖాళీ చేస్తారు.  ఇప్పుడు వాటిని ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

 బ్రెడ్​ బజ్జీ తయారీకి కావాల్సినవి 

  • బ్రెడ్ స్లైసులు- ఐదు
  •  శనగపిండి - ఒక కప్పు 
  • ఎండుకొబ్బరి పొడి - రెండు టేబుల్ స్పూన్లు
  •  అల్లం-వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్
  •  నువ్వుల పొడి - ఒక టేబుల్ స్పూన్
  •  పల్లీల పొడి - ఒక టేబుల్ స్పూన్ 
  • వాము - అర టీ స్పూన్, 
  • సన్నకారప్పూస- కొద్దిగా 
  • ధనియాల పొడి - ఒక టీ స్పూన్
  •  గరంమసాల- అర టీ స్పూన్
  •  కారం, ఉప్పు- తగినంత
  • చింతపండు రసం - ఒక టీ స్పూన్
  •  వంటసోడా - చిటికెడు
  •  నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
  •  పుదీనా, కొత్తిమీర - కొద్దిగా 
  • ఉల్లిగడ్డ తరుగు - ఒక టీ స్పూన్

బ్రెడ్​ బజ్జీ తయారీ విధానం 

  మిక్సీ జార్​ లో  నువ్వులు, వేరుశనగ, ఎండుకొబ్బరి పొడులు, కారం, ఉప్పు, గరం మసాలా, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, చింతపండు రసం వేసి మిక్సీ పట్టాలి. బ్రెడ్ స్లైసుల అంచులు కట్ చేయాలి. 

ఆ స్లైసులకి ఒక పక్క రెడీ చేసుకున్న పేస్ట్ రాసి దాన్ని మరొక స్ట్రెస్ తో మూసేయాలి. గిన్నెలో శనగపిండి, ఉప్పు, వంటసోడా, వాము వేసి కొద్దిగా నీళ్లు పోసి జారుగా కలపాలి.

 బ్రెడ్ స్లైసుల్ని అందులో డిప్ చేసి కాగేనూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. సన్న కారప్పూస, కొత్తిమీర, ఉల్లిగడ్డ తరుగుతో గార్నిష్ చేస్తే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు.

 బెడ్​ రోల్స్  తయారీకి కావాల్సినవి 
 

  • బ్రెడ్ స్లైసులు-నాలుగు
  • ఉప్పు- తగినంత
  • క్యారెట్ ముక్కలు (ఉడికించి)- అర కప్పు
  • ఆలుగడ్డ ముక్కలు (ఉడికించి)- అర కప్పు
  • బీన్స్​ ముక్కలు (ఉడికించి)- అర కప్పు
  • పచ్చిమిర్చి తరుగు - ఒక టీ స్పూన్ 
  • అల్లం తరుగు - ఒక టీ స్పూన్
  • ఆమ్​ చూర్- ఒక టీ స్పూన్
  • జీలకర్ర పొడి - ఒక టీ స్పూన్ 
  • నిమ్మరసం- ఒక టీ స్పూన్ 
  • నూనె - తగినంత,
  •  వేగించిన బ్రెడ్ ముక్కలు

బ్రెడ్​ రోల్స్​ తయారీ విధానం 

పాన్ లో  నూనెవేడి చేసి పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసి వేగించాలి. ఉడికించిన క్యారెట్, ఆలుగడ్డ, బీన్స్ ముక్కలు వేసి ఇంకాసేపు మగ్గించాలి. అందులో ఉప్పు, జీలకర్ర పొడి కూడా వేసి బాగా కలిపి స్టవ్ ఆపేయాలి. 

తర్వాత నిమ్మరసం, వేగించిన బ్రెడ్ ముక్కలు వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేయాలి. అంచులు తీసిన బ్రెడ్ స్లైస్ ని నీళ్లలో ముంచి తీయాలి. 

నీళ్లన్నీ వడిసిపోయాక సిద్ధం చేసుకున్న ఉండల్ని స్లైసు మధ్యలో పెట్టి రోల్స్ లా చుట్టాలి. వాటిని కాగేనూనెలో వేసి డీప్ ఫ్రై చేసి, పైనుంచి ఆమ్ చూర్ పొడి చల్లాలి. అంతే, హెల్దీ అండ్ టేస్టీ బ్రెడ్ రోల్స్ రెడీ.

 బ్రెడ్​ కట్ లెట్  తయారీకి కావాల్సినవి 

  • బ్రెడ్ స్లైసులు- నాలుగు
  •  ఆలుగడ్డలు(ఉడికించిన)రెండు 
  • పచ్చిమిర్చి తరుగు - ఒక టీ స్పూన్ 
  • ఉప్పు,కారం- తగినంత 
  • ఛాట్ మసాలా- ఒక టీ స్పూన్ 
  • జీలకర్ర పొడి - ఒక టీ స్పూన్
  •  కొత్తిమీర - కొద్దిగా 
  • నూనె- రెండు టేబుల్ స్పూన్లు

 బ్రెడ్​ కట్ లెట్  తయారీ విధానం 

 బ్రెడ్ స్లైసుల అంచులు కట్ చేయాలి. ఉడికించిన ఆలుగడ్డల్ని మెదిపి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో బ్రెడ్ స్లైసులు. పచ్చిమిర్చి తరుగు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ఛాట్ మసాలా, కొత్తిమీర వేసి బాగా కలపాలి. 

ఆ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్స్ లా  వత్తాలి. వాటిని పెనం మీద పెట్టి నూనె వేసి రెండు వైపులా కాల్చాలి. వీటిని టొమాటో సాస్​ తో తింటే టేస్ట్ అదిరిపోతుంది.