ఇదెక్కడి మార్కెటింగ్ ఐడియారా బాబు: సేల్స్ చూసి సీఈఓ మైండ్ బ్లాంక్

ఇదెక్కడి మార్కెటింగ్ ఐడియారా బాబు: సేల్స్ చూసి సీఈఓ మైండ్ బ్లాంక్

డిజిటల్ మార్కెటింగ్ అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేవి గూగుల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్. ప్రస్తుత రోజుల్లో వీటిలో యాడ్స్ ఇవ్వాలంటే భారీ బడ్జెట్ వెచ్చించాల్సి వస్తోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న ఒక ముంబై మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, అందరూ నడిచే రొటీన్ బాటను వదిలి ఎవరూ ఊహించని ఒక క్రేజీ ప్రయోగం చేశారు. మెటా, గూగుల్ యాడ్స్ ఖరీదుగా మారటంతో ఏకంగా అడల్ట్ వెబ్‌సైట్లలో తమ కంపెనీ ఉత్పత్తుల ప్రకటనలు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. మొదటి ప్రయత్నంలో దెబ్బతిన్నా.. ఆ తర్వాత చేసిన ఒక చిన్న మార్పుతో ఊహించని స్థాయిలో అమ్మకాలను సాధించి డిజిటల్ మార్కెటింగ్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా నిలిచారు.

ఒక ప్రముఖ మార్కెటింగ్ సంస్థలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న లక్ష్య ఎస్, తాను గతంలో ఒక హెల్త్ సప్లిమెంట్స్ బ్రాండ్‌కు తాత్కాలిక సీఈఓగా ఉన్నప్పుడు ఈ వినూత్న ప్రయోగాన్ని అమలు చేశారు. ఆ సమయంలో గూగుల్, మెటా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రతి వెయ్యి ఇంప్రెషన్లకు రూ.300 నుండి రూ.500 వరకు ఖర్చవుతుండేదట. ఈ ప్రకటనల వ్యయం రోజురోజుకూ భారంగా మారుతుండటంతో.. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మందిని చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతికారు. ఈ క్రమంలోనే అడల్ట్ వెబ్‌సైట్లలో యాడ్స్ ఇవ్వడం చాలా చౌక అని గుర్తించాడు. అక్కడ కేవలం 9 పైసలకే వెయ్యి ఇంప్రెషన్లు లభించడంతో వెంటనే ప్లాన్ అమలు చేశాడు. 

అడల్ట్ వెబ్‌సైట్లను చూసేవారిలో మెజారిటీ పురుషులే ఉంటారు కాబట్టి.. లైంగిక సామర్థ్యాన్ని పెంచే శిలాజిత్ సప్లిమెంట్‌ను ప్రమోట్ చేయాలని లక్ష్య టీమ్ భావించింది. కంటెంట్‌కు సరిపోయే ఆడియన్స్ అక్కడే ఉంటారనే అంచనాతో ప్రకటనలు ప్రారంభించారు. ఊహించినట్లుగానే ఈ యాడ్స్‌కు భారీ స్థాయిలో రీచ్, ట్రాఫిక్, క్లిక్స్ వచ్చాయి. కానీ చిత్రంగా ఒక్క ఆర్డర్ కూడా రాలేదు. క్లిక్స్ వస్తున్నా అమ్మకాలు జరగకపోవడంతో ఆలోచనలో పడ్డారు. కేవలం వయసు, జెండర్ వంటి డెమోగ్రాఫిక్ వివరాలను చూసి ప్రకటనలు ఇస్తే సరిపోదని, ఆ సమయంలో వినియోగదారుడి మానసిక స్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలని వారికి జ్ఞానోదయం అయిందట.

Also Read : మార్కెట్ క్యాప్‌లో భారత్‌ను వెనక్కి నెట్టి టాప్-5 లోకి దూసుకెళ్లిన తైవాన్

వెబ్‌సైట్ డేటాను నిశితంగా పరిశీలించినప్పుడు.. నెటిజన్లు అర్ధరాత్రి వేళల్లో ఈ సైట్లను ఎక్కువగా విజిట్ చేస్తున్నట్లు తేలింది. ఆ సమయంలో వారు ఏదో సామర్థ్య ప్రదర్శన మూడ్‌లో కాకుండా.. తీవ్రమైన అలసటతో ఉంటారని గ్రహించారు. వెంటనే తమ వ్యూహాన్ని మార్చి.. శిలాజిత్ యాడ్స్ తీసేసి, నిద్రలేమి సమస్యను దూరం చేసే స్లీప్ సప్లిమెంట్స్ యాడ్స్ ప్రదర్శించారు. ఈ చిన్న మార్పు అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. అదే రేటుకు, అదే స్థాయిలో వచ్చిన ట్రాఫిక్ ఈసారి భారీగా ఆర్డర్లుగా మారడం ప్రారంభమైంది. వినియోగదారుల అలసటను, వారి మానసిక స్థితిని సరిగ్గా పట్టుకోవడం వల్లే ఈ సేల్స్ సాధ్యమయ్యాయని సదరు సీఈఓ తన అనుభవాన్ని పంచుకున్నారు.

ఈ క్రేజీ ప్రయోగం వల్ల తక్కువ ఖర్చుతో అమ్మకాలు పెరగడమే కాకుండా.. బ్రాండ్ రీకాల్ వాల్యూ కూడా పెరిగింది. యాడ్‌పై క్లిక్ చేయని వారు కూడా ఆ తర్వాత గూగుల్‌లో వెతికి మరీ ప్రొడక్ట్ కొన్నారట. అయితే ఇలాంటి వెబ్‌సైట్లలో యాడ్స్ ఇవ్వడం చట్టబద్ధమేనా అని లింక్డ్‌ఇన్‌లో కొందరు ప్రశ్నించగా.. తాము ప్రదర్శించినవి చట్టబద్ధమైన హెల్త్ ప్రొడక్ట్స్ అని, యాడ్ క్రియేటివ్స్ ఎక్కడా అశ్లీలంగా లేవని లక్ష్య స్పష్టం చేశారు. కేవలం వినియోగదారుల గణాంకాలను మాత్రమే కాకుండా, ప్రకటన చూసే సమయానికి వారి ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకుంటే ఎలాంటి వింత ప్రయోగాలైనా అద్భుతాలు సృష్టిస్తాయని ఈ స్టోరీ నిరూపించింది.