సైబర్ నేరగాళ్లు గ్యాస్ కస్టమర్లపై పడ్డరు

సైబర్ నేరగాళ్లు గ్యాస్ కస్టమర్లపై పడ్డరు

సైబర్‌‌‌‌ నేరగాళ్లు రూట్ మార్చారు. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఇన్నాళ్లు కస్టమర్లను మోసం చేస్తూ వచ్చిన కేటుగాళ్లు.. ఇప్పుడు గ్యాస్‌‌‌‌ వినియోగదారులపై పడ్డారు. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో బుక్‌‌‌‌ చేసుకున్నా సిలిండర్ రాలేదని, సబ్సిడీ రాలేదని కస్టమర్ కేర్​కు కాల్ చేసే వాళ్లనే టార్గెట్ చేస్తున్నారు. వారి బ్యాంకు అకౌంట్లలోని సొమ్మును దోచుకుంటున్నారు.

దోచేస్తారిలా..

పద్మారావు నగర్‌‌‌‌కు చెందిన ఓ కస్టమర్​కు ఉదయాన్నే ఓ ఫోన్ కాల్ వచ్చింది. గ్యాస్‌‌‌‌ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని చెప్పిన సదరు వ్యక్తి.. ‘‘మీకు గ్యాస్‌‌‌‌ రాలేదని చేసిన ఫిర్యాదు మాకు అందింది. వెంటనే సిలిండర్ పంపిస్తాం. అయితే మీ మొబైల్‌‌‌‌ నంబర్‌‌‌‌ సరైనదో కాదో మరోసారి చెక్ చేసుకోండి. వెరిఫికేషన్‌‌‌‌ కోడ్‌‌‌‌తో పాటు మీ వాట్సాప్‌‌‌‌కు ఒక లింక్‌‌‌‌ పంపిస్తాం. మీ వివరాలు అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేయండి” అని చెప్పాడు. మరోసారి ఫోన్‌‌‌‌ చేసి.. ‘‘మీ ఫోన్‌‌‌‌ నంబర్‌‌‌‌కు ఓటీపీని పంపించాం. దాన్ని మాకు చెప్పండి. మధ్యాహ్నం 12.30 గంటల వరకు మీకు గ్యాస్‌‌‌‌ డెలివరీ అవుతుంది” అని చెప్పాడు. ఓటీపీ తెలుసుకుని ఫోన్ పెట్టేశారు. గంట తర్వాత ఫోన్‌‌‌‌ చూసుకుంటే రూ.18 వేలు కట్‌‌‌‌ అయినట్లు బ్యాంకు నుంచి మెసేజ్‌‌‌‌ వచ్చింది. ఇదే తరహాలో మరో వినియోగదారుని అకౌంట్‌‌‌‌ నుంచి రూ. 23 వేలు కట్‌‌‌‌ అయ్యాయి. ఇలా చాలా మంది కస్టమర్లు డబ్బులు కోల్పోయి గ్యాస్‌‌‌‌ డీలర్లను ఆశ్రయిస్తున్నారు.

సర్వర్ నుంచి డేటా చోరీ చేసి..

ప్రధానంగా రిటైర్డ్‌‌‌‌ ఉద్యోగులు, సీనియర్‌‌‌‌ సిటిజన్లను టార్గెట్‌‌‌‌ చేసుకుని సైబర్‌‌‌‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. గ్యాస్‌‌‌‌ రాలేదని, సబ్సిడీ రాలేదని వచ్చే ఫిర్యాదుల డేటాను ఆయా కంపెనీల సర్వర్ల నుంచి సైబర్ నేరగాళ్లు చోరీ చేస్తున్నారు. కంపెనీ సిబ్బంది నుంచి సమాచారం పొందుతున్నారా? లేక వెబ్​సైట్లను హ్యాక్‌‌‌‌ చేస్తున్నారా అనే దానిపై స్పష్టత లేదు.