
హైదరాబాద్, వెలుగు: ఈగల్ (యాంటీ నార్కోటిక్స్ యూనిట్) సెల్ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెర తీశారు. ఈగల్ యాంటీ నార్కోటిక్స్ యూనిట్‌లో హోంగార్డుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. పదో తరగతి పాసైన అభ్యర్థులు అర్హులని, నెలకు రూ.25 వేల నుంచి రూ.26 వేల వరకు జీతంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ప్రచారం చేశారు.
సెప్టెంబర్ 9న జాయినింగ్ రిపోర్ట్ తరువాత 15 రోజులు ట్రైనింగ్ ఇస్తామని కేటుగాళ్లు పేర్కొన్నారు. కాగా.. ఇది పూర్తిగా అవాస్తవమని ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ పోలీసు శాఖగానీ, ఈగల్ సెల్ నుంచిగానీ ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదని వెల్లడించారు.