
రాయపర్తి, వెలుగు: ఆన్‌లైన్ జాబ్‌తో పాటు డబ్బులు డిపాజిట్‌చేస్తే కమీషన్ వస్తుందంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు ఓ యువకుడి నుంచి రూ. 6.69 లక్షలు దోచుకున్నారు. ఈ ఘటన వరంగల్‌జిల్లా రాయపర్తి మండలంలో వెలుగుచూసింది. ఎస్సై ముత్యం రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కేశవాపురం శివారు జయరాంతండాకు చెందిన భూక్య సంతోష్ ఫోన్‌కు ఈ నెల 9న రాయల్‌మింట్ లిమిటెడ్ పేరుతో ఓ మెసేజ్ వచ్చింది. ఆన్‌లైన్‌లో ప్రైవేట్ జాబ్‌తో పాటు, డబ్బులు పంపితే కమీషన్ వస్తుందంటూ నమ్మించారు.
దీంతో సంతోష్ రూ.10 వేలు పంపగా.. రూ.3 వేలు కమీషన్‌గా ఇచ్చారు. తర్వాత రూ. 19,075 చెల్లించడంతో రూ.35 వేలు వచ్చాయి. తర్వాత మళ్లీ రూ.30,640 చెల్లిస్తే ఎక్కువ కమీషన్‌వస్తుందంటూ సైబర్ నేరగాళ్లు చెప్పడంతో సంతోష్ ఆ డబ్బులు సైతం పంపించాడు. కానీ తర్వాత ఎలాంటి కమిషన్ రాలేదు. దీంతో కమీషన్ ఎందుకు ఇవ్వడం లేదని సైబర్ నేరగాళ్లను సంప్రదించగా.. చిన్న తప్పు చేశారని, రూ.2,05,788 చెల్లిస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పారు.
దీంతో నమ్మిన సంతోష్ ఆ డబ్బులను వారు చెప్పిన అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఆ తర్వాత సైబర్ నేరగాళ్లు పలు కారణాలు చెబుతూ మొత్తం రూ.6.95 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. అయినా డబ్బులు, కమీషన్ తిరిగి రాకపోవడం, వారి నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన సంతోష్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.