- ముంబై ట్రేడింగ్ కంపెనీ ప్రతినిధులమంటూ బురిడీ
- భారీ లాభాల ఆశ.. డబ్బులు తీసుకోవాలంటే కమిషన్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ వ్యాపారికి రూ.3.90 కోట్లకు పైగా టోకరా వేశారు. చివరకు అసలు, లాభాలు వెనక్కి ఇవ్వకుండా కమిషన్ పేరుతో డబ్బులు డిమాండ్ చేయడంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిజాంపేట బాచుపల్లిలోని హిల్ కాలనీకి చెందిన 64 ఏళ్ల వ్యాపారికి సెప్టెంబర్ 2న వాట్సాప్‌లో యూఐఆర్‌ఐఎక్స్ పేరుతో ట్రేడింగ్ గ్రూప్ లింక్ వచ్చింది.
అందులో చేరిన తర్వాత రియా కపూర్, రవి కుమార్ పేర్లతో కొందరు ఫోన్ చేశారు. తాము ముంబైకి చెందిన ట్రేడింగ్ సంస్థ ప్రతినిధులమని పరిచయం చేసుకున్నారు. తమ ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడులు పెడితే ఆరు నెలల్లో లాభాలు వస్తాయని నమ్మించారు. మొదట రూ.50 వేలతో పెట్టుబడి పెట్టిన వ్యాపారి.. సెప్టెంబర్ 2 నుంచి అక్టోబర్ 27 వరకు విడతలవారీగా మొత్తం రూ.3,90,26,789 జమ చేశాడు.
అసలు, లాభాలు వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నించగా.. లాభాలపై 10 శాతం కమిషన్ చెల్లిస్తేనే విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతిస్తామని నిందితులు చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేశాడు. బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ఆన్‌లైన్ లావాదేవీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
