డిగ్రీలో సైబర్ సెక్యూరిటీ సబ్జెక్ట్

డిగ్రీలో సైబర్ సెక్యూరిటీ సబ్జెక్ట్
  • వచ్చే ఏడాది నుంచి అమల్లోకి.. 
  • సిలబస్ తయారీకి 10 మందితో కమిటీ  
  • హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నిర్ణయం 

హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరాలపై స్టూడెంట్లలో అవగాహన కల్పించడంతో పాటు వాటిని నివారించేందుకు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా డిగ్రీ ఫస్టియర్ లో సైబర్ సెక్యూరిటీ అంశాన్ని ఒక సబ్జెక్టుగా పెట్టాలని నిర్ణయించింది. సిలబస్ తయారీకి 10 మందితో కమిటీ ఏర్పాటు చేసింది. గురువారం హైదరాబాద్ లోని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీసులో చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఆధ్వర్యంలో వివిధ వర్సిటీల ప్రొఫెసర్లు, పోలీస్ అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లింబాద్రి మాట్లాడుతూ.. 2023–24 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ ఫస్టియర్ లో అన్ని కోర్సుల్లో సైబర్ సెక్యూరిటీ సబ్జెక్టును తప్పనిసరి చేయనున్నట్టు తెలిపారు. ఈ సబ్జెక్టుకు రెండు  క్రెడిట్స్ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.

ఫస్ట్ సెమిస్టర్​లో ఈ సబ్జెక్టు ఉంటుందని, సెకండ్ సెమిస్టర్​లోనూ కొనసాగించాలా? లేదా? అనే దానిపై ఆలోచిస్తున్నామని చెప్పారు. ‘‘దేశంలో టెక్నాలజీ పెరుగుతుండటంతో సైబర్ నేరాలూ పెరుగుతున్నాయి. వీటిపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు సైబర్ సెక్యూరిటీ సబ్జెక్టును ప్రవేశపెడుతున్నాం. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో బుక్స్ తయారు చేసి అందుబాటులో ఉంచుతాం. వర్చువల్​ ల్యాబ్స్, క్లాసులూ నిర్వహిస్తాం” అని వెల్లడించారు. సిలబస్ కమిటీలో పోలీస్ డిపార్ట్​మెంట్ నుంచి దేవేందర్ సింగ్, కల్మేశ్వర్, ఓయూ ప్రొఫెసర్లు జీబీ రెడ్డి, శ్యామల, పీవీ సుధా, జేఎన్టీయూ ప్రొఫెసర్లు కామాక్షి ప్రసాద్, విజయకుమారి, నల్సార్ వర్సిటీ ప్రొఫెసర్ కేవీకే శాంతి, ఐఐటీహెచ్ ప్రొఫెసర్లు మారియా ఫ్రాన్సిక్స్, ప్రవీణ్ తమ్మన ఉన్నారని వివరించారు.