- డ్రైవ్‌లో ఐటీ ఉద్యోగులు, ఎన్జీఓలనూ భాగస్వామ్యం చేస్తం
- సీఎంసీ కమిషనర్ సృజన వెల్లడి
గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ ను పక్కా ప్రణాళికతో క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చేందుకు మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) నడుం బిగించింది. ఇందులో భాగంగా కొత్తగా చేపట్టిన ‘సైబరాబాద్ క్లీన్ స్వీప్’ డ్రైవ్.. శనివారం ఉదయం పటాన్చెరు నుంచి బీహెచ్ఈఎల్, గచ్చిబౌలి, ఖాజాగూడ, లాంకోహిల్స్ మీదుగా మణికొండ వరకు సుమారు 22 కిలోమీటర్ల మేర ఒక యజ్ఞంలా సాగింది.
ఈ భారీ ఆపరేషన్ కోసం మొత్తం మార్గాన్ని 500 మీటర్ల చొప్పున 44 భాగాలుగా విభజించి, 128 మంది అధికారులు, 750 మంది సిబ్బందిని రంగంలోకి దింపారు. ఈ ఒక్కరోజే రోడ్ల వెంట పేరుకుపోయిన ఇసుక, నిర్మాణ వ్యర్థాలు, పాత కేబుల్ వైర్లు కలిపి దాదాపు 1000 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించి రికార్డు సృష్టించారు.
రూ. 11 లక్షల ఫైన్లు వేశాం..
ఈ మెగా డ్రైవ్ సక్సెస్ కావడంతో సాయంత్రం గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ సృజన మాట్లాడారు. కేవలం శుభ్రం చేయడమే కాదు.. నిబంధనలు అతిక్రమించి రోడ్లపై చెత్త వేసిన వ్యక్తులు, వ్యాపార సముదాయాలకు దాదాపు రూ. 11 లక్షల వరకు జరిమానా విధించామని వెల్లడించారు.
ఐటీ హబ్‌గా ఉన్న సైబరాబాద్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే ఈ డ్రైవ్‌లో ఐటీ ఉద్యోగులను, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేస్తామని, ప్రతి వారాంతం ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. అంతేకాకుండా వానాకాలంలోపే 312 చెరువుల్లోని గుర్రపుడెక్కను తొలగించడం, 15 లక్షల మొక్కలు నాటడం, నాలాల పూడికతీత వంటి పనులను పూర్తి చేస్తామని, త్వరలోనే చెత్త ఆటోలను ఈవీ లుగా మార్చబోతున్నామని ఒక విజన్‌తో కూడిన భవిష్యత్ కార్యాచరణను వివరించారు.
ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ ఉక్కుపాదం
- 54 అక్రమ నిర్మాణాల తొలగింపు
- ఇకపై ప్రతి శనివారం స్పెషల్ డ్రైవ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కలిసి రంగంలోకి దిగారు. శనివారం మొదటి విడతగా రెండు సర్కిళ్లలో ఈ డ్రైవ్ కొనసాగింది. అమీర్‌పేట్ సర్కిల్లో ఫుట్‌పాత్‌లపై ఉన్న 32 ఆక్రమణలను, బడంగ్పేట్ సర్కిల్లో 22 ఆక్రమణలతో పాటు అదనంగా ఉన్న 22 తాత్కాలిక సైన్ బోర్డులను తొలగించారు.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కొన్ని చోట్ల పోలీసులు సమయం ఇవ్వలేదు. ఇకపై ప్రతి శనివారం ఈ డ్రైవ్ కొనసాగుతుందని, వచ్చేవారం నుంచి అన్నిచోట్ల చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
