కూకట్ పల్లి ఘటనలో ఏం జరిగిందో.. పూస గుచ్చినట్లు వివరించిన సీపీ అవినాష్ మహంతి

కూకట్ పల్లి ఘటనలో ఏం జరిగిందో.. పూస గుచ్చినట్లు వివరించిన సీపీ అవినాష్ మహంతి

హైదరాబాద్: కూకట్ పల్లిలో పదేళ్ల బాలికను హత్య చేసిన ఘటనలో నిందితుడి వివరాలను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ప్రెస్ మీట్లో వెల్లడించారు. నిందితుడికి క్రైమ్ సిరీస్‌లు చూసే అలవాటు ఉందని ఆయన చెప్పారు. ఆగస్ట్ 18న కూకట్ పల్లిలో 10 ఏళ్ల బాలిక హత్య జరిగిందని, 14 ఏళ్ల బాలుడు హత్య చేశాడని సీపీ తెలిపారు. కేసు విచారణలో పోలీసులను నిందితుడు తప్పుదారి పట్టించాడని, పేపర్లో రాసుకొని నెల క్రితమే నిందితుడు చోరీకి ప్లాన్ చేశాడని చెప్పారు. సీపీ వెల్లడించిన వివరాల ప్రకారం.. తనకు నచ్చిన బ్యాట్ కోసమే బాలిక ఇంటికి నిందితుడు వెళ్లాడు. ఎన్నిసార్లు అడిగినా డబ్బు గురించి విచారణలో నిందితుడు చెప్పడం లేదు. 

బ్యాట్‌ తీసుకొని వెళ్తుండగా దొంగ దొంగ అని అరుస్తూ బాలిక అతనిని అడ్డుకుంది. పారిపోయేందుకు నిందితుడు ప్రయత్నించాడు. నిందితుడి చొక్కాను పట్టుకుని బయటకు పోనివ్వకుండా బాలిక అడ్డగించింది. దీంతో బాలికను అతను నెట్టేశాడు. ఆమె మంచంపై పడిపోయింది. ఆ తర్వాత విచక్షణారహితంగా కత్తితో పొడిచి నిందితుడు భవనం పైన ఉన్న పిట్టగోడ దూకి పారిపోయాడు. విచారణలో నిందితుడు నేరం ఒప్పుకున్నాడు. పోలీసుల తనిఖీల్లో నిందితుడి లేఖ, కత్తి దొరికింది. స్పెషల్ ఫోరెన్సిక్‌ టీం నిందితుడిని గుర్తించింది.

హైదరాబాద్‌‌లో సంచలనం సృష్టించిన కూకట్‌‌పల్లి బాలిక హత్య కేసు మిస్టరీ వీడిన సంగతి తెలిసిందే. ఆమెను పక్కింట్లో ఉండే పదో తరగతి బాలుడే హత్య చేసినట్టు తేలింది. చోరీ చేయడం కోసం సహస్ర ఇంటికి వెళ్లిన నిందితుడు.. తనను చూసిందనే కారణంతో ఆమెను దారుణంగా హత్య చేశాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. దొంగతనం ఎలా చేయాలి? తర్వాత ఎలా ఇంటికి తిరిగి రావాలి? అని నిందితుడు ముందే ఓ పేపర్‌‌‌‌పై రాసుకున్నాడు. దొంగతనం చేసి వచ్చేప్పుడు ఆ ఇంట్లో గ్యాస్​ ఆన్​చేసి రావాలని అనుకున్నాడు. దీని వల్ల ఫైర్​యాక్సిడెంట్​జరిగి అంతా కాలిపోతుందని భావించాడు.

ALSO READ : హైడ్రా ఇప్పుడు చేస్తున్న పనులు..

పైగా హత్య జరిగిన రోజు అంగీపై రక్తపు మరకలు పడగా, వాటిని చూసిన నిందితుడి తల్లిదండ్రులు కూడా ఏమీ మాట్లాడలేదు. దీంతో విషయం బయటపడలేదు. విచారణలో భాగంగా పోలీసులు సహస్ర ఇంటికి వచ్చి వెళ్తున్నా సదరు బాలుడిపై ఏ మాత్రం అనుమానం రాలేదు. సీసీ కెమెరాల్లోనూ బయటి వాళ్లు వచ్చినట్టు ఎలాంటి ఆధారాలు కనిపించకపోవడంతో ఆ బిల్డింగులో ఉంటున్నవారి చుట్టూనే ఇన్వెస్టిగేషన్​నడిచింది. చివరకు ఆ బిల్డింగు చుట్టుపక్కల వారిని విచారిస్తుండగా బాలుడు మాట్లాడిన ఒక్క మాట అతడిపై అనుమానం కలిగేలా చేసింది. పోలీసులు తమదైన పద్ధతిలో విచారించగా అసలు విషయం బయటపడింది.