పండక్కి ఊరెళ్తున్నారా..? అయితే.. జాగ్రత్త! చోరీల నివారణకు పోలీసుల సూచనలు ఇవే

పండక్కి ఊరెళ్తున్నారా..? అయితే.. జాగ్రత్త! చోరీల నివారణకు పోలీసుల సూచనలు ఇవే

దసరా అంటే తెలంగాణలో పెద్ద పండుగ. అందుకే పట్టణాల్లో ఉండే వాళ్లు చాలామంది తమ సొంతూళ్లకు వెళ్తుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి సొంతూర్లకు వెళ్లి ఎంజాయ్ చేసి, మళ్లీ తిరిగి వస్తుంటారు. అయితే.. ఇదే అదనుగా దొంగలు రెచ్చిపోయే ప్రమాదం ఉంది. తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసుకుని.. అందినకాడిన దోచుకెళ్తుంటారు. వీళ్లకు పగలు, రాత్రి అనే తేడా లేకుండా చోరీలు చేస్తుంటారు. ఇలా ప్రతియేటా ఎక్కడో ఒక చోట చోరీలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే పోలీసులు ముందస్తుగానే అలర్ట్​అయ్యారు. ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. జాగ్రత్తగా ఉండండి.. అని పదే పదే సూచిస్తున్నారు. దొంగతనాల నివారణకు సైబరాబాద్ పోలీసులు ప్రత్యేకంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

సైబరాబాద్ పోలీసుల సూచనలు

* ఎవరైనా సరే తమ ఊర్లకు వెళ్లాల్సి వస్తే విలువైన బంగారు, వెండి, ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్ల లో భద్రపర్చుకోవాలని, లేదంటే ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోండి అని సూచిస్తున్నారు. 

* సెలవులలో బయటకు వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సర్ ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. 

* ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉన్న తాళం అమర్చుకోవాలని చెబుతున్నారు. 

* తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే దగ్గరలోని స్థానిక పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.

*  కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే.. వెంటనే స్థానిక పోలీసు స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. లేదా డయల్ 100 కు ఫోన్ చేయమని చెబుతున్నారు.

*  వాహనాలను తమ ఇంటి ఆవరణలోనే పార్కు చేసుకోవాలని, ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా తాళాలు వేయాలని హెచ్చరిస్తున్నారు. వీలైతే బండి చక్రాలకు చైన్స్ తో కూడా లాక్ వేయడం మంచిదంటున్నారు.

* నమ్మకమైన వాచ్ మెన్ లను మాత్రమే సెక్యూరిటీ గార్డులుగా నియమించుకోవాలని సూచిస్తున్నారు. 

* ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలను ఆన్​ లైన్​ లో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలంటున్నారు.

*  ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందు చెత్త చెదారం, న్యూస్​ పేపర్స్, పాలప్యాకెట్లు జమ కానివ్వకుండా చూడాలని సూచిస్తున్నారు. వాటిని కూడా గమనించి దొంగలు చోరీలకు పాల్పడుతారని హెచ్చరిస్తున్నారు.

*  మెయిన్ డోర్ కి తాళం వేసినప్పటికి అది కనిపించకుండా కర్టెన్స్ తో కవర్ చేయాలంటున్నారు.

Also Read : AMR సంస్థ ఆఫీసు, ఛైర్మన్ మహేష్ రెడ్డి ఇంట్లో ఐటీ శాఖ తనిఖీలు

* బయటకు వెళ్లేటప్పుడు ఇంటి లోపల, బయట కొన్ని లైట్లు వేసివుంటే మంచిదంటున్నారు. 

* కాలనీల్లో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా కమిటీలను నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు.

* ఎవరిమీదైనా అనుమానం వస్తే 100 టోల్ ఫ్రీ నెంబర్ కు గాని,  సైబరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ 9490617100 కు లేదా మా వాట్సాప్ నెంబర్ 9490617444 కు dial చేయాలని కోరుతున్నారు.