‘ఫ్యాన్సీ’ మోసగాడు..ఎంపీ, ఎమ్మెల్యేలే టార్గెట్

‘ఫ్యాన్సీ’ మోసగాడు..ఎంపీ, ఎమ్మెల్యేలే టార్గెట్

హైదరాబాద్, వెలుగు: ఫ్యాన్సీ మొబైల్ నంబర్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ చీటర్ ఆటకట్టించారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఎమ్మెల్యే, ఎంపీలు, వ్యాపారవేత్తలను టార్గెట్ చేసి వైట్ కాలర్ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జాయింట్ సీపీ, సీసీఎస్ అవినాష్ మహంతి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ రాజమండ్రికి చెందిన మద్దెల దీపుబాబు అలియాస్ విఠల్, గోపాల్, ప్రతాప్ రెడ్డి(28) బెంగళూర్ లో నివాసం ఉంటున్నాడు. నకిలీ డాక్యుమెంట్లతో పదుల సంఖ్యలో సిమ్ కార్డులు, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశాడు. ఇంటర్నెట్, సోషల్ మీడియా ఆధారంగా గత ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీలు, కార్పొరేట్ల సమాచారాన్ని సేకరించాడు. ఆ తరువాత ఫ్యాన్సీ మొబైల్ ఫోన్ నంబర్లను అతి తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయని వీఐపీ నంబర్లకు ఎస్ఎంఎస్ పంపేవాడు.

ట్రూ కాలర్ లో ఎయిర్ టెల్ సీఈవో

ట్రూ కాలర్ లో ఎయిర్టెల్ కంపెనీ సీఈఓ గోపాల్ పేరుతో ఫోన్స్ చేసేవాడు. ఆ తరువాత 9899999999, 9123456789, 9999999099, 999999999 ఫాన్సీ నంబర్స్ ను బాధితులకు పంపేవాడు. ఈ నంబర్స్ కోసం చాలా మంది కస్టమర్లు పోటీ పడుతున్నారని నమ్మించి అడ్వాన్స్ గా కొంత డబ్బు వసూలు చేసేవాడు. ఆ తరువాత జీఎస్‌‌టీ సహా ఇతర ట్యాక్స్ ల కోసం మరికొంత డబ్బు ట్రాన్స్ ఫర్ చేయాలని సూచించేవాడు.  ఎయిర్‌‌టెల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రొఫైల్ ఫొటో పేరుతో  ఉన్న నకిలీ బ్యాంక్  అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయించుకునే వాడు.

ఇలా దొరికాడు 

ఇలా గత నెల 19న జానకి రామ్ మోహన్ అనే వ్యాపారికి ఎయిటెల్ కంపెనీ సీఈవో పేరుతో మెసేజ్ వచ్చింది. అందులో ఫ్యాన్సీ మొబైల్ నంబర్లు తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయని ఎయిర్ టెల్ సీఈవో పేరుతో పరిచయం చేసుకుని రూ.45,800 వసూలు చేశాడు. ఆ తరువాత జానకి రామ్ కి ఎలాంటి ఫ్యాన్సీ నంబర్ అందించలేదు. దీంతో బాధితుడు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదనపు డీసీపీ, కేసీఎస్ రఘువీర్ ఆధ్వర్యంలోని బి.మధుసూదన్ తన టీమ్ తో నిందితుడి కోసం గాలించి దీపుబాబును గత నెల 30న బెంగళూర్ లో అరెస్ట్ చేసి స్థానిక కోర్టులో హాజరుపరిచారు. ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ తరలించారు.