
ప్లే స్టోర్‌లో లక్షల సంఖ్యలో ఇన్‌స్టాలేషన్ పర్మిషన్లతో స్మార్ట్ ఫోన్ డేటా హ్యాక్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్,వెలుగు : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడకం ఎక్కువైంది. ఫుడ్ డెలివరీ, ఆన్‌లైన్ మార్కెటింగ్, పేమెంట్ గేట్‌వేస్ ఏది కావాలన్న ప్లే స్టోర్‌లోకి వెళ్లి మొబైల్ లో యాప్స్డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దీన్నే సైబర్ నేరగాళ్లు మంచి అవకాశంగా తీసుకుంటున్నారు. అక్షరం తేడాతో క్లోన్ యాప్స్ క్రియేట్ చేస్తున్నారు. తెలియక వాటిని డౌన్‌లోడ్ చేసుకుంటే పర్మిషన్స్ పేరుతో పర్సనల్ డేటా హ్యాక్ చేస్తున్నారు. ఇలాగే లోన్ యాప్స్ ఇన్‌స్టాలేషన్‌లో ఫోన్ కాంటాక్ట్స్, గ్యాలరీని యాక్సెస్‌లోకి తీసుకుని యాప్ నిర్వాహకులు వేధిస్తున్నారు. ఈ క్రమంలోనే సైబర్ నేరగాళ్లు బ్యాంక్ అకౌంట్స్ కూడా హ్యాక్ చేస్తున్నారు. ఫేక్ యాప్స్ లింక్స్ పంపించి మాల్‌వేర్ ను ఇంజెక్ట్ చేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ అడ్డాగా అందినంతా దోచేస్తున్నారు. రోజురోజు పెరిగిపోతున్న ఫేక్ యాప్స్‌పై అలర్ట్‌గా ఉండాలని పోలీసులు, సైబర్ఎక్స్ పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.
మాల్‌వేర్‌తో ఫ్రాడ్
వెబ్ బ్రౌజర్‌లో కాకుండా చాలామంది ప్లే స్టోర్ నుంచే యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటుంటారు. దీన్ని అవకాశంగా తీసుకుంటోన్న సైబర్ నేరగాళ్లు.. ఫేక్ యాప్స్ క్రియేట్ చేసి స్మార్ట్‌ఫోన్ డేటాను హ్యాక్ చేస్తున్నారు. ప్లే స్టోర్‌లో లక్షల సంఖ్యలో ఫేక్ యాప్స్, మాల్‌వేర్ ఉంటున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు, ఎథికల్ హాకర్స్ గుర్తించారు. అసలైన కంపెనీలు ప్రొవైడ్ చేసే యాప్స్ తరహాలోనే ఫేక్ యాప్స్, మాల్‌వేర్‌ను సైబర్ నేరగాళ్లు ప్లే స్టోర్ లో అప్ లోడ్ చేస్తున్నారు. ఇలాంటి మాల్‌వేర్‌ను గుర్తించేందుకు గూగుల్ సంస్థ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ను సైతం ఏర్పాటు చేసింది. ఈ సాఫ్ట్ వేర్ అనుమానిత యాప్స్, పాప్ అప్స్‌ను ఎప్పటికప్పుడు గుర్తిస్తోంది. అయినా వివిధ కంపెనీల పేర్లతో సైబర్ నేరగాళ్లు క్రియేట్ చేస్తున్న డమ్మీ యాప్స్ ప్లే స్టోర్, ఆన్‌లైన్‌లోకి వస్తున్నాయి.
సుమారు 20 వేలకు పైగానే..
సైబర్ నేరగాళ్లు ఒరిజినల్యాప్ మాదిరిగానే ఫేక్ యాప్స్ ను డెవలప్ చేస్తుండగా.. ఇవి అక్షరం తేడాతో వెబ్ పేజ్‌లో గుర్తించలేని విధంగా ఉంటాయి. ఇలాంటి యాప్స్‌ను వెబ్‌బ్రౌజర్స్,ప్లే స్టోర్స్‌లో అప్లోడ్ చేస్తుంటారు. సుమారు 20 వేలకు పైగా ఫేక్ యాప్స్ ఉన్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. దీంతో యాప్ డౌన్‌లోడ్ చేసుకునే సమయాల్లో అలర్ట్‌గా ఉండాలని సూచిస్తున్నారు. ఇన్‌స్టాలేషన్ చేసుకునేటప్పుడు వచ్చే పర్మిషన్, సబ్మిట్ ఆప్షన్స్ పై జాగ్రత్తగా ఉండాలి. పాప్‌అప్స్‌ను పరిశీలించాలి. పర్మిషన్‌లో ఎలాంటి వివరాలు అడుగుతున్నారో గుర్తించాలి. లొకేషన్ ఆప్షన్‌కి పర్మిషన్ ఇస్తే స్మార్ట్‌ఫోన్ ద్వారా మన ప్రతి కదలికను గుర్తించే అవకాశం ఉంది. కేవైసీ అప్‌డేట్ పేరుతో వచ్చే మెసేజ్ లింక్స్ ఓపెన్ చేస్తే సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి స్మార్ట్‌ఫోన్
హ్యాక్ కి గురవుతుంది. దీంతో బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిన ఫోన్ నంబర్, ఓటీపీ, సీవీవీ నంబర్స్‌తో సహా మొత్తం డేటాను సైబర్ మోసగాళ్లు దోచేస్తారు.
రేటింగ్, కామెంట్స్చూస్తుండాలి
ఒరిజినల్ వెబ్‌సైట్లను గుర్తించి సంబంధిత కంపెనీల యాప్స్ మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్ డెవలప్ చేసిన కంపెనీ, రేటింగ్, యూజర్స్ కామెంట్స్ చూస్తుండాలి. చాలా తక్కువ సంఖ్యలో యాప్ డౌన్‌లోడ్స్ కనిపిస్తే వాటిని అనుమానించాలి. ఏపీకే అనే లెటర్స్ కనిపిస్తే అవి ప్రమాదకరమని గుర్తించాలి. యాప్ ఇన్‌స్టాల్ చేసే సమయాల్లో వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దు. పేమెంట్స్, గ్యాలరీ, కాంటాక్ట్స్‌కి సంబంధించిన వివరాలు అడిగే యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోకపోవడం మంచిది. తప్పనిసరి అయితేనే ఫోన్ సెట్టింగ్స్‌లో పర్మిషన్స్ ఆప్షన్ డిజేబుల్ చేయాలి. సైబర్ సెక్యూరిటీ పాటించని యాప్స్‌కు దూరంగా ఉంటే మంచిది.
క్లోన్ యాప్స్‌తోనే సమస్యలు
యాప్స్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు రివ్యూలు తప్పనిసరిగా చదవాలి. ఏది పడితే అది డౌన్‌లోడ్ చేసుకోవద్దు. ప్రస్తుతం చాలా వరకు క్లోన్ యాప్స్ ఉంటున్నాయి. వీటిలో ఏది ఒరిజినల్, ఏది ఫేక్ అని గుర్తించలేం. థర్డ్ పార్టీ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే యాప్స్‌తో మాల్‌వేర్ ఇంజెక్ట్ అయ్యే చాన్స్ ఎక్కువగా ఉంది. సెట్టింగ్స్‌లో ప్లే ప్రొటెక్షన్ ఆప్షన్‌ను ఎనెబుల్ చేసుకోవాలి. దీంతో ఫేక్ యాప్స్, మాల్‌వేర్‌ను అరికట్టొచ్చు. పర్మిషన్స్‌ను డినై చేసినప్పటికీ యాప్ డౌన్‌లోడ్ అవుతుంది. ఎలాంటి యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నా సెక్యూరిటీ ఫీచర్స్ ఫాలో కావాలి.
-విశ్వనాథ్, ఎథికల్ హ్యాకర్