క్రెడిట్​ కార్డు లిమిట్..పెంచుతామని రూ.3లక్షలు కొట్టేశారు

క్రెడిట్​ కార్డు లిమిట్..పెంచుతామని రూ.3లక్షలు కొట్టేశారు

బషీర్ బాగ్, వెలుగు : క్రెడిట్‌కార్డు లిమిట్‌ పెంచుతామని నమ్మబలికి సిటీకి చెందిన ఓ వ్యక్తి నుంచి సైబర్​నేరగాళ్లు రూ.లక్షలు కొట్టేశారు. సిటీ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌కి చెందిన ఓ వ్యక్తికి యాక్సిస్‌ క్రెడిట్‌కార్డు ఉంది. ఇటీవల అతనికి ఓ వ్యక్తి వాట్సాప్​కాల్​చేశాడు. తాను యాక్సిస్​బ్యాంక్​నుంచి కాల్​చేస్తున్నానని, క్రెడిట్​కార్డు లిమిట్​ను రూ.3లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచుతామని నమ్మించాడు. పాన్‌, ఆధార్​కార్డు వివరాలు, పుట్టిన తేదీ, ఈ-మెయిల్‌ ఐడీ తెలుసుకున్నాడు. అనంతరం ఓ లింక్​పంపి క్లిక్​చేయమన్నాడు. తర్వాత ఓటీపీలు తెలుసుకుని బాధితుడి రెండు క్రెడిట్‌కార్డుల నుంచి రూ.2,90,253 కాజేశాడు. బాదితుడి ఫిర్యాదుతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

పార్ట్​టైమ్​ జాబ్ పేరుతో..  

సికింద్రాబాద్‌కి చెందిన ఓ వ్యక్తికి టెలిగ్రామ్‌లో పార్ట్‌టైమ్‌ జాబ్​అంటూ మెసేజ్‌ వచ్చింది. అందులోని నంబర్​కు కాల్​చేస్తే గూగుల్‌లో వారు చెప్పిన ప్రదేశాలకు 5 స్టార్‌ రేటింగ్స్‌ ఇస్తే డబ్బు సంపాదించవచ్చని సైబర్​నేరగాళ్లు నమ్మించారు. అనంతరం ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టాలని, అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి మొదట రూ.98,000, తర్వాత లాభాల విత్‌డ్రా కోసం మరింత తీసుకున్నారు. అలా విడతల వారీగా రూ.2,91,930 కాజేశారు. చివరికి మోసపోయానని తెలుసుకున్న బాధితుడు సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.