 
                                    ఓ వ్యక్తి అకౌంట్ నుంచి దాదాపు 50 లక్షల రూపాయలను సైబర్ దొంగలు కాజేశారు. అది కూడా ఎలాంటి ఓటీపీని అడగకుండానే.. !! ఓటీపీ లేకుండా అరకోటిని ఎలా కొట్టేశారు ? అనే సందేహం ఎవరికైనా వస్తుంది. 50 లక్షల రూపాయలను నాలుగైదు వేర్వేరు అకౌంట్లలోకి సైబర్ దొంగలు మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. కొన్ని రోజుల క్రితం రాత్రి 7 నుంచి 8.45 గంటల మధ్య సైబర్ దొంగల నుంచి బాధిత వ్యక్తికి వరుస కాల్స్ వచ్చాయి.
ఫోన్ లిఫ్ట్ చేసిన ప్రతిసారీ..
ఢిల్లీలోని ఒక సెక్యూరిటీ సర్వీసెస్ కంపెనీలో డైరెక్టర్ గా వ్యవహరించే బాధిత వ్యక్తి ఆ కాల్స్ వెనుక దాగిన మర్మాన్ని గుర్తించలేకపోయారు. ఆయన ఆ కాల్స్ కు జవాబిచ్చేందుకు ఫోన్ లిఫ్ట్ చేసిన ప్రతిసారీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతూ పోయాయి. ఒకసారి 12 లక్షలు.. మరో రెండుసార్లు చెరో 10 లక్షలు.. ఇంకోసారి రూ.4.60 లక్షలు అకౌంట్ నుంచి మరో అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ అయినట్లు మెసేజ్ లు వచ్చాయి. ఇలా మొత్తం రూ.50 లక్షలను సైబర్ దొంగలు తమ అకౌంట్లలోకి పంపించుకున్నారు. దీంతో లబోదిబోమని గుండెలు బాదుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసులకు ఫిర్యాదు
తనకు కొత్త నంబర్స్ నుంచి కాల్స్ రావడం.. ఆ వెంటనే అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోవడం గురించి ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీస్ సైబర్ నిపుణులు ఈ చీటింగ్ యాక్టివిటీ జార్ఖండ్ లోని జాంతారా ఏరియా కేంద్రంగా జరిగిందని గుర్తించారు. సైబర్ దొంగలు కొంత కమిషన్ ఇస్తామనే ఆశచూపి.. పలువురి నుంచి బ్యాంకు అకౌంట్ నంబర్లు తీసుకొని వాటిలోకి హ్యాకింగ్ డబ్బులు (రూ.50 లక్షలు) పంపించి ఉండొచ్చని తెలిపారు. “అయితే ఈ డబ్బులు ట్రాన్స్ ఫర్ అయింది ఒక కరెంట్ అకౌంట్ నుంచి!! ఈ కరెంట్ అకౌంట్ నుంచి ఏకకాలంలో పెద్దమొత్తంలో నగదును ఇతర అకౌంట్లకు బదిలీ చేసే ఫెసిలిటీని యాక్టివేట్ చేసి ఉంచారు. దీనివల్ల సైబర్ దొంగలు ఇంత ఈజీగా పెద్ద మొత్తాలను తమ అకౌంట్లను ట్రాన్స్ ఫర్ చేసుకోగలిగారు”అని పోలీసులు వివరించారు.
ఎలా హ్యాక్ చేయగలిగారు ?
కేవలం ఫోన్ కాల్స్ చేయడం ద్వారా బ్యాంకు అకౌంట్ ను సైబర్ దొంగలు ఎలా హ్యాక్ చేయగలిగారు ? అనే దానికి సైబర్ నిపుణుల నుంచి ఒక సమాధానం వినిపిస్తోంది. అదే.. ‘సిమ్ స్వాపింగ్’. బహుశా బాధిత వ్యక్తి ఫోన్ లోని సిమ్ ను సైబర్ దొంగలు స్వాప్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. సిమ్ స్వాప్ చేసిన ఫోన్ కు టెక్ట్స్ మెసేజ్ పంపడం లేదా కాల్ చేయడం ద్వారా హ్యాక్ చేసే వెసులుబాటు ఉంటుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఈ టెక్నిక్ తోనే బాధితుడికి వరుస ఫోన్ కాల్స్ చేసి.. అతడి ఫోన్ కు వచ్చిన ఓటీపీలను ఆడియో టూల్స్ తో రహస్యంగా విని అకౌంట్ ను హ్యాక్ చేసి ఉండొచ్చని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

 
         
                     
                     
                    