కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్‌‌ యాత్ర

V6 Velugu Posted on Apr 01, 2021

కాశ్మీర్‌‌‌‌ నుంచి కన్యాకుమారి వరకు బైక్స్‌‌పై, సైకిల్స్‌‌పై యాత్ర చేసేవాళ్లు చాలామంది. అలాంటివాళ్లలో అదిల్‌‌ టెలి ఒకడు. అదిల్‌‌ కూడా సైకిల్‌‌పై తన యాత్ర కంప్లీట్‌‌ చేశాడు. అందులో ఒక విశేషం ఉంది. అదేంటంటే ఎనిమిది రోజుల్లో టూర్‌‌‌‌ కంప్లీట్‌‌ చేసి గిన్నిస్‌‌ బుక్‌‌ ఆఫ్‌‌ వరల్డ్‌‌ రికార్డ్స్‌‌లో చోటు దక్కించుకోవడం. ఇరవై మూడేళ్ల అదిల్‌‌ జమ్మూ–కాశ్మీర్‌‌‌‌కు చెందిన వాడు. సైక్లింగ్‌‌ అంటే ఇష్టం. దీంతో సైకిల్‌‌పై కాశ్మీర్‌‌‌‌ నుంచి కన్యాకుమారి వరకు వెళ్లాలనుకున్నాడు. అందరిలాగా వెళ్లొస్తే, తన ప్రత్యేకత ఏముందనుకున్నాడు. ఏదైనా ప్రత్యేకంగా సాధించాలనుకున్నాడు. దీనికోసం ఒక గోల్‌‌ సెట్‌‌ చేసుకున్నాడు. సైకిల్‌‌పై అందరికంటే తక్కువ టైమ్‌‌లో కాశ్మీర్‌‌‌‌ నుంచి కన్యాకుమారి చేరుకోవాలనుకున్నాడు. 

ట్రైనింగ్‌‌ కూడా
ఇంతకుముందు ఉన్న రికార్డ్‌‌లు చెరిపేయడం అంత ఈజీగా సాధ్యమయ్యే పని కాదు. దీనికోసం చాలా శ్రమించాలి. అందుకే అదిల్‌‌, అమృత్‌‌సర్‌‌‌‌లో సైక్లింగ్‌‌కు సంబంధించి స్పెషల్‌‌ ట్రైనింగ్‌‌ తీసుకున్నాడు. స్పెషల్‌‌ కోచ్‌‌ సాయంతో నెలల తరబడి ప్రాక్టీస్‌‌ చేశాడు. వేగంగా వెళ్లడానికి చాలా స్టామినా అవసరం. సరైన ట్రైనింగ్‌‌తోనే ఇది సాధ్యం. అందుకే చాలా రోజులు శ్రమపడి టూర్‌‌‌‌కు సిద్ధమయ్యాడు. తను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాను అన్న నమ్మకం కుదిరాకే, టూర్‌‌‌‌ మొదలుపెట్టాడు.

ఎనిమిది రోజుల్లోనే
కాశ్మీర్‌‌‌‌ నుంచి కన్యాకుమారి వరకు దూరం 3,600 కిలోమీటర్లు. ఈ మొత్తం దూరాన్ని అదిల్‌‌ ఎనిమిది రోజుల్లోనే పూర్తి చేయడం విశేషం. గత నెల (మార్చి) 22న కాశ్మీర్‌‌‌‌లో ప్రారంభమైన అతడి సైక్లింగ్‌‌ జర్నీ, 30న పూర్తైంది. ఎనిమిది రోజుల ఒక గంట ముప్పై ఏడు నిమిషాల్లో పూర్తయ్యింది. ఇది ఇప్పటివరకు బెస్ట్‌‌ రికార్డ్‌‌. దీనితో ఇంతకుముందు ఉన్న ఎనిమిది రోజుల ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల రికార్డును అదిల్‌‌ దాటేసి, కొత్త రికార్డ్‌‌ సృష్టించాడు. గిన్నిస్‌‌ బుక్‌‌లో కూడా చోటు సంపాదించాడు. అదిల్‌‌ ఇంతకుముందు కూడా సైక్లింగ్‌‌లో మరో రికార్డ్‌‌ క్రియేట్‌‌ చేశాడు. శ్రీనగర్‌‌‌‌ నుంచి లెహ్‌‌ వరకు దాదాపు 440 కిలోమీటర్ల దూరం, 26 గంటల ముప్పై నిమిషాల్లో పూర్తి చేశాడు

Tagged kashmir, cycling, Guinness record, Kanyakumari

Latest Videos

Subscribe Now

More News