నేడు ఏపీలోకి గులాబ్ తుఫాన్! తెలంగాణపై ఎఫెక్ట్..

నేడు ఏపీలోకి గులాబ్ తుఫాన్! తెలంగాణపై ఎఫెక్ట్..

గులాబ్ తుఫాన్ దృష్ట్యా ఉత్తరాంధ్రలో హైఅలర్ట్ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నానికి ఈశాన్య దిశగా ఉన్న తుఫాన్... ఈ సాయంత్రం కళింగపట్నం మరియు ఒడిశాలోని గోపాల్‎పూర్ మధ్య తీరం దాటనుంది. దీంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలకు ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ చేశారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలపై గులాబ్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని... మిగతా కోస్తా జిల్లాల్లో మోస్తరుగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. గులాబ్ ప్రభావంతో... దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు, గోదావరి జిల్లాలు, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు... తెలంగాణ, విదర్భ, ఛత్తీస్‎గఢ్‎లలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. గులాబ్ దూసుకొస్తుండడంతో... శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ప్రజలను ఏపీ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. 86 వేల మంది మత్స్యకారులను షెల్టర్లకు తరలించే ఏర్పాట్లు చేశారు. తీర ప్రాంతాల్లోని 76 మండల స్థాయి అత్యవసర కేంద్రాలు సెట్ చేశారు. 

ఉత్తరాంధ్ర నుంచి బెంగాల్ వరకు గులాబ్ తుఫాన్ ప్రభావం చూపిస్తోంది. అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. వీటివల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయంతో పాటు మౌళిక వసతులు కూడా దెబ్బతినే చాన్సుందని... భువనేశ్వర్ లోని వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇక కోల్‎కతా పైనా గులాబ్ ప్రభావం ఉంటుందని.. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని కోల్‎కతాలోని వాతావరణ కేంద్రం తెలిపింది.

కాగా.. గులాబ్ తుఫాను కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. తుఫాన్ తీవ్రతను బట్టి రైళ్ల రద్దు, దారి మళ్లించడం, రీషెడ్యూల్ చేయడం వంటివి ఉంటాయని రైల్వే శాఖ తెలిపింది.

For More News..

పిల్లలు పట్టించుకోవడంలేదని.. విషం తాగిన దంపతులు

డ్యూటీకి రాకపోతే రూ.300 ఫైన్